logo

అధికారుల తప్పిదంతో దక్కని ఫలితం

అధికారుల పొరపాటు వల్ల జిల్లా ఇంటర్‌ విద్యాశాఖలో పనిచేసే ఓ చిరుద్యోగి తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. మహబూబ్‌నగర్‌ పట్టణం న్యూ మోతీనగర్‌లో నివాసముండే జి.అయ్యన్న ల్యాబ్‌ అటెండెంట్‌గా స్థానిక ప్రభుత్వ వృత్తివిద్యా కళాశాలలో మినిమం టైం స్కేల్‌ కింద పనిచేస్తూ 28 ఫిబ్రవరి 2022లో ఉద్యోగ విరమణ పొందారు.

Published : 13 Jun 2024 03:44 IST

ఉద్యోగ విరమణ వయస్సు పెంపునకు నోచుకోని చిరుద్యోగి 

అనారోగ్యానికి గురై మంచాన పడ్డ జి.అయ్యన్న

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ అర్బన్, పాలమూరు పురపాలకం : అధికారుల పొరపాటు వల్ల జిల్లా ఇంటర్‌ విద్యాశాఖలో పనిచేసే ఓ చిరుద్యోగి తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. మహబూబ్‌నగర్‌ పట్టణం న్యూ మోతీనగర్‌లో నివాసముండే జి.అయ్యన్న ల్యాబ్‌ అటెండెంట్‌గా స్థానిక ప్రభుత్వ వృత్తివిద్యా కళాశాలలో మినిమం టైం స్కేల్‌ కింద పనిచేస్తూ 28 ఫిబ్రవరి 2022లో ఉద్యోగ విరమణ పొందారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్‌ యాన్యువేషన్‌ చట్టం - 2021తో జూనియర్‌ కళాశాలల్లో పలు కేటగిరీల్లో పనిచేసిన వారి ఉద్యోగ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచుతూ, కొందరి పేర్లు సిఫారసు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల్లో జి.అయ్యన్న, పార్ట్‌ టైం ల్యాబ్‌ అటెండెంట్‌ (ఎంటీఎస్‌ - మినిమం టైం స్కేల్‌), అతడితో పాటు అదే కళాశాలలో పనిచేస్తున్న ఎండీ చాంద్‌పాషా, బి.యాదయ్యల పదవీకాలం మూడేళ్లు పొడిగించేందుకు అవసరమైన దస్త్రాలు, సమగ్ర నివేదికలు కోరింది. దస్త్రాలు పరిశీలించడంతో పాటు స్పష్టమైన వివరాలు సేకరించి ఇంటర్‌ బోర్డుకు నివేదించాల్సిన అధికారులు అయ్యన్న పుట్టిన తేదీని తప్పుగా నమోదు చేశారు. 

పొరపాటు జరిగిందిలా.. : అయ్యన్న పుట్టిన తేదీ 6 ఫిబ్రవరి 1964గా పదో తరగతి మెమోలో, ఆధార్‌ కార్డులో స్పష్టంగా ఉంది. జిల్లా ఇంటర్‌ విద్యాశాఖ అధికారులు మాత్రం అతడి పుట్టిన తేదీలో సంవత్సరాన్ని 1964 బదులు 1962గా, తండ్రి పేరు జి.దుబ్బన్నకు బదులుగా జె.హన్మంతుగా తప్పుగా పేర్కొంటూ రాష్ట్ర అధికారులకు నివేదిక పంపించారు. ఫలితంగా అయ్యన్న ఉద్యోగ విరమణ వయస్సు పెరగలేదు. సహోద్యోగులు మాత్రం ఉద్యోగ విమరణ వయస్సు పెంపుతో లబ్ధి పొందుతూ పనిచేస్తున్నారు. తనకు అవకాశం ఎందుకు రాలేదని సంబంధిత అధికారుల చుట్టూ తిరిగినా, కాళ్లావేళ్లా పడ్డా ఫలితం లేకపోవటంతో అయ్యన్న మనోవేదనకు గురై మంచానపడ్డారు. ఇంటి పెద్దదిక్కు మంచాన పడటంతో తమ పరిస్థితి దయనీయంగా మారిందని అయ్యన్న భార్య లలిత, కుమార్తె ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. జిల్లా ఇంటర్‌ విద్యాధికారి డా.శ్రీధర్‌ సుమన్‌ని ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా పుట్టిన తేదీ సవరణకు ఉన్నతాధికారులకు లేఖ రాశామని, అయ్యన్నకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని