logo

అయ్యో పాపం..

లోకం చూడనే లేదు.. భూమ్మీదికొచ్చి గంటలైనా గడిచాయో లేదో.. అంతలోనే శ్మశానవాటిక సమీపంలోని రోడ్డుపక్కన కంప చెట్ల మధ్య నవజాత శిశువు విగత జీవిగా పడి ఉండటం కలకలం రేపింది

Published : 20 Jun 2024 05:54 IST

మృతి చెందిన నవజాత శిశువు 

కందనూలు, న్యూస్‌టుడే : లోకం చూడనే లేదు.. భూమ్మీదికొచ్చి గంటలైనా గడిచాయో లేదో.. అంతలోనే శ్మశానవాటిక సమీపంలోని రోడ్డుపక్కన కంప చెట్ల మధ్య నవజాత శిశువు విగత జీవిగా పడి ఉండటం కలకలం రేపింది. కవర్లో పాత దుస్తుల్లో శిశువును చుట్టి ముళ్ల కంప చెట్ల మధ్య పడేసిన స్థితిలో ఆడ శిశువు మృతదేహం లభ్యమవడం చూపరులను కలిచి వేసింది.. అధికార యంత్రాంగమూ అప్రమత్తమైంది.. మధ్యాహ్నమే జన్మించి ఉంటుందని, వదిలేయడానికి కారణాలేంటని ఆరా తీస్తున్నారు. ఆడపిల్లా అని చంపేశారా.. ఇతర కారణాలేమైనా ఉన్నాయా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. వివరాలిలా.. నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని నాగనూల్‌ ప్రధాన రహదారి పక్కన శ్మశాన వాటిక సమీపంలో ఉన్న చెట్ల పొదల్లో బుధవారం నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది. స్థానికుల కథనం ప్రకారం.. మధ్యాహ్నం గుర్తు తెలియని ఇద్దరు మహిళలు వచ్చి నవజాత శిశువును ప్లాస్టిక్‌ కవర్లు, దుస్తుల్లో చుట్టి చెట్ల పొదల మధ్య వదిలేశారు. సాయంత్రం అటుగా వెళ్తున్న కొందరు యువకులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పట్టణంలోని జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రామేశ్వర్‌రెడ్డి తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.రఘు స్పందిస్తూ.. మృతి చెందిన ఆడ నవజాత శిశువు మధ్యాహ్నమే జన్మించి ఉంటుందని, ఆసుపత్రిలో కాన్పుల వివరాలు ఆరా తీస్తామన్నారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని