logo

కొత్త ఎంపీలపై కోటి ఆశలు

కేంద్రంలోని కొత్త ప్రభుత్వంపై పాలమూరువాసులు ఆశలు పెట్టుకున్నారు. 18వ లోక్‌సభ త్వరలోనే కొలువు దీరనుంది

Updated : 20 Jun 2024 06:29 IST

18వ లోక్‌సభలో కొలువుదీరనున్న డీకే అరుణ, మల్లు రవి
ప్రత్యేకంగా దృష్టిసారిస్తేనే  బడ్జెట్‌లో నిధుల కేటాయింపు

ఈనాడు, మహబూబ్‌నగర్‌ : కేంద్రంలోని కొత్త ప్రభుత్వంపై పాలమూరువాసులు ఆశలు పెట్టుకున్నారు. 18వ లోక్‌సభ త్వరలోనే కొలువు దీరనుంది. ఈ నెల 24 నుంచి జులై 3వ తేదీ వరకు కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం, స్పీకర్‌ ఎన్నిక జరగనున్నాయి. జులై మూడో వారంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్‌కు త్వరలో కసరత్తు ప్రారంభం కానుంది. 18వ లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ నుంచి భాజపా నేత డీకే అరుణ, నాగర్‌కర్నూల్‌ నుంచి కాంగ్రెస్‌ నేత మల్లు రవి ఎంపీలుగా గెలుపొందారు. ఎన్నికల సమయంలో వీరు పలు హామీలు ఇచ్చారు. ఇప్పటి నుంచే దృష్టిసారించి బడ్జెట్‌లో నిధులు కేటాయించేలా కృషిచేయాలని ఉమ్మడి జిల్లావాసులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా ఆకాంక్షలపై ‘ఈనాడు’ కథనం. 

రైల్వే ప్రాజెక్టులు పట్టాలెక్కేలా.. : కొన్నేళ్లుగా ఆశ పెడుతున్న కొత్త రైల్వే ప్రాజెక్టులు పట్టాలు ఎక్కడం లేదు. కృష్ణా - వికారాబాద్‌ రైల్వే ప్రాజెక్టుకు ఫైనల్‌ లొకేషన్‌ సర్వే(ఎఫ్‌ఎల్‌ఎస్‌)కు రైల్వేబోర్డు ఇప్పటికే ఆమోద ముద్ర వేసింది. మొత్తం 316.77 కి.మీ.ల సర్వేకు రూ.7.91 కోట్లను రైల్వే శాఖ కేటాయించింది. ఈ లైన్‌ పనులకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు అవసరం. గద్వాల - డోర్నకల్‌ రైల్వే లైను కోసం కూడా జనం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇది కార్యరూపం దాలిస్తే ఇప్పటి వరకు రైల్వే లైను సౌకర్యం లేని నాగర్‌కర్నూల్‌ జిల్లాకు ఎంతో మేలు జరుగుతుంది. వనపర్తి జిల్లా కేంద్రానికి కూడా రైల్వే లైను వస్తుంది. ఈ లైను సర్వేకు ఇప్పటికే రూ. 7.40 కోట్లను రైల్వే శాఖ కేటాయించింది. వీటిపై మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ ఎంపీలు ఇప్పటి నుంచే దృష్టి సారిస్తే కేంద్రం నిధులు కేటాయించే అవకాశాలు ఉంటాయి. అచ్చంపేట - మహబూబ్‌నగర్‌ - తాండూర్‌కు కొత్త రైల్వే లైను సర్వే కూడా కాగితాలకే పరిమితమైంది. మహబూబ్‌నగర్‌ నుంచి కర్నూలు వరకు డబుల్‌ లైను ఏర్పాటుకు అనుమతులు రావాల్సి ఉంది. 
పరిశ్రమలతోనే అభివృద్ధి, ఉపాధి : ఉమ్మడి జిల్లాకు ప్రత్యేకంగా పరిశ్రమలు, నైపుణ్య శిక్షణ కేంద్రాలను తీసుకొస్తామని ఎంపీలు హామీ ఇచ్చారు. వెనకబడ్డ నారాయణపేట జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఉంది. హైదరాబాద్‌ - బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న జడ్చర్ల వద్ద ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నాగర్‌కర్నూల్, గద్వాలలో కూడా పారిశ్రామికవాడల అభివృద్ధి చేయాలి. మహబూబ్‌నగర్‌లో కేంద్రీయ విద్యాలయం, నాగర్‌కర్నూల్‌లో నవోదయ విద్యాలయం ఉన్నాయి.  ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం. నారాయణపేటలో సైనిక పాఠశాల ఏర్పాటు కలగానే మిగిలిపోతోంది. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా కావాలన్న డిమాండ్‌ ఉంది. నల్లమలను టూరిజం స్పాట్‌గా ఏర్పాటు చేస్తామన్నారు. వీటికి నిధులు సాధించాల్సి ఉంది. 


ప్రతిపాదనలు పంపిస్తాం

లోక్‌సభలో ఎంపీగా త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నా. ఈ ప్రక్రియ తర్వాత ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడుతుంది. ఇందుకు కేంద్రం ఎంపీలను ప్రతిపాదనలు పంపించాలని కోరుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తాం. ఈ ప్రాంతానికి కావాల్సిన ప్రాజెక్టుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపిస్తాం. 
- డీకే అరుణ, ఎంపీ, మహబూబ్‌నగర్‌


రైల్వే లైన్లు కోరుతా

బడ్జెట్‌ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. గద్వాల - డోర్నకల్‌ రైల్వే లైన్‌కు నిధులు కేటాయించాలని కోరుతాను. అలంపూర్‌ నుంచి నల్గొండ వరకు, రాయచూరు నుంచి నంద్యాల వరకు ఇంటర్‌ స్టేట్‌ జాతీయ రహదారి కోరుతూ ప్రతిపాదనలు పంపుతాం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రం, కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు కోరుతాను. 
- మల్లు రవి, ఎంపీ, నాగర్‌కర్నూల్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని