logo

ఈసీజీ అయ్యేదెలా..?

మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో రోగులకు సకాలంలో ఈసీజీ సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే మహబూబ్‌నగర్‌ ఆసుపత్రిలో ఎక్కువ సౌకర్యాలు ఉండటంతో నిత్యం ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది వస్తున్నారు.

Published : 13 Jun 2024 03:45 IST

సిబ్బంది కొరతతో రోగులకు తీవ్ర ఇబ్బందులు

మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రిలో ఈసీజీ గది వద్ద నిరీక్షిస్తున్న బాధితులు 

న్యూస్‌టుడే, పాలమూరు: మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో రోగులకు సకాలంలో ఈసీజీ సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే మహబూబ్‌నగర్‌ ఆసుపత్రిలో ఎక్కువ సౌకర్యాలు ఉండటంతో నిత్యం ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది వస్తున్నారు. శ్యాసకోశ, గ్యాస్ట్రిక్, కడుపునొప్పి, ఛాతి నొప్పి, మెడ, భుజాల నొప్పి, టీబీ తదితర వ్యాధుల నిర్ధారణకు ఎక్స్‌రే, ఈసీజీ పరీక్ష అవసరమవుతున్నాయి. ఎక్స్‌రే ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక నిత్యం 100కు పైగా, సోమవారం 150కి పైగా రోగులు ఈసీజీ చేయించుకుంటున్నారు. వారు నిరీక్షిచేందుకు కూడా అక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. వారంతా గది ముందు గంటల తరబడి నిలబడటం రోగులకు ఇబ్బందికరంగా మారింది. ఈ రద్దీ ఆసుపత్రిలోని ఐసీయూతో పాటు ఇతర విభాగాలకు వెళ్లే రోగులు, వారి సహాయకుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. 

ఇరుకుగా గది : జనరల్‌ ఆసుపత్రి క్యాజువాలిటీ విభాగం పక్కనే 12వ నంబర్‌ గదిలో ఈసీజీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గది చాలా చిన్నది కావటంతో ఈసీజీ యంత్రాలు, రెండు మంచాలు, సిబ్బంది కూర్చోవడానికి కుర్చీలు, టేబుల్‌కు తగినంత స్థలం లేదు. సిబ్బంది తిరగడానికి కూడా వీల్లేని పరిస్థితి. ప్రమాద బాధితులు, అత్యవసర వైద్య సేవల కోసం 24 గంటల పాటు ఈసీజీ సేవలు అందుబాటులో ఉండాలి. మూడు షిఫ్టుల్లో ఈసీజీ నిర్వహించేందుకు కనీసం ఇద్దరు చొప్పున ఆరుగురైనా సిబ్బంది కావాలి. ప్రస్తుతం నలుగురే ఉన్నారు. 

సిబ్బందిని పెంచుతాం : ఈసీజీ సేవలు అందించే సిబ్బందిని పెంచడానికి కృషి చేస్తున్నాం. సేవలు 24 గంటలు అందుబాటులో ఉంచుతాం. గది చిన్నగా ఉన్నమాట వాస్తవమే. సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నాం.

- డా.జీవన్, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్, మహబూబ్‌నగర్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని