logo

ప్రాణాలతో చెలగాటం

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని చెంచుల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందని చాలామంది వెట్టిచాకిరిలో మగ్గుతున్నారు. యజమానుల నుంచి నిత్యం వేధింపులు, భౌతికదాడులకు గురవుతూ నరకం అనుభవిస్తున్నారు.

Published : 22 Jun 2024 05:42 IST

చెంచులతో వెట్టిచాకిరి
చెప్పినట్లు వినకపోతే భౌతికదాడులు

నల్లమలలోని ఓ చెంచుపెంటలో ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ పంపిణీ చేసే రాగి జావ కోసం వచ్చిన చెంచు చిన్నారులు

ఈనాడు, మహబూబ్‌నగర్‌ - న్యూస్‌టుడే, కొల్లాపూర్‌ : నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని చెంచుల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందని చాలామంది వెట్టిచాకిరిలో మగ్గుతున్నారు. యజమానుల నుంచి నిత్యం వేధింపులు, భౌతికదాడులకు గురవుతూ నరకం అనుభవిస్తున్నారు. జిల్లాలోని 8 మండలాల పరిధిలో 88 చెంచుపెంటలు ఉన్నాయి. ఇందులో 2,595 చెంచు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వీరి జనాభా 8,784 కాగా 4,341 మంది పురుషులు, 4,443 మంది స్త్రీలు ఉన్నారు. అభయారణ్యం(డీప్‌ ఫారెస్టు) పరిధిలో మొత్తం 18 చెంచుపెంటలు ఉన్నాయి. ఇక్కడ పూర్తిగా చెంచులే నివాసం ఉంటారు. మిగతా ప్రాంతాల్లో చెంచులతో పాటు వివిధ సామాజిక వర్గాల ప్రజలు ఉంటారు. ఊరికి చివర గుడిసెల్లో ఉండే చెంచులు పోడు భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చాలామందికి చేతిలో సాగు పెట్టుబడికి డబ్బులు, వ్యవసాయంపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండటం లేదు. దీన్ని ఆసరా చేసుకుని వారి భూములను గిరిజనేతరులు కౌలుకు తీసుకుంటున్నారు. చివరకు చెంచులు వారి భూముల్లోనే కూలీ పనులకు వెళ్లాల్సి వస్తోంది. వారి సామర్థ్యానికి మించి పనిచేయిస్తున్నారు. ఎవరైనా చేయలేకపోతే దూషించటంతో పాటు భౌతికదాడులకు పాల్పడుతున్నారు. ఈ విషయాలు బయటకు రాకుండా బెదిరిస్తున్నారు. కౌలుకు తీసుకున్న కొందరు భూములు తమకే అమ్మాలని చెంచులపై ఒత్తిడి చేస్తున్నారు. వినకపోతే వేధింపులకు గురిచేస్తున్నారు. 

అక్రమ దందాలో పావులుగా.. : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇసుకకు విపరీతంగా డిమాండ్‌ ఉంది. నల్లమల ప్రాంతంలో వాగులు లేకపోవడంతో ఫిల్టర్‌ ఇసుకపైనే చాలా మంది ఆధారపడుతున్నారు. కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల పరిధిలోని చాలా గ్రామాల చెరువులు, పొలాల్లో యథేచ్ఛగా ఫిల్టర్‌ ఇసుక తయారు చేస్తున్నారు. ఇందులో చెంచులనే కూలీలుగా పనికి పెట్టుకుంటున్నారు. రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుక నింపాలని వారిపై ఒత్తిడి తెస్తున్నారు. నిర్దేశించిన లక్ష్యంలో ఒక ట్రాక్టర్‌లో ఇసుక నింపలేకపోయినా దాడికి పాల్పడుతున్నారు. ఫిల్టర్‌ ఇసుక తయారీ కేంద్రాల వద్దనే గుడిసెలు వేసి కొందరు చెంచులను అక్కడే ఉంచుకుంటున్నారు. వారికి భోజనం మాత్రమే పెట్టి బండచాకిరీ చేయిస్తున్నారు. మొలచింతలపల్లి వంటి చాలా గ్రామాల్లో ఫిల్టర్‌ ఇసుక వ్యాపారం జోరుగా చేస్తోంది. ఫిల్టర్‌ ఇసుక కేంద్రాల్లో పనిచేసే వారిని ఎలా చిత్రహింసలకు గురిచేస్తారో చెంచుమహిళ ఈశ్వరమ్మపై జరిగిన దాడే నిదర్శనం. ఆమె పొలంతో పాటు ఇసుక ఫిల్టర్‌ కేంద్రంలో పని చేస్తోంది. పని ఒత్తిడి వల్లే ఆమె తెలిసిన వాళ్ల వద్దకు వెళ్లింది. అయినా ఫిల్టర్‌ ఇసుక మాఫియా ఆమెను వదల్లేదు. ఇలాంటి చెంచులు ఎంతో మంది ఇసుక ఫిల్టర్‌ మాఫియాకు బలవుతున్నారు. రాజకీయ అండదండలు, అధికార యంత్రాంగం మద్దతు ఉండటంతో ఫిల్టర్‌ ఇసుక మాఫియాకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాటుసారా తయారీ, అడవిలో గంజాయి సాగు, రవాణా వంటి పనుల్లోనూ చెంచులను వాడుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 

ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి.. : గుంపుమేస్త్రీలు చెంచులను ఇతర రాష్ట్రాలు, ఫాంహౌస్‌లు, నిర్మాణ రంగం, వ్యవసాయ పనులకు తీసుకెళ్తున్నారు. ముందుగా కొంత డబ్బు ఇచ్చి వారితో వారి రెక్కలు ముక్కలయ్యేలా పని చేయించుకుంటున్నారు. ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లిన చెంచు మహిళలపై కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇవన్నీ బయటకు చెప్పలేక తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ డీఎస్పీ శ్రీనివాసులును ‘ఈనాడు’ సంప్రదించగా మొలచింతపల్లి వంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేకంగా చర్యలు చేపడతామని తెలిపారు. 

ప్రభుత్వం ఏం జవాబు చెబుతుంది : చెంచు మహిళపై జరిగిన అమానుష దాడిపై ప్రభుత్వం ఏమని జవాబు చెప్పగలదు. అసలు చెంచు జాతి ఉండాలా? వద్దా? వారిని కాపాడుకోవాల్సిన అవసరం లేదా? వేలాది ఏళ్లుగా అడవిని నమ్ముకుని జీవిస్తున్న జాతిని ఆగం చేస్తున్నాం. చెంచు మహిళ భూమితో పాటు సమస్తం కోల్పోయింది. దాడి సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన. ప్రభుత్వం, ప్రతిపక్షాలు స్పందించాలి. 
- రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌

బాధ్యులైన ప్రతి ఒక్కరిని శిక్షించాలి : అమానుష ఘటనకు బాధ్యులైన ప్రతి ఒక్కరిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలి. చెంచుపెంటల్లో వెట్టిచాకిరి, మానవ అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థపై సర్వే చేస్తున్నాం. అందులో భాగంగా మొలచింతలపల్లికి వెళ్లగా చెంచు మహిళ ఈశ్వరమ్మపై జరిగిన దాడి మా దృష్టికి వచ్చింది. దీనిపై వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశాం. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. 
- మహేశ్, జాతీయ ఆదివాసి సాలిడార్టి సంస్థ సమన్వయకర్త

ఫిల్టర్‌ ఇసుక దందా అరికట్టాలి : ప్రభుత్వం నల్లమలలో ఫిల్టర్‌ ఇసుక దందా జరగకుండా చూడాలి. చెంచులను కూలీలుగా మార్చి వారితో వెట్టిచాకిరి చేయిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాంతంలో చాలా మంది ఆదివాసీ మహిళలపై దాడులు జరిగాయి. ఒకటి, రెండు ఘటనలే బయటకు వచ్చాయి. 
- మల్లికార్జున్, ఆదివాసీ సంఘం నేత, సార్లపల్లి
పునరావృతం కాకుండా చూడాలి : ఒక చెంచు మహిళపై దారుణంగా దాడి చేయడం హేయమైన చర్య. మొలచింతపల్లిలో జరిగిన లాంటి అమానవీయ ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చూడాలి. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దీనిపై జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించాలి. 
- శ్రీనివాసులు, ఆదివాసీ ఐక్యవేదిక అధ్యక్షుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని