logo

బడులకు పయనం..ప్రమాదాలతో చెలగాటం

బంగారు భవిత ఊహించుకుంటూ ఓ లక్ష్యంతో ముందుకెళ్తున్న విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.  స్థానికంగా బడి లేకపోయినా ఆపసోపాలు పడుతూ దూర ప్రాంతాలకు సాగుతున్నారు.

Updated : 20 Jun 2024 06:46 IST

న్యూస్‌టుడే- రాజోలి, నారాయణపేట  : బంగారు భవిత ఊహించుకుంటూ ఓ లక్ష్యంతో ముందుకెళ్తున్న విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.  స్థానికంగా బడి లేకపోయినా ఆపసోపాలు పడుతూ దూర ప్రాంతాలకు సాగుతున్నారు.  బస్సులు లేకపోవడం పెను సమస్యగా మారుతోంది. సురక్షితమైన ప్రయాణం లేక, ప్రైవేటు వాహనాల్లో ప్రమాదకరంగా వెళ్తున్నారు. కొందరు సైకిళ్లపై, నడుచుకుంటూ వెళ్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం బడులు పునః ప్రారంభం కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రయాణాలు మళ్లీ మొదలయ్యాయి. 

ఉన్నత విద్య కోసం... 

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 2853 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. నివాసం ఉంటున్న గ్రామాల్లో ఉన్నత పాఠశాల లేక విద్యార్థులు ఆటోలు, బస్సులు, సైకిళ్లపై ఇతర గ్రామాలకు వెళ్తున్నారు. ఇందులో బస్సు సౌకర్యం లేని గ్రామాలు 497కి పైగా ఉన్నాయి. ఈ పాఠశాలలకు ప్రతిరోజూ సైకిళ్లు, నడుచుకుంటూ, ఆటోలలో వచ్చే వారు 18 వేల మందికి పైగా ఉండొచ్చని అంచనా. ఇలా ఉన్నత విద్య కోసం నిత్యం వేలాది మంది రోడ్లపై వెళుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.600 చొప్పున రవాణా భత్యం ఇవ్వాల్సి ఉండగా, నాలుగేళ్లుగా అందించడం లేదు. ఫలితంగా ఆ కుటుంబాలపై ఆర్థిక భారం కూడా పడుతోంది.

ఇలా చేస్తేనే..

విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ అధికారులు, విద్యాశాఖ సమన్వయంతో పిల్లల సంఖ్యకు, సమయానికి అనుగుణంగా బస్సులను నడపాలి. పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌లో  ప్రత్యేకంగా ఉదయం, సాయంత్రం స్టూడెంట్‌ బస్సులను నడిపితే వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటికి చేరుకునే అవకాశం లభిస్తుంది.

రోడ్లు అధ్వానం.. బస్సులు దైన్యం 

అయిదు జిల్లాల్లో ఆర్టీసీ డిపోలున్నా తగ్గినన్ని బస్సులు లేక చాలా రూట్లకు ఏళ్లుగా బస్సు సౌకర్యం లేదు. దీనికి తోడు ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తుండటంతో విద్యార్థులకు సీట్లు దొరకడం లేదు. ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణాలు చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. ప్రభుత్వాలు ఏళ్లుగా చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థులు ప్రమాదాల ప్రయాణాలు చేస్తూ చదువులు కొనసాగిస్తున్నారు. రహదారులు అధ్వానంగా ఉండటం వల్ల ప్రమాదాల తీవ్రత అధికంగా ఉంటోంది. స్థాయికి మించి విద్యార్థులను చేరవేస్తున్న ఆటోలు, గుంతల రోడ్లతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే నడిచే బస్సులు సైతం నిలిచిపోతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం మాన్‌దొడ్డి ఉన్నత పాఠశాలకు పచ్చర్ల నుంచి 40 మందికి పైగా విద్యార్థులు వెళ్తున్నారు. రోడ్డు బాగా లేక బస్సు నిలిచిపోవడంతో గతేడాది నుంచి ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.


కొరత కారణంగా బస్సులు నడపలేకపోతున్నాం

చాలా పల్లెలకు దారులు సక్రమంగా ఉన్నప్పటికీ ఆర్టీసీ బస్సులు నడపకపోవడానికి అవసరమైనన్ని బస్సులు లేకపోవడమే కారణం. డ్రైవర్లు, కండక్టర్ల కొరత కూడా ఉంది. రీజియన్‌లో 200 బస్సుల కోసం ప్రతిపాదించాం. రాగానే బస్సులు లేని మార్గాల్లో వేసి పాఠశాల విద్యార్థులతో పాటు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.  
- వి.శ్రీదేవి, ఆర్టీసీ ప్రాంతీయ  మేనేజరు, మహబూబ్‌నగర్‌


  •  గత ఏడాది చివర్లో నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ఆలంపల్లి నుంచి కున్సీ గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలకు సైకిల్‌ పై వెళ్తున్న తొమ్మిదో తరగతి విద్యార్థిని పత్తిలోడ్‌తో వెళ్తున్న లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
  •  కోస్గి మండలం నాచారం ప్రాథమికోన్నత పాఠశాలకు తొలిరోజు వస్తున్న విద్యార్థిని ఎదురుగా ఉన్న రోడ్డుపై వేగంగా వస్తున్న బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని