logo

గృహజ్యోతి పథకం అమలులో గందరగోళం

గృహజ్యోతి పథకం అమలు గందరగోళంగా మారుతోంది. చాలా మందికి ఈ పథకం అమలు కాకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. జీరో బిల్లులు కాకుండా రెండు, మూడు నెలల బిల్లు వస్తుండటంతో సందిగ్ధం నెలకొంది.

Published : 13 Jun 2024 03:27 IST

 గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లులు రాలేదని తిమ్మాజిపేట ఎంపీడీవో కార్యాలయానికి వచ్చిన లబ్ధిదారులు 

నాగర్‌కర్నూల్, తిమ్మాజిపేట, న్యూస్‌టుడే : గృహజ్యోతి పథకం అమలు గందరగోళంగా మారుతోంది. చాలా మందికి ఈ పథకం అమలు కాకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. జీరో బిల్లులు కాకుండా రెండు, మూడు నెలల బిల్లు వస్తుండటంతో సందిగ్ధం నెలకొంది. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు ఇచ్చినా ఈ పథకం అమలు కాకపోవడం ఏమిటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగిసినా స్పష్టత లేక పరిస్థితి గందరగోళంగా మారింది. జిల్లాలో సగానికిపైగా లబ్ధిదారులకు ఈ పథకం అమలు కావడం లేదు. మరోవైపు ప్రారంభంలో ఇంటింటికీ విద్యుత్తు సిబ్బంది వచ్చి మీటరు నంబర్లు, రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులను సేకరించి నమోదు చేసుకున్నారు. ఇప్పుడు అవన్నీ తుంగలో తొక్కినట్లయింది. జీరో బిల్లులు రాలేదంటూ మూడు, నాలుగు రోజులుగా తిమ్మాజిపేట, నాగర్‌కర్నూల్‌ ఎంపీడీవో కార్యాలయాలతో పాటు విద్యుత్తు శాఖ ఏఈ కార్యాలయాల వద్దకు వెళ్లి లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రం తిమ్మాజిపేటలో ధర్నా చేశారు. జిల్లాలో 200 యూనిట్లలోపు 1.60 లక్షల విద్యుత్తు గృహ వినియోగదారుల కనెక్షన్లున్నాయి. ఇందులో జూన్‌ నెలలో కేవలం 50 వేల కనెక్షన్లకు మాత్రమే జీరో బిల్లులు వచ్చాయి. మిగతా వారు విద్యుత్తు శాఖ అధికారుల వద్దకు వెళ్తే ప్రజాపాలన సమయంలో ఇచ్చిన దరఖాస్తుల్లో వివరాలు తప్పుగా రాయటం వల్లే సమస్య నెలకొందని చెబుతున్నారు. మళ్లీ ఎంపీడీవో కార్యాలయాల వద్దకు వెళ్లి దరఖాస్తులు ఇవ్వాలని సూచిస్తున్నారు. 

75వేల కనెక్షన్లకే వచ్చాయి..

జిల్లాలో ప్రస్తుతం 75 వేల గృహ కనెక్షన్లకే జీరో బిల్లులు వచ్చాయి. చాలా మంది అర్హులైన వినియోగదారులు కార్యాలయాలకు వచ్చి అడుగుతున్నారు. నమోదు చేసే సమయంలో తప్పుగా చేయటం వల్ల కొంత మందికి జీరో బిల్లులు రాలేదు. తాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. రాని వారు మళ్లీ ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. సిబ్బంది సైతం బిల్లులు కట్టమని ఎవరిని బలవంతంగా అడగటం లేదు. రెండు, మూడు నెలలు అయినా 200 యూనిట్ల లోపు ఉంటే కట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నాం.. కానీ ఇంకా స్పష్టత రాలేదు. 

- శ్రీధర్‌ శెట్టి, డీఈ, విద్యుత్తు శాఖ, నాగర్‌కర్నూల్‌ 

యాప్‌ ఓపెన్‌ కావడం లేదు.. : ప్రజాపాలనకు సంబంధించిన యాప్‌ ఓపెన్‌ కావడం లేదు. ప్రస్తుతం వచ్చిన వారితో దరఖాస్తులను తీసుకుంటున్నాం. యాప్‌ ఓపెన్‌ అయిన తర్వాత ఇచ్చిన దరఖాస్తులను అందులో నమోదు చేస్తాం. అంతవరకు  ఏమి చేయలేం. మా దగ్గరికి వచ్చే లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను తీసుకుంటాం. 

- చంద్రశేఖర్, ఎంపీడీవో, నాగర్‌కర్నూల్‌  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని