logo

పాలమూరు ప్రతిభావంతులు

దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వర్సిటీలు, విద్యా సంస్థల్లో పాలమూరు విశ్వవిద్యాలయానికి చెందిన పలువురు పేద విద్యార్థులు సీట్లు సాధించి లక్ష్య సాధనలో ముందడుగు వేశారు.

Updated : 22 Jun 2024 06:01 IST

 

న్యూస్‌టుడే, పాలమూరు విశ్వవిద్యాలయం : దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వర్సిటీలు, విద్యా సంస్థల్లో పాలమూరు విశ్వవిద్యాలయానికి చెందిన పలువురు పేద విద్యార్థులు సీట్లు సాధించి లక్ష్య సాధనలో ముందడుగు వేశారు. నిరంతరం శ్రమిస్తూ జాతీయ స్థాయిలో నిర్వహించిన జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌ (జామ్‌-2024), కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌) విజయం సాధించారు. అఖిల భారత స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు, పర్సంటైల్‌ సాధించి సత్తా చాటారు. పీయూకు చెందిన ఎంఎస్సీ (ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ) విద్యార్థులు పీజీ కళాశాల ప్రిన్సిపల్, ఆ విభాగం అధ్యాపకుల ప్రోత్సాహంతో జామ్, క్యాట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. పోటీ పరీక్షల్లో ఎలా రాణించాలో అధ్యాపకులు తీర్చిదిద్దారు. వారి చదువులకు ఆర్థిక సహకారం అందించారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీటు సాధించిన వారికి ప్రభుత్వ ఉన్నత కొలువులు దక్కించుకోవడం, దేశ వ్యాప్తంగా పరిశోధన కేంద్రాల్లో శాస్త్రవేత్తలుగా, ఉన్నత విద్యావంతులుగా ఎదిగేందుకు ఎన్నో అవకాశాలు దక్కనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విస్తృత అవకాశాలు ఉంటాయి.

వినూత్న ఆవిష్కరణలతో సమాజాభివృద్ధి :  నా పేరు ముడావత్‌ రాజు. మా అమ్మానాన్న నూరిబాయి, హన్మంతు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పీయూలో ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ నాలుగో సంవత్సరం చదువుతూ జామ్‌-2024 ప్రవేశ పరీక్ష రాశా. ఆలిండియా స్థాయిలో 1,154 ర్యాంకు రావడంతో ఐఐటీ బాంబేలో సీటు వచ్చింది. అమ్మానాన్నల కష్టాన్ని కళ్లారా చూశా. ఆ కసితోనే అధ్యాపకుల సూచనలు, మార్గదర్శకత్వంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా. భవిష్యత్తులో వినూత్న ఆవిష్కరణలతో సమాజాభివృద్ధికి కృషి చేస్తా. దేశానికి నా కుటుంబం తరఫున ఓ గొప్ప జ్ఞాపకాన్ని మిగిల్చానన్నదే నా లక్ష్యం.

పరిశోధన రంగంలో రాణించాలన్నదే లక్ష్యం: నా పేరు కాట్రావత్‌ రమేశ్‌. పీయూలో ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ మూడో సంవత్సరం చదువుతున్నా. అమ్మనాన్న అంజమ్మ, లోక్యానాయక్‌. నాన్న తాపీ మేస్త్రీ. నిత్యం కూలీకి వెళ్తేగానీ ఇల్లు గడవదు. అలాంటి పరిస్థితుల్లో ముగ్గురిని చదివిస్తూ కష్టమేంటో మాకు తెలియకుండా పెంచుతున్న నాన్న ఆశయాలకు అనుగుణంగా ఉన్నతంగా ఎదిగి.. పరిశోధన రంగంలో రాణించాలన్నదే నా లక్ష్యం. జామ్‌-2024 ప్రవేశ పరీక్షలో 6,642 ర్యాంకుతో ఎన్‌ఐటీ జైపూర్‌లో సీటు సాధించా.

ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఉంది..:  నా పేరు ఎస్‌.సంజయ్‌నాయక్‌. అమ్మానాన్న స్వరూప, మేఘానాయక్‌. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తారు. క్యాట్‌లో 82 పర్సంటైల్‌తో ఐఐఎం జమ్మూకశ్మీర్‌లో సీటు సాధించా. మల్టీ నేషనల్‌ కంపెనీలో జాబ్‌ సంపాదించి ఉన్నత స్థాయికి చేరుకోవడమే నా లక్ష్యం. ఇంటర్‌ తర్వాత పీయూలో ఇంటిగ్రేటెడ్‌ ఐదేళ్ల కెమిస్ట్రీలో చేరా. ప్రస్తుతం మూడో సంవత్సరం చదువుతున్నా. ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో సీటు సాధించా. అవకాశాలపై యువతకు సరైన అవగాహన లేక నిరుద్యోగ సమస్య మరింత జఠిలం అవుతుందని భావిస్తున్నా. నాలాంటి యువతకు ఉన్నత స్థాయిలో ఆధునిక సాంకేతిక ఉపాధి అవకాశాలు మరింత చేరువ చేయడమే నా జీవితాశయం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని