logo

ఇకనైనా కష్టాలు తీరేనా!

కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పాలమూరులోని ఆ కర్షకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో రైతుల వద్ద భూములు కౌలుకు తీసుకుని సాగు చేసే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది.

Updated : 13 Jun 2024 05:36 IST

పెట్టుబడి సాయంపై కౌలు రైతుల ఆశలు

నారాయణపేటలో సాగుకు పొలాన్ని సిద్ధం చేస్తున్న కూలీలు

ఈనాడు, మహబూబ్‌నగర్‌: కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పాలమూరులోని ఆ కర్షకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో రైతుల వద్ద భూములు కౌలుకు తీసుకుని సాగు చేసే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పడంతో ఆ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. 2016లో అప్పటి ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో ఓ సర్వే నిర్వహించి 36,760 మంది కౌలు రైతులు ఉన్నట్లు గుర్తించింది. తర్వాత ప్రభుత్వం తీసుకొచ్చిన పెట్టుబడి సాయంలో వీళ్లకు అవకాశం కల్పించకపోవడంతో పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించకతప్పడం లేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో సుమారు లక్షకుపైగా కౌలు రైతులు ఉంటారని అంచనా. ఏటా రెండు పంటకు కలిపి సుమారు 8 లక్షలు ఎకరాలకుపైగా భూములను కౌలుకు తీసుకుని వివిధ పంటలు సాగు చేస్తున్నారు. 

చిన్న, సన్నకారు రైతులు సైతం..: పాలమూరులో చిన్న, సన్నకారు రైతులు 2,87,625 మంది ఉన్నారు. వీరికి ఎకరా నుంచి ఐదు ఎకరాలలోపు వ్యవసాయ భూములు ఉన్నాయి. రైతులు తమకున్న కొద్దిపాటి భూమితోపాటు పక్కనున్న ఇతరుల పొలాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తుంటారు. ఫలితంగా వీళ్లు కూడా సాగుకు అప్పులు చేయాల్సి వస్తోంది. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాల పరిధిలోని ఆయకట్టులో సాగుకు కౌలు రూ.20వేల వరకు చెల్లిస్తున్నారు. పంట చేతికొచ్చినా, రాకపోయినా కౌలును మాత్రం చెల్లించాల్సి వస్తోంది. సాగుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు పెరిగిపోతున్నాయని చిన్న, సన్నకారు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రైతు భరోసాలో భాగంగా కౌలు డబ్బులు చెల్లిస్తే తమకు ఎంతో ఆసరాగా ఉంటుందని అంటున్నారు. 

మార్గదర్శకాలు ఎప్పుడో..: పాలమూరులో ఇప్పటికే సాగు షురూ అయ్యింది. ప్రస్తుతం ప్రభుత్వ వద్ద పట్టాదారులకు సంబంధించిన వివరాలే ఉన్నాయి. కౌలు రైతుల వివరాలు లేవు. అసలు వీరిని ఎలా గుర్తించాలనే దానిపై స్పష్టత లేదు. ఉమ్మడి జిల్లాలోని మూడు లక్షలకుపైగా కౌలు, చిన్న, సన్నకారు రైతులు రైతుభరోసా కింద పెట్టుబడి సాయం వస్తుందని ఆశిస్తున్నారు. ఏటా మహబూబ్‌నగర్‌లో 2.10, నాగర్‌కర్నూల్‌- 3.01, నారాయణపేట-1.71, వనపర్తి-1.68, జోగులాంబ గద్వాల-1.63 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందుతోంది. కౌలు రైతులకు కూడా ఈ సాయం అందితే సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీనిపై మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటేశ్‌ ‘ఈనాడు’తో మాట్లాడుతూ ఇప్పటి వరకు కౌలు రైతులకు పెట్టుబడి సాయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదన్నారు. 

డెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. మూడెకరాలు వరి, నాలుగెకరాల్లో పత్తి వేస్తాను. సాగు పనులు ప్రారంభించాను. ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకుంటామని చెబుతోంది. మాకు కూడా డబ్బులు వేస్తే కొంత ఆర్థిక భారం తగ్గుతోంది.

-ఆంజనేయులు, ధన్వాడ

ప్రభుత్వం కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించింది. నాతోపాటు చాలామంది రైతులు ఉమ్మడి జిల్లాలో కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. మాలాంటి వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తే ఆసరాగా ఉంటుంది.

-రవి, తాడూరు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని