logo

వినూత్న ఆహ్వానం.. ఉపాధికి సోపానం

నిశ్చితార్థం, పెళ్లి, రిసెప్షన్, గృహ ప్రవేశం, పుట్టిన రోజు, పుట్టుపంచె, పట్టుచీర, పెళ్లిరోజు వేడుకలు, పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఇలా వేడుక ఏదైనా.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఘనంగా, వైవిధ్యంగా నిర్వహించాలనే తాపత్రయం నేడు ఎక్కువగా కనిపిస్తోంది.

Updated : 13 Jun 2024 05:47 IST

చదువుతూనే ఆదాయం ఆర్జిస్తున్న డిగ్రీ విద్యార్థినులు
ఎన్టీఆర్‌ ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రయోగం 

విద్యార్థినులు రూపొందించిన పెళ్లి ఆహ్వాన పత్రికలు 

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : నిశ్చితార్థం, పెళ్లి, రిసెప్షన్, గృహ ప్రవేశం, పుట్టిన రోజు, పుట్టుపంచె, పట్టుచీర, పెళ్లిరోజు వేడుకలు, పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఇలా వేడుక ఏదైనా.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఘనంగా, వైవిధ్యంగా నిర్వహించాలనే తాపత్రయం నేడు ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పరిస్థితులను అందిపుచ్చుకుంటున్నారు మహబూబ్‌నగర్‌లోని ఎన్టీఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు. వైవిధ్యమైన, అందమైన ఆహ్వాన పత్రికలు, వీడియోలు తయారు చేసి ఇస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు. 

వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సు.. 

ఎన్టీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల వాణిజ్యశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఐఐఎం కలకత్తా సహకారంతో విద్యార్థినులకు డిజిటల్‌ మార్కెటింగ్‌పై సర్టిఫికెట్‌ కోర్సు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా డిజిటల్‌ మార్కెటింగ్, సోషల్‌ మీడియా మేనేజ్‌మెంట్, ఈ-మెయిల్‌ మార్కెటింగ్, పోస్టర్‌ మేకింగ్, వెబ్‌ డిజైనింగ్, యాడ్స్‌ డిజైన్, కన్వా యాప్‌తో డిజైన్ల తయారీని నేర్పించారు. ఈ నైపుణ్యాలతో విద్యార్థినులు చదువు కొనసాగిస్తూనే ఉపాధి పొందుతున్నారు. నేటి ఉరుకులు పరుగుల జీవితంలో వేడుకల కోసం వేలాది మంది బంధు, మిత్రుల ఇంటింటికి వెళ్లి ఆహ్వానాలు అందించే పరిస్థితి ఉండటం లేదు. సామాజిక మాధ్యమాల్లోనే ఆహ్వానాలు పంపిస్తున్నారు. ఇలాంటి వారికి విద్యార్థినులు అద్భుతమైన ఈ-కార్డులు, వీడియోలు తయారు చేస్తున్నారు. ప్రేమించుకుని పెళ్లి చేసుకోబోతున్న ఓ జంట కోసం పరిచయం నుంచి స్నేహం, ప్రేమ, పెళ్లి వరకు దారితీసిన సందర్భాలను కళ్లకు కడుతూ ఒకటిన్నర నిమిషాల నిడివి వీడియో తయారు చేస్తున్నారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి అయితే జంట.. జీవితం అందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, అందరికీ ఆహ్వానం పలుకుతున్న వీడియో రూపొందించి అందిస్తున్నారు. ఇలా వచ్చిన ఆదాయంతో తమ చదువు ఖర్చులు సొంతంగా భరించటంతో పాటు కుటుంబానికి కూడా ఆసరా అవుతున్నారు. 

పట్టుదలతో నేర్చుకున్నా

ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులో భాగంగా ఐఐఎం కలకత్తా శిక్షకులు రూపొందించిన వెడ్డింగ్‌ వీడియో చూసినప్పుడు చాలా వినూత్నంగా అనిపించింది. మొదట్లో చాలా కష్టమనిపించినా తర్వాత పట్టుదలతో నేర్చుకున్నా. వినియోగదారులు ఫొటోలు, వీడియోలు అందిస్తే వారికి నచ్చిన విధంగా ఆహ్వాన పత్రికలు, వీడియోలు రూపొందించి కొంత ఆదాయం సంపాదిస్తున్నాం. ఖర్చులకు ఇంట్లో డబ్బులు అడగాల్సిన అవసరం ఉండదు. 

- పి.నిఖిత, దాచక్‌పల్లి(హన్వాడ)

సీజన్‌లో రూ.15వేలు సంపాదిస్తా..

పెళ్లి చేసుకోబోయే జంటతో చర్చించి ప్రణాళిక, స్క్రిప్ట్‌ రాసుకుంటున్నాం. వారి అభిరుచికి అనుగుణంగా పెళ్లికార్డులు, వీడియోలు రూపొందిస్తున్నాం. ఆహ్వానం అందుకున్న స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయేలా వీడియోలు ఉంటున్నాయి. మాకు చదువుకుంటూనే ఆదాయం సమకూరుతుంది. సీజన్‌లో రూ.10వేల నుంచి రూ.15వేల వరకు వస్తుంది. 

- కె.అపూర్వ, కలెక్టర్‌ బంగ్లా, మహబూబ్‌నగర్‌

ఇష్టానికి  అనుగుణంగా.. 

పోస్టర్‌ మేకింగ్, వెబ్‌సైట్‌ డిజైన్, డిజిటల్‌ మార్కెటింగ్‌లో శిక్షణ పొందా. పెళ్లి జంట ప్రాధాన్యమివ్వాలనుకున్న అంశం ఆధారంగా వీడియో, ఈ-కార్డుల థీమ్‌ ఎంచుకుంటా. వారికి నచ్చినట్లు సిద్ధం చేసి ఆన్‌లైన్‌లో పంపిస్తాం. ప్రేమ పెళ్లి, పెద్దలు నిశ్చయించిన పెళ్లి, పుట్టిన రోజు, నిశ్చితార్థం, గృహప్రవేశం ఇలా వేడుక ఏదైనా ఆధునికతను జోడించి వినూత్నంగా ఆహ్వానాలు తయారు చేస్తాం. చదువుతో పాటు సంపాదనకు ఆస్కారం లభించింది.

బి.మమత, జడ్చర్ల

భరోసా ఇచ్చిన కోర్సు 

ఈ రోజుల్లో చదువొక్కటే సరిపోదు. అనేక నైపుణ్యాలు ఉండాలి. కళాశాలలో నిర్వహించిన సర్టిఫికెట్‌ కోర్సు నా నైపుణ్యాలు పెంచింది. ఉపాధికి భరోసా ఇచ్చింది. కార్డులు, వీడియోలు తయారు చేసిన కొద్దీ నైపుణ్యాలు పెరుగుతున్నాయి. మరింత అందంగా, వినూత్నంగా తయారు చేయాలన్న పట్టుదల కూడా పెరుగుతోంది. డిజిటల్‌ నైపుణ్యాలు నాకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతాయన్న నమ్మకం ఉంది.  

- వైష్ణవి, రహమానియా మజీద్‌ బ్రిడ్జి, మహబూబ్‌నగర్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని