logo

దోస్త్‌కు ముఖం చాటేస్తుండ్రు!

డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులు మొహం చాటేస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) ద్వారా గత నెల 6 నుంచి ప్రభుత్వం ఆన్‌లైన్‌లో ప్రవేశాల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.

Published : 20 Jun 2024 06:02 IST

సీట్లు కేటాయించినా.. చేరని 1,260 మంది విద్యార్థులు
రెండో విడతలో రిపోర్టింగ్‌కు ఈ నెల 24 వరకు గడువు

మహబూబ్‌నగర్‌ : ఎన్టీఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు పూలు అందిస్తూ స్వాగతం పలుకుతున్న అధ్యాపకులు

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులు మొహం చాటేస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) ద్వారా గత నెల 6 నుంచి ప్రభుత్వం ఆన్‌లైన్‌లో ప్రవేశాల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దరఖాస్తు చేసుకున్న వారికి వివిధ కళాశాలల్లో సీట్లు కేటాయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు సకాలంలో ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయటం లేదు.

ఉమ్మడి జిల్లాలో 31,360 సీట్లు : పాలమూరు విశ్వవిద్యాలయం(పీయూ) పరిధిలో 23 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 1 స్వయం ప్రతిపత్తి కళాశాల, 57 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 31,360 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దోస్త్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్థుల్లో 4,498 మందికి మొదటి విడతలో సీట్లు కేటాయించారు. నిర్దేశిత గడువు ముగిసే సమయానికి 3,238 మందే ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేశారు. అంటే 1,260 మంది దూరంగానే ఉన్నారు. రెండో దఫాలో 2,646 మందికి సీట్లు కేటాయించారు. వీరు ఈ నెల 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంది. రెండో దఫా కూడా విద్యార్థుల ప్రవేశాలు లేకపోతే రెండేళ్లల్లో చాలా కళాశాలలు మూతపడే ప్రమాదముంది.

రెండేళ్లుగా తగ్గిన ప్రవేశాలు : 2022-23 విద్యా సంవత్సరంలో మొత్తం 29,740 సీట్లు ఉండగా 15,184 మంది చేరారు. 2023-24 విద్యా సంవత్సరంలో 9,818 మందే చేరడం ఆందోళన కలిగించే విషయం. ఈసారి ప్రవేశాలు చూస్తుంటే గత రెండేళ్లల్లో పరిస్థితే పునరావృతం అవుతుందా అన్న అనుమానం కలుగుతోంది. 

చేరకపోవడానికి కారణాలు.. : ఇంజినీరింగ్, మెడిసిన్,పాలిటెక్నిక్, ఫార్మసీ కోర్సుల వైపు మొగ్గు చూపుతుండటంతో డిగ్రీ సీట్లు భర్తీ కావడం లేదు. నీట్‌ అలాట్‌మెంట్‌ సమయం కోసం వేచి చూడటంతో పాటు డిగ్రీ దోస్త్‌కు చాలా మంది దరఖాస్తులు చేస్తుంటారని, ఈ నేపథ్యంలో వారు అటూ.. ఇటూ అన్నట్లుగా ఉంటారని అధ్యాపకులు చెబుతున్నారు. డిగ్రీ కోర్సుల్లో కొత్తదనం లేకపోవడంతో చేరేందుకు విద్యార్థులు విముఖత చూపుతున్నారు. డిగ్రీ కోర్సుల్లో సంస్కరణలపై దృష్టి సారిస్తే ప్రవేశాలు పెరుగుతాయని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. 
కొత్త కళాశాలల్లో ఇలా : మద్దూరు, కోస్గిలో కొత్తగా డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశారు. కోస్గి మహిళా డిగ్రీ కళాశాలలో నాలుగు కోర్సుల్లో మొత్తం 240 సీట్లు ఉన్నాయి. దోస్త్‌ మొదటి విడతలో ఒకరికి, రెండో విడతలో 17 మందికి సీట్లు కేటాయించారు. మొదటి విడతలో సీటు కేటాయించిన విద్యార్థిని ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయలేదు. రెండో విడతలోనూ 17 మందికి ఎంతమంది చేరతారనేది ప్రశ్నార్థకంగా మారింది. మద్దూరు కళాశాలలోనూ అనుకున్న స్థాయిలో ప్రవేశాలు లేకపోవడంతో అధికారులకు ఎటూ పాలుపోవడం లేదు.

సహాయ కేంద్రాలు ఇవే : జిల్లాకు ఒకటి చొప్పున సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. దోస్త్‌ ప్రక్రియ, ప్రవేశాల విషయంలో సందేహాలు, సమస్యలు ఉంటే సహాయ కేంద్రంలో నేరుగా లేదా చరవాణిలో సంప్రదించొచ్చు. పరిష్కారం కాకపోతే పీయూలోని దోస్త్‌ కోఆర్డినేటర్‌ను సంప్రదించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు సూచిస్తున్నారు.


    సహాయ కేంద్రం    చరవాణి నంబర్లు
    ఎంవీఎస్, మహబూబ్‌నగర్‌    9440831876, 8977980981
    నాగర్‌కర్నూల్‌ డిగ్రీ కళాశాల    9440842201, 9963375850
    గద్వాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల    8008259315, 8019826401
    నారాయణపేట ప్ర.డి. కళాశాల    9440937053, 9959381282
    వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల    9490000670, 9491167549


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని