logo

పాలమూరు వైద్య కళాశాలకు పీజీ సీట్లు

మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలకు నాలుగు పీజీ సీట్లతో చిన్న పిల్లల వైద్య విభాగం (పీడియాట్రిక్‌) మంజూరైంది.

Published : 22 Jun 2024 04:55 IST

చిన్న పిల్లల విభాగం మంజూరు

మరో రెండు విభాగాల ప్రతిపాదనలు తిరస్కరణ

పీజీ సీట్లు మంజూరు కావడంతో వైద్య కళాశాల డైరెక్టర్‌ డా.రమేశ్‌కు మిఠాయిలు తినిపిస్తున్న ఆచార్యులు, సిబ్బంది 

న్యూస్‌టుడే, పాలమూరు : మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలకు నాలుగు పీజీ సీట్లతో చిన్న పిల్లల వైద్య విభాగం (పీడియాట్రిక్‌) మంజూరైంది. గతేడాది సెప్టెంబర్‌ 15న పీడియాట్రిక్, అసస్థీషియా(మత్తుమందు),అఫ్తమాలజీ(నేత్రవైద్యం) విభాగాలకు పీజీ సీట్ల మంజూరు కోరుతూ కళాశాల నుంచి దరఖాస్తు చేశారు. అన్ని రకాల నివేదికలు సిద్ధం చేసి నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (జాతీయ వైద్య మండలి)కి సమర్పించారు. చిన్న పిల్లల వైద్య విభాగానికి మాత్రమే పీజీ సీట్లు మంజూరు చేశారు. మిగతా రెండు ప్రతిపాదనలను తిరస్కరించారు. 2016 నుంచి మహబూబ్‌నగర్‌ పట్టణ శివారులోని తిరుమల హిల్స్‌లో ప్రభుత్వ వైద్య కళాశాల కొనసాగుతోంది. పీజీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఐదేళ్లు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. 2021లోనే పీజీ సీట్లకు అర్హత సాధించింది. అప్పటి నుంచి ఆయా విభాగాలకు పీజీ సీట్ల కోసం దరఖాస్తు చేస్తున్నారు. మూడేళ్ల నుంచి 8 విభాగాల్లో పీజీ సీట్లు వచ్చాయి. అందులో నాన్‌ క్లినికల్‌ విభాగంలోనే ఎక్కువ సీట్లు మంజూరయ్యాయి. క్లినికల్‌ విభాగంలో ప్రసూతి విభాగానికి మాత్రమే గతేడాది మూడు సీట్లు మంజూరు అయ్యాయి. ఆ సీట్లలో ప్రస్తుతం పీజీ వైద్య విద్య కొనసాగుతోంది. 

మొత్తం సీట్లు 30 : మహబూబ్‌నగర్‌ కళాశాలలో పీజీ వైద్యవిద్యలో ప్రస్తుతం 26 సీట్లు ఉండగా కొత్తగా నాలుగు మంజూరయ్యాయి. అందులో నాన్‌ క్లినికల్‌ విభాగంలో 23 ఉన్నాయి. అనాటమీలో మూడు సీట్లు, ఫీజీయాలజీలో మూడు, బయో కెమెస్ట్రీలో మూడు, మైక్రో బయాలజీలో మూడు, ఫార్మాకాలజీ (డ్రగ్స్‌)లో మూడు, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌లో రెండు, ఫాథాలజీలో మూడు, కమ్యూనిటీ మెడిసిన్‌లో మూడు చొప్పున పీజీ సీట్లు ఉన్నాయి. ప్రధానంగా పేదలకు అత్యవసర వైద్యం అందించేందుకు క్లినికల్‌ విభాగాలకు పీజీ సీట్లు మంజూరు కావాల్సి ఉంది. జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, రేడియాలజీ, అర్థోపెడిక్స్, ఈఎన్‌టీ, ఆఫ్తామాలజీ, అనస్థీషియా, డెర్మటాలజీ తదితర ముఖ్యమైన విభాగాలకు పీజీ సీట్లు అవసరం. గైనకాలజీలో మూడు, పీడియాట్రిక్‌లో నాలుగు కలిపి క్లినికల్‌ విభాగంలోని ఏడు సీట్లు ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి నిత్యం ఉమ్మడి జిల్లా నుంచి 2వేల మంది వరకు రోగులు వస్తున్నారు. వారికి సకాలంలో వైద్యసేవలు అందించడానికి పీజీ సీట్లు అవసరం కానున్నాయి. 

ప్రతిపాదనలు మళ్లీ పంపించాం : గతేడాది పీజీ వైద్య విద్య సీట్ల జాతీయ వైద్య మండలి దరఖాస్తులు చేశాం. అంతర్జాలం ద్వారా పరిశీలన పూర్తయ్యింది. ఒక్క విభాగానికి పీజీ సీట్లు రాగా రెండిండిని తిరస్కరించారు.సమాచారంలో సాంకేతిక లోపం వల్ల అవి తిరస్కరణకు గురయ్యాయి. ఇప్పుడు వాటిని సరిచేసి ఎన్‌ఎంసీకి మళ్లీ ప్రతిపాదనలు సమర్పించాం. త్వరలోనే అనస్థీషీయా, ఆఫ్తమాలజీ విభాగాలకు పీజీ సీట్లు నాలుగు చొప్పున 8 రానున్నాయి. మిగతా విభాగాలకు ఆచార్య పోస్టులు తక్కువగా ఉన్నందున పీజీ సీట్లు రావడం లేదు. తగినంత మంది ఆచార్యులను కళాశాలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించాం. పోస్టులు మంజూరైతే మరిన్ని విభాగాలకు పీజీ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 
- డా.రమేశ్, డైరెక్టర్, మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు