logo

పుస్తకాలకు విరామమిస్తారా?

గద్వాల పట్టణానికి చెందిన ఓ విద్యార్థి కొన్ని రోజులుగా బడి నుంచి ఇంటికి రాగానే నీరసంగా కనిపిస్తున్నాడు.

Updated : 22 Jun 2024 05:56 IST

కాగితాలకే పరిమితమవుతున్న ‘నో బ్యాగ్‌ డే’

 పుస్తకాల బ్యాగులతో పాఠశాలకు వస్తున్న విద్యార్థులు

గద్వాల న్యూటౌన్, న్యూస్‌టుడే: గద్వాల పట్టణానికి చెందిన ఓ విద్యార్థి కొన్ని రోజులుగా బడి నుంచి ఇంటికి రాగానే నీరసంగా కనిపిస్తున్నాడు. కాళ్లు నొప్పిగా ఉన్నాయని, మెడ, వెన్నుభాగం ఇబ్బందిగా ఉందని చెబితే తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు తీవ్రమైన బరువు మోయడం వల్ల వెన్ను సమస్య వచ్చిందని తెలిపారు.ఆటపాటలతో చదువుకునేందుకు విద్యాలయాల్ల్లో అడుగుపెడుతున్న పిల్లలపై ఒత్తిడితో కూడిన చదువు తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. చదువుల భారంతో మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. పుస్తకాల మోత వారి శారీరక ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారుతోంది. దీనిని గుర్తించి ప్రభుత్వం రెండేళ్ల కిందటే ‘నో బ్యాగ్‌ డే’ కార్యక్రమానికి జాతీయ విద్యా ప్రణాళిక - 2005ను అనుసరించి స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. అయితే ఇది అమలుకు నోచుకోవడం లేదు. ఏటా దీనిపై ప్రభుత్వం ప్రకటన చేస్తున్నా.. కాగితాలకే పరిమితమవుతోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విద్యా సంవత్సర క్యాలెండర్‌లో ప్రతి 4వ శనివారం బడి సంచి లేకుండా విద్యార్థులు బడికి రావాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ సారైనా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అమలుకు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి: ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 3,227 ప్రభుత్వ పాఠశాలలుండగా, 3.01 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 1,120 ప్రైవేటు పాఠశాలల్లో 1.20 లక్షల మంది చదువుతున్నారు. వీటన్నింటిలో కొన్ని ప్రభుత్వ పాఠశాలలను మినహాయిస్తే.. మిగిలిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ‘నో బ్యాగ్‌ డే’ అమలుకు కావడం లేదు. ఉదయం 8 అయ్యిందంటే విద్యార్థులు భుజాలకు బడి సంచులు వేసుకొని భారంగా నడవటం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తోంది. ఇది పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందనే ఆందోళన తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. ప్రైవేటు బడుల్లో ఒకటో తరగతి విద్యార్థికి వివిధ రకాల అచ్చు, రాత పుస్తకాల పేరుతో 3-5 కేజీలకు పైగా బరువు ఉంటున్నాయి. ఇక 9, 10వ తరగతి వారికి 10 - 15 కేజీల పైమాటే. వీటితో పాటు లంచ్‌ బాక్స్, నీళ్ల సీసా అదనం. పుస్తక ముద్రణ సంస్థలు ఇచ్చే కమీషన్ల కోసమే అవసరానికన్నా ఎక్కువ పుస్తకాలు ప్రైవేటు యాజమాన్యాలు కొనసాగిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ కనీసం ‘నో బ్యాగ్‌ డే’నైనా పక్కాగా అమలయ్యేలా చూడాల్సిన అవసరం ఉంది.
విద్యార్థుల మెదడుపై ఒత్తిడి పడకుండా, సృజనాత్మకత పెంచేలా, సృజనాత్మకంగా విద్యనభ్యసించాలన్నది ‘నో బ్యాగ్‌ డే’ ప్రధానోద్దేశం. విద్యార్థులు ఒట్టి చేతులతో బడికి వెళ్లి ఆటపాటలతో గడపాల్సి ఉంటుంది. బ్యాగ్‌ బరువు ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు పరిశీలించాలి. విద్యాశాఖ క్యాలెండర్‌ ప్రకారం 10 రోజులు ‘నో బ్యాగ్‌ డే’ అమలు చేయాలి. ఇందులో 28 రకాల కార్యక్రమాలు నిర్వహించాలి. ఖాళీగా వచ్చిన విద్యార్థులకు ఇష్టమైన చిత్రలేఖనం. నృత్యం, బాలసభ, మిమిక్రీ, హాస్య కవితా సమ్మేళనం, నాటిక, నాట్యప్రదర్శన తదితర కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఆదేశాలు అమలుకాకపోవడంతో కేవలం పుస్తకాలకే విద్యార్థులు పరిమితం కావాల్సి వస్తోంది.

 ఎవరేమి చేయాలి 

  • పుస్తకాల సంచి అధిక బరువుపై తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాలతో మాట్లాడి ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టాలి.
  •  ప్రతి పాఠశాలలో విద్యార్థులు రెండో సంచి ఉంచుకునే అవకాశం కల్పించాలి. బడి వరకు పుస్తకాలు అందులో ఉంచేలా చూడాలి. హోంవర్క్‌ ఇచ్చిన సబ్జెక్టుల రాత పుస్తకాలు మాత్రమే తీసుకెళ్లేలా చేయాలి. 
  • సంచి బరువు శరీరంపై సమానంగా ఉండేలా వెడల్పు పట్టీలున్న బ్యాగులను తల్లిదండ్రులు కొనుగోలు చేసి ఇవ్వడం మంచిది.

చర్యలు తీసుకుంటాం: విద్యార్థులకు పుస్తకాల మోత తగ్గించడం, వారిలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ‘నో బ్యాగ్‌ డే’ నిర్వహించాల్సి ఉంది. వీటికి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. తప్పనిసరిగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలిచ్చి, ఎంఈవోల ద్వారా పర్యవేక్షణ చేపడతాం.

-ఇందిర, డీఈవో, జోగులాంబ గద్వాల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని