logo

వందరోజుల ఉపాధికల్పనేనా?

వలసలు అరికట్టి స్థానికంగానే కూలీలకు పని కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టి అమలు చేస్తోంది.

Published : 20 Jun 2024 05:58 IST

న్యూస్‌టుడే- నారాయణపేట : వలసలు అరికట్టి స్థానికంగానే కూలీలకు పని కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులకు రానురానూ ప్రోత్సహం కరవవుతోంది. వాస్తవానికి ప్రతియేటా జాబ్‌కార్డు కలిగిన ప్రతి కుటుంబానికీ వంద రోజులు పని కల్పించాల్సి ఉంది. కూలీలకు పనులు చూపకపోవడానికితోడు పథకం అమలులో సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా వంద రోజుల పనిదినాల కల్పన కొందరికే దక్కుతుంది. 

ప్రతిఏటా రూ. కోట్లలో పనులకు ప్రతిపాదనలు పంపించి చేపడుతుండగా కనీసం ఇరవై శాతం జాబ్‌కార్డుదారులకు కూడా వంద పనిదినాలు కల్పించలేకపోతున్నారంటే పథకం పనితీరు ఎంత అధ్వానంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. గడిచిన మూడేళ్లలో నమోదైన గణాంకాలే పథకం పనితీరుకు అద్దం పడుతున్నాయి.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రతియేటా గ్రామస్థాయిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను సంబంధిత అధికారులు గుర్తిస్తున్నారు. గ్రామసభల ద్వారా ఆమోదం పొంది ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నారు. ఉన్నతాధికారుల పరిశీలన అనంతరం పనులకు చేపట్టేందుకు నిధులు మంజూరు చేస్తున్నారు. భూమి చదును, కందకాలు, మట్టికట్టలు, నీటి నిల్వకుంటలు, ఇంకుడు గుంతలు, పశువుల పాకలు, ఫారంపాండ్, గుట్టలపై కందకాల నిర్మాణాలతోపాటు పలు పనులు చేపడుతున్నారు. గత కొన్నేళ్లుగా హరితహారం కింద మొక్కల పెంపకం, మొక్కలు నాటే కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంలో రూ.లక్షల్లో పనులు చేపడుతున్నా పని దినాలు పూర్తిసాయిలో కల్పించలేకపోతున్నారు. మస్తర్లలో మతలబులు చేయడం, కూలీలకు సమయానికి వేతనం అందజేయకపోవడం, క్షేత్రస్థాయి సిబ్బంది అవినీతి వంటి చర్యల మూలంగా జాబ్‌కార్డుదారులందరికీ పని దొరకడం లేదు. 

రూ.కోట్ల వ్యయం.. : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగేళ్ల కాలంలో రూ.2500 కోట్ల రూపాయల పైచిలుకు  ఉపాధి పనులకు వెచ్చించారు. మొత్తం 64,615 వేల మందికి వందరోజుల పని కల్పించారు. ప్రతి జిల్లాలోనూ లక్షకుపైగా జాబ్‌కార్డులు ఉండగా అంతేస్థాయిలో వంద పనిదినాలు కల్పించలేకపోయారు.  ఇదిలా ఉండగా పనులకు వచ్చే కూలీలకు సాధ్యమైనంత వరకు వంద రోజుల పనిదినాలు కల్పించేందుకు కృషిచేస్తున్నామని ఆయా జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు పేర్కొంటున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని