logo

ఊరిస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు

సుదీర్ఘ కాలంగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులు ప్రభుత్వం బదిలీలు, పదోన్నతులకు పచ్చజెండా ఊపడంతో ఎంతో ఆనందించారు.

Published : 20 Jun 2024 06:15 IST

 రోజుకో మలుపుతో ఆందోళన 

అచ్చంపేటలో నిర్వహించిన సమావేశంలో ఉపాధ్యాయులు  

అచ్చంపేట, న్యూస్‌టుడే : సుదీర్ఘ కాలంగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులు ప్రభుత్వం బదిలీలు, పదోన్నతులకు పచ్చజెండా ఊపడంతో ఎంతో ఆనందించారు. సుమారు పదేళ్లుగా పదోన్నతులు లేకపోవడంతో ఎందరో సీనియర్‌ ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేసి ఎంతో నష్టపోయారు. గత ప్రభుత్వ హయాంలో ఎనిమిది నెలల క్రితం బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను చేపట్టారు. ఉపాధ్యాయులు బదిలీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. పదోన్నతుల కోసం వివిధ విభాగాల్లో ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలు తయారు చేశారు. అర్హులైన ఉపాధ్యాయులు విద్యార్హతల ధ్రువ పత్రాలు, సర్వీసు పుస్తకాలను డీఈవోలు తనిఖీ చేసి తుది జాబితాలు తయారు చేశారు. అప్పట్లో మల్టీ జోన్‌-2 పరిధిలో జీహెచ్‌ఎంల బదిలీల ప్రక్రియ పూర్తి చేశారు. ఒకే పాఠశాలలో ఐదేళ్ల పాటు పనిచేసిన జీహెచ్‌ఎంలు బదిలీ ఉత్తర్వులను అందుకొని కొత్త పాఠశాలల్లో విధుల్లో చేరారు. ఆ తరువాత స్కూల్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారికి సీనియార్టీ ప్రాతిపదికన జీహెచ్‌ఎంలుగా పదోన్నతులు కల్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తుండగానే కోర్టు కేసులతో ప్రక్రియ నిలిచి పోయింది. అంతలోనే ఎన్నికలు రావడం రాష్ట్రంలో ప్రభుత్వం మారడం తరువాత లోక్‌సభ ఎన్నికల కోడ్‌తో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముందడుగు పడలేదు. కొత్త విద్యా సంవత్సరం (2024-25) ప్రారంభంలోనే సీఎం రేవంత్‌రెడ్డి బదిలీలు, పదోన్నతులకు ఆమోదం తెలిపారు. ఈ నెల 8న అధికారులు షెడ్యూలును విడుదల చేశారు. మొదటి జీహెచ్‌ఎంల ఖాళీలను ప్రకటించి సీనియార్టీ జాబితాలను సిద్ధం చేశారు. వారి నుంచి వెబ్‌ ఆఫ్షన్లు తీసుకొని ఆన్‌లైన్‌లో జీహెచ్‌ఎంలుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలో 229 మంది ఎస్‌ఏలు జీహెచ్‌ఎంలుగా పదోన్నతి పొందారు. స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీలు, ఎస్జీటీలకు స్కూల్‌ ఆసిస్టెంట్లుగా పదోన్నతలు, ఎస్జీటీల బదిలీలు చేపట్టాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలోని 3,230 పాఠశాలల్లో 12,708 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా వారిలో సుమారు 700 మందికి పదోన్నతులు పొందనుండగా మరో 8 వేల మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యే అవకాశం ఉంది. 

వెబ్‌ ఆప్షన్ల కోసం ఎదురుచూపులు 

మల్టీ జోన్‌-2లో ప్రస్తుతం స్కూల్‌ అసిస్టెంట్‌ సమాన స్థాయి ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాల్సి ఉంది. ఇప్పటి వరకు ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలను ప్రకటించలేదు. జాబితాలు ప్రకటించిన తరువాత ఉపాధ్యాయుల నుంచి బదిలీ కోసం వెబ్‌ ఆప్షన్లు (ఐచ్చికాలు) తీసుకుంటారు. ఆ తరువాత ఐచ్చికాల ఆధారంగా సీనియార్టీ ప్రాతిపదికన ఆన్‌లైన్‌లో బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తారు. ఆ తరువాత ఎస్‌జీటీలకు ఎస్‌ఏలుగా పదోన్నతి, ఎస్‌జీటీల బదిలీలు పూర్తి చేస్తే ప్రక్రియ ముగుస్తుంది. ఈ నెల 30 వరకు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ముగించనున్నట్లు ఇప్పటికే షెడ్యూలు విడుదల చేసిన విషయం విధితమే. మల్టీ జోన్‌-1లో ఇప్పటికే ఎస్‌జీటీ సమాన స్థాయి ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించారు. టెట్‌ అర్హతలతో సంబంధం లేకుండా సీనియార్టీ జాబితాలు తయారు చేసి పదోన్నతుల ఉత్తర్వులను బుధవారం విడుదల చేశారు. దాంతో మల్టీ జోన్‌-2లో కూడా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతుందన్న ఆశాభావంతో ఉపాధ్యాయులు ఉన్నారు. కోర్టు కేసులతో ఏ సమయంలో ఎప్పుడు ప్రక్రియ నిలిచి పోతుందోనన్న భయం ఉపాధ్యాయులను వెంటాడుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని