logo

ల్రక్ష్యం చేరని ధాన్యం కొనుగోళ్లు

జిల్లాలో యాసంగి సాగుకు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగిసింది. ఏప్రిల్‌ చివరి వారంలో జిల్లాలో మొత్తం 164 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించారు.

Published : 20 Jun 2024 06:24 IST

బిజినేపల్లి మండలం వట్టెంలో ధాన్యం కొనుగోలు చేస్తున్న ఐకేపీˆ సభ్యులు (పాతచిత్రం) 

బిజినేపల్లి, కందనూలు, న్యూస్‌టుడే : జిల్లాలో యాసంగి సాగుకు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగిసింది. ఏప్రిల్‌ చివరి వారంలో జిల్లాలో మొత్తం 164 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించారు. అందులో 99 కేంద్రాలు పీఏసీఎస్, 63 కేంద్రాలు ఐకేపీ, మెప్మా ఆధ్వర్యంలో 2 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాలను ప్రారంభించి జూన్‌ పదో తేదీ వరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధరకన్నా బయటి మార్కెట్లలో గిట్టుబాటు ధర ఎక్కువగా ఉండటంతో ఎక్కువ సంఖ్యలో రైతులు వ్యాపారులకు ధాన్యం విక్రయించడానికి మొగ్గు చూపారు. దీంతో జిల్లా అధికారులు లక్ష్యం మేరకు ధాన్యం ఖరీదు చేయడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

52,956 మెట్రిక్‌ టన్నుల సేకరణ..  : జిల్లాలో యాసంగికి సాగుకు సంబంధించి 1.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి అధికారులు లక్ష్యం నిర్దేశించుకోగా 52,956 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాణ్యత కల్గిన గ్రేడ్‌-ఏ ధాన్యం క్వింటా రూ. 2,203 చొప్పున ఖరీదు చేయగా గ్రేడ్‌-బి ధాన్యం క్వింటా రూ. 2,000 వేల చొప్పున కొనుగోలు చేశారు. ప్రస్తుత యాసంగిలో వ్యాపారులు నేరుగా రైతుల కల్లాల వద్దకు వెళ్లి క్వింటా రూ. 2,500 చొప్పున ఖరీదు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర కన్నా వ్యాపారులు అధికంగా వెచ్చించడంతో రైతులు వారికే విక్రయించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో యాసంగి సాగు సమయంలో కురిసిన అకాల వర్షాలకు వరి సాగు పూర్తిగా నష్టపోయింది. దీంతో ఈ ప్రాంతంలో వ్యాపారులు ఖరీదు చేసిన ధాన్యాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తరలించినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని పౌరసరఫరాలశాఖ అధికారులు మొత్తం 9,211 మంది రైతుల వద్ద 52,956 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అధికారులు నిర్దేశించుకున్న లక్ష్యం కన్నా 57,044 మెట్రిక్‌ టన్నుల ధాన్యం తక్కువగా సేకరించారు. మొత్తం రూ.116.66 కోట్ల మేరకు రైతులకు డబ్బులు చెల్లించారు. అధికారులు జూన్‌ నెల 11వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలు మూసివేయడంతో బయటి మార్కెట్లలో వ్యాపారులు ధాన్యం ధర పూర్తిగా తగ్గించారు. ప్రస్తుతం క్వింటా రూ. 1,500 నుంచి రూ. 1,600 మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీని వలన ఆలస్యంగా ధాన్యం విక్రయిస్తున్న రైతులు ఆర్థికంగా నష్టపోయారు. 

ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం 

ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసివేసినట్లు పౌరసరఫరాలశాఖ మేనేజర్‌ బాల్‌రాజ్‌ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9211 మంది రైతుల ద్వారా 52,956 మెట్రిక్‌ టనున్ల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, అందుకు సంబందించిన నగదు రూ.116 కోట్ల 66లక్షలను రైతుల ఖాతాలో జమచేయగా, గతేడాది యాసంగితో పోల్చితే ఇది 50శాతం మాత్రమే. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని