logo

ఆక్రమణ చెరలో రహదారులు

గద్వాల మొదలుకొని జిల్లాలో రహదారులు రెండు వైపులా ఆక్రమణలకు గురవుతున్నాయి. మధ్యలో ఉన్న బీటీ రహదారి తప్ప మిగతా రెండు వైపులా ఉన్న ప్రభుత్వ రహదారి కొన్ని ప్రాంతాల్లో సాగు భూమిగా మారిపోతోంది.

Updated : 22 Jun 2024 05:49 IST

కుంచించుకుపోతూ రాకపోకలకు ఇబ్బందులు

గట్టు మార్లబీడు దారిది, గద్వాల - రాయచూరు అంతర్రాష్ట్ర రహదారిదీ ఇదే పరిస్థితి. 

ధరూరు, న్యూస్‌టుడే: గద్వాల మొదలుకొని జిల్లాలో రహదారులు రెండు వైపులా ఆక్రమణలకు గురవుతున్నాయి. మధ్యలో ఉన్న బీటీ రహదారి తప్ప మిగతా రెండు వైపులా ఉన్న ప్రభుత్వ రహదారి కొన్ని ప్రాంతాల్లో సాగు భూమిగా మారిపోతోంది. హద్దుల్లేని ఆక్రమణల వల్ల వాహన రాకపోకలకు ఇబ్బందులు తప్పటం లేదు. ఇక గ్రామీణ బీటీ రహదారుల పరిస్థితి మరింత అధ్వానంగా మారిందనే విమర్శ వినిపిస్తోంది. రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే వెళ్లటానికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంటోంది. కాస్త అదుపు తప్పితే వాహనాలు పొలాల్లోకి వెళ్లాల్సిందే. 
పర్యవేక్షణ కరవై: రహదారుల ఆక్రమణలపై పర్యవేక్షించాల్సిన ర.భ, పంచాయతీ రాజ్‌ శాఖల మధ్య సమన్వయం కరవైంది. ఏ అధికారి కూడా రహదారి అక్రమణలపై పర్యవేక్షణ చేస్తున్నట్లు కనిపించటం లేదన్న విమర్శ జిల్లాలో వినిపిస్తోంది. 

  • ధరూరు నుంచి గుడ్డెందొడ్డి, మాల్‌దొడ్డి మీదుగా ఉన్న నెట్టెంపాడు వరకున్న 15 కి.మీ. రహదారి ఇది. ఇరువైపులా ఆక్రమణలకు గురైంది.
  • ధరూరు నుంచి మన్నాపురం మీదుగా నెట్టంపాడు వరకు ఉన్న రహదారి 33 అడుగుల వెడల్పు ఉండాలి కానీ ఎక్కడ చూసినా బీటీ రహదారి 12 నుంచి 15 ఫీట్ల వరకే ఉంది. 
  • గద్వాల నుంచి రాయచూరు వరకు ఉన్న అంతరాష్ట్ర రహదారి వెడల్పు 120 అడుగులు ఉండగా మధ్యలో బీటీ రహదారి రెండు వైపులా కలిపి 30 అడుగులు తప్ప మిగతా రెండు వైపులా ఉన్న ప్రభుత్వ భూమి అక్రమణకు గురైంది.
  • ధరూరు నుంచి బిజ్వారం మీదుగా అమరవాయి వరకు ఉన్న 13 కీ.మీ. దారి మధ్యలో 12 అడుగుట బీటీ దారి తప్ప పక్కనున్న భూమి ఇరువైపులా అక్రమణకు గురైంది. 

మొక్కలను కాల్చేసి: రహదారుల పొడవునా ఇరువైపులా ప్రతి ఐదడుగుల దూరంలో ఒక మొక్క చొప్పున నాటారు. ఇలా జోగులాంబ జిల్లాలోని అన్ని రహదారుల వెంబడి ఇరువైపులా నాటే మొక్కల లెక్క చూస్తే లక్షల్లోనే ఉంటుంది. రహదారులకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని హద్దులు చెరిపేసి రైతులు వ్యవసాయ పొలాలుగా మార్చుకున్నారు. రాత్రి వేళల్లో అవసరమైతే పొలంలో చెత్తతో పాటు వాటికి అగ్గంటిచేస్తున్నారు. 
ఎదురుగా వాహనం వస్తే అంతే: ధరూరు నుంచి మాల్‌దొడ్డి వరకు ఉన్న దారి ఆక్రమణకు గురైంది. ఎదురుగా వాహనం వస్తే అంతే సంగతి అదుపు తప్పితే పొలాల్లోకి దూసుకెళ్లి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నారు. హద్దులు పాతి రహదారుల ఆక్రమణకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. 
-సిద్దప్ప, మాల్‌దొడ్డి 

బీటీరోడ్డు మాత్రమే మిగిలింది: మార్లబీడు దారిలో రెండు వైపులా ఆక్రమణ కారణంగా మధ్యలో బీటీ రోడ్డు మాత్రమే కనిపిస్తోంది. వాహనాల రాకపోకలకు రాత్రి వేళల్లో ఇబ్బందులు తప్పటం లేదు. అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. నిబంధనల మేరకు విస్తరించి మట్టితో రోడ్డు వేయాలి.
-నర్సింహులు, మార్లబీడు 

విస్తరణ సమయంలో హద్దు వరకు: గ్రామీణ, రాష్ట్ర రహదారుల వెంబడి ఇరువైపులా ఆక్రమిత ప్రభుత్వ భూమి గుర్తించి హద్దురాళ్లు పాతినా రైతులు చేరిపేస్తున్నారు. విస్తరణ సమయంలో ప్రభుత్వ స్థలం ఎంత వరకు అంత వరకు రహదారుల విస్తరణ చేపడతాం. మొక్కలు నాటే సమయంలో కూడా డీఆర్డీఏ అధికారులకు నిబంధనలతో కూడిన వివరాలు పంపించాం. వాటి మేరకు రహదారులకు రెండు వైపులా ప్రభుత్వం భూమి ఎంత వరకు ఉందో గుర్తించి చివరన మొక్కలు నాటాలని సూచిస్తున్నాం. 
-కిరణ్‌కుమార్, ర.భ డీఈ, జోగులాంబ జిల్లా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని