logo

రైతు నేస్తంలో అనుబంధ సేవలు

గత ప్రభుత్వ హయాంలో రైతులకు సలహాలు, సూచనలను అందించేందుకు వ్యవసాయ క్లస్టర్‌లలో రైతు వేదికలను నిర్మించారు.

Published : 20 Jun 2024 05:49 IST

విస్తరిస్తే మరింత ఉపయుక్తమంటున్న అన్నదాతలు

మల్దకల్‌ రైతు వేదికలో నిర్వహిస్తున్న రైతునేస్తం కార్యక్రమం

గద్వాల కలెక్టరేట్, న్యూస్‌టుడే: గత ప్రభుత్వ హయాంలో రైతులకు సలహాలు, సూచనలను అందించేందుకు వ్యవసాయ క్లస్టర్‌లలో రైతు వేదికలను నిర్మించారు. వ్యవసాయ సీజన్‌లలో ఆయా క్లస్టర్‌ వ్యవసాయ విస్తరణ అధికారి అందుబాటులో ఉండి క్షేత్రస్థాయిలో విత్తనాలు, ఎరువులు ఎంపికతో పాటు వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అవగాహన కల్పించాల్సి ఉంది. కానీ నిధుల లేమి, ఏయే కార్యక్రమాలు నిర్వహించాలనే విషయంలో స్పష్టత లేకపోవడంతో అవి కాస్తా ఉత్సవ విగ్రహాలుగా కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ వేదికలను ఉపయోగకరంగా మార్చాలనే సంకల్పంతో ‘రైతు నేస్తం’ పేరిట వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాలైన పట్టు, మత్స్య, పశుసంవర్థక, విద్యుత్తు, నీటి పారుదల శాఖల సేవలను అందించాలని ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు పైలెట్‌ ప్రాజెక్టుగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎంపిక చేసి వాటిలో దృశ్యశ్రవణ విధానం ద్వారా ఆయా రంగాల రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో ఫలితాలు వస్తే మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లోనూ ఈ విధానాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్, అలంపూర్‌ నియోజకవర్గంలోని అయిజలో ఉన్న రైతు వేదికలను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ప్రతి మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు దృశ్య శ్రవణ విధానం ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

నిపుణుల సలహాలు: ఎంపిక చేసిన రైతు వేదికల్లో ప్రతి మంగళవారం దృశ్య శ్రవణ విధానం ద్వారా సాగులో అవార్డులు పొందిన రైతులతో ముఖాముఖితో పాటు నేలలకు తగ్గట్టుగా పంటల సాగుకు నిపుణుల సూచనలు, చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వానాకాలం పంటల సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో వారం, వారం చేపడుతున్న ఈ కార్యక్రమాల రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలను రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని పంటల సాగుకు అనుసరించాల్సిన పద్ధతులు, చీడపీడల నివారణపై రైతులు అవగాహన పెంచుకుంటే అధిక దిగుబడి పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

సాంకేతిక సమస్యల పరిష్కారం: జిల్లాలో 12 మండలాల పరిధిలో 97 రైతు వేదికలను నిర్మించారు. ఇందులో పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపికచేసిన మల్దకల్, అయిజ వేదికల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్, టీఎస్‌స్వాన్‌ (టీ ఫైబర్‌) నెట్‌వర్క్‌ సాయంతో దృశ్య శ్రవణ విధానం కొనసాగుతోంది. ఎంపిక చేసిన వాటిలో వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యం కల్పించారు. గతంలో వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో పంటలకు ఏదైనా చీడ పీడలు వస్తే వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో దానిపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సమావేశాలు నిర్వహించే వారు. ప్రస్తుతం రైతు వేదికల్లో ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రావడంతో వ్యవసాయ అనుబంధ రంగాలైన ఉద్యాన, పట్టు, మత్స్య, పశుసంవర్థక, విద్యుత్తు, నీటిపారుదల సంబంధించిన ప్రభుత్వ పథకాల సమాచారం అందిస్తున్నారు. పంటలకే పరిమితం కాకుండా మత్స్య, పశుసంవర్థక తదితర వాటిపై శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు రైతుల సందేహాలకు నివృత్తి చేసేందుకు ఈ వేదికలు ఉపయోగపడుతున్నాయి. వీటిని రైతు వేదికలకు విస్తరింపచేయాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని