logo

దయనీయం.. దివ్యాంగ చిన్నారుల జీవనం

తల్లిదండ్రుల మనస్పర్థలు పిల్లలకు శాపంగా మారాయి. తల్లి ఓ చోట.. తండ్రి ఓ చోట ఉండటంతో వైకల్యంతో పాటు సరైన శారీరక ఎదుగుదల లేని ఆ చిన్నారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.

Updated : 20 Jun 2024 06:18 IST

ఇద్దరు కుమార్తెలతో తండ్రి నర్సింహ

ఆత్మకూరు, న్యూస్‌టుడే : తల్లిదండ్రుల మనస్పర్థలు పిల్లలకు శాపంగా మారాయి. తల్లి ఓ చోట.. తండ్రి ఓ చోట ఉండటంతో వైకల్యంతో పాటు సరైన శారీరక ఎదుగుదల లేని ఆ చిన్నారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వివరాలలోకి వెళ్తే.. ఆత్మకూరు పట్టణానికి చెందిన కొమరం నర్సింహ తాపీ కార్మికుడిగా జీవనం సాగిస్తున్నారు. 14 ఏళ్ల క్రితం నర్వ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళతో వివాహమైంది. వారికి ముగ్గురు సంతానం. 13 ఏళ్ల పెద్ద కుమార్తె ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. పది, ఏడేళ్ల వయసున్న మరో ఇద్దరు కుమార్తెలు పుట్టుకతోనే దివ్యాంగులు. ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా భార్యాపిల్లలను ఏ లోటులేకుండా పోషిస్తున్నారు. ఎనిమిది నెలల క్రితం దాంప్యత జీవితంలో కలతల కారణంగా భర్తతో గొడవ పెట్టుకుని భార్య పెద్ద కుమార్తెతో పుట్టింటికి వెళ్లింది. ఇద్దరు పిల్లలను చూసుకునేందుకు తండ్రి తప్ప ఎవరూ లేరు. నర్సింహ తల్లిదండ్రులు మృతి చెందగా.. ఆయనకు తోబుట్టువులు లేరు. రోజూ కూలీ చేస్తే గాని పూట గడవని ఆయన.. సొంతంగా ఏ పని చేసుకోలేని ఇద్దరు దివ్యాంగ చిన్నారులకు సపర్యలు చేసేందుకు పనికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉండాల్సి వస్తోంది. సంపాదన లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. తల్లి కోసం తల్లడిల్లుతున్న చిన్నారుల పరిస్థితి స్థానికులను కలచివేస్తోంది. ప్రభుత్వం తన కుమార్తెలకు ఎక్కడైనా ఆశ్రయం కల్పించి ఆదుకోవాలని నర్సింహ వేడుకుంటున్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని