logo

ఉపాధ్యాయ బదిలీల సీనియార్టీ జాబితా విడుదల

స్కూల్‌ అసిస్టెంట్‌ సమాన స్థాయి ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. సెప్టెంబరులో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 9,824 మంది ఉపాధ్యాయులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Updated : 22 Jun 2024 05:44 IST

నేటి నుంచి ఆప్షన్ల స్వీకరణ

అచ్చంపేటలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఉపాధ్యాయులు  

అచ్చంపేట, న్యూస్‌టుడే : స్కూల్‌ అసిస్టెంట్‌ సమాన స్థాయి ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. సెప్టెంబరులో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 9,824 మంది ఉపాధ్యాయులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఏడాది జూన్‌ 1 నాటికి ఒకే పాఠశాలలో 8 ఏళ్లు పూర్తి చేసుకున్న వారిని కూడా బదిలీ చేయనున్నారు. కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి బదిలీ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. దీంతో మరో 500 మంది ఉపాధ్యాయులు అదనంగా బదిలీ అయ్యే అవకాశం ఏర్పడింది. మల్టీజోన్‌-2లో శుక్రవారం స్కూల్‌ అసిస్టెంట్‌ బదిలీల కోసం తాత్కాలిక సీనియార్టీ జాబితాలను విడుదల చేశారు. వీటిపై అభ్యంతరాలు స్వీకరించి శనివారం ఉదయం వెబ్‌ ఆఫ్షన్ల నమోదు పూర్తి కాగానే ఆన్‌లైన్‌లో బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. బదిలీ అయిన ఉపాధ్యాయులు సోమవారం కొత్త స్థానాల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది. 

పాయింట్ల కేటాయింపు ప్రక్రియ..

బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులకు సర్వీసు, పాఠశాల సీనియార్టీ ఆధారంగా పాయింట్లు కేటాయించి సీనియార్టీ జాబితాలు రూపొందిస్తున్నారు.  ఉపాధ్యాయులు నియామకమైన నాటి నుంచి ఈ నెల 1 వరకు లెక్కించి సర్వీసు పాయింట్లు కేటాయిస్తారు. నెలకు 0.041 పాయింట్లు, ఏడాదికి 0.492 పాయింట్ల వంతున లెక్కించనున్నారు. ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుంటే అంత ఎక్కువ పాయింట్లు వచ్చే అవకాశం ఉంది. ఆ తరువాత ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాల విభాగం ఆధారంగా పాయింట్లు కేటాయించనున్నారు. ఉపాధ్యాయులకు చెల్లించే ఇంటి అద్దె శాతం ఆధారంగా పాఠశాలలను నాలుగు విభాగాలు చేశారు. ఒకటో విభాగం వారికి నెలకు 0.083, ఏడాదికి ఒక పాయింటు కేటాయిస్తారు. రెండో విభాగం వారికి నెలకు 0.16, ఏడాదికి 2, మూడో విభాగం వారికి నెలకు 0.25, ఏడాదికి 3, నాలుగో విభాగం వారికి నెలకు 0.416, ఏడాదికి 5 పాయింట్లు లెక్కించి సీనియార్టీ జాబితాలు తయారు చేసి ప్రకటిస్తారు. 

ప్రత్యేక విభాగాలకు ఇలా..

అవివాహిత మహిళా ఉపాధ్యాయులు, భార్యాభర్తలు ఉద్యోగులుగా ఉన్న ఉపాధ్యాయులు, రేషనలైజేషన్‌లో ఉపాధ్యాయ పోస్టు మరో పాఠశాలకు బదిలీ అయినప్పుడు పది పాయింట్లు అదనంగా కేటాయిస్తారు. జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు 15 పాయింట్లు, రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు పది పాయింట్లు అదనంగా కేటాయిస్తారు. పదో తరగతిలో సాధించిన ఫలితాల ఆధారంగా ప్రత్యేక పాయింట్లు కేటాయిస్తారు. ఉపాధ్యాయుడు బోధించే సబ్జెక్టులో వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తే 2.5 పాయింట్లు, 95-99 శాతం ఉత్తీర్ణతకు రెండు పాయింట్లు, 90-94 శాతం ఉత్తీర్ణతకు ఒక పాయింట్‌ అదనంగా కలుపుతారు. 90 శాతం కన్నా తక్కువ ఉత్తీర్ణత ఉన్న వారికి ఎలాంటి అదనపు పాయింట్లు ఉండవు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాల్లో రాష్ట్ర స్థాయి రీసోర్స్‌ పర్సన్లకు 5 పాయింట్లు, జిల్లా స్థాయికి నాలుగు పాయింట్లు, మండల స్థాయి వారికి రెండు పాయింట్లు అదనంగా కలుపుతారు. దివ్యాంగులు, వితంతువులైన ఉపాధ్యాయులకు బదిలీల్లో మొదటి ప్రాధాన్యత కల్పిస్తారు. 70 శాతం చూపు, వైకల్యం కలిగిన వారు సదరం ధ్రువ పత్రాలు అందజేయాలి. వితంతువులైన ఉపాధ్యాయినులు, చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న వారు వాటిని ధ్రువీకరించే పత్రాలు జత చేయాలి. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వారికి కూడా బదిలీల్లో ప్రాధాన్యత ఇస్తారు. క్యాన్సర్, గుండె, నరాల శస్త్రచికిత్స, ఎముకల క్షయ వ్యాధి, కాలేయం, మూత్రపిండాలు, గుండె మార్పిడి చికిత్సలు పొందిన వారు, మానసిక, లుకేమియా, గుండెకు రంధ్రం, షుగర్‌ వ్యాధి బారిన పడిన పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు బదిలీల్లో ప్రాధాన్యత ఇస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని