logo

అద్దెకు అగ్నిమాపక సేవలు

అగ్ని ప్రమాదం ఎప్పుడు ఏ విధంగా సంభవిస్తుందో తెలియదు. విపత్కర పరిస్థితులు ఎదుర్కోడానికి అగ్నిమాపక శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.

Updated : 22 Jun 2024 05:58 IST

న్యూస్‌టుడే-(పాతబస్టాండ్‌)నారాయణపేట : అగ్ని ప్రమాదం ఎప్పుడు ఏ విధంగా సంభవిస్తుందో తెలియదు. విపత్కర పరిస్థితులు ఎదుర్కోడానికి అగ్నిమాపక శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. పెద్ద సమావేశాలు, వేడుకలు జరిగేటప్పుడు అగ్నిమాపక సేవలను ప్రైవేటు వ్యక్తులు వినియోగించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. అద్దె చెల్లించి అగ్నిమాపక వాహనాలను బుక్‌చేసుకోవచ్చు. ఈ విషయం ఎక్కువమందికి తెలియదు. చాలా ఏళ్ల క్రితమే ప్రభుత్వం జీవో 253 విడుదల చేసింది. మహబూబ్‌నగర్, గద్వాల, నాగర్‌కర్నూల్, జడ్చర్ల వంటి పెద్ద పట్టణాల్లో సమావేశాలు, ఈవెంట్లు తరచుగా జరుగుతుంటాయి. అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు దాదాపు ఎక్కడా చేసుకోవడం లేదనే చెప్పాలి. ఇకపై ఫైరింజన్లను అద్దెకు తీసుకోవచ్చు. గంటలు, రోజుల చొప్పున అద్దె చెల్లించి సేవలు పొందవచ్చు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ శాఖ సిబ్బందికి ఎంత ఒత్తిడి ఉంటుందో సాధారణ సమయాల్లో అంతగా ఖాళీ ఉంటుంది. ఎక్కువ రోజులు పరికరాలు వాడకపోతే పనిచేయకపోయే ప్రమాదం ఉంది. అగ్నిమాపక శాఖకు ఆదాయం సమకూర్చడంతోపాటు జనబాహుళ్యానికి తక్కువ ఖర్చుతో సేవలు అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. 

 పంపింగ్‌ సేవలు సైతం...

నీటి పైపులు పగిలిపోయినప్పుడు, లోతట్టు ప్రాంతాల్లో వరద చేరినా అగ్నిమాపకశాఖ సేవలను వినియోగించుకోవచ్చు. గేటెడ్‌ కమ్యూనిటీ ఇళ్ల సముదాయాలు, లోతట్టు ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్ల సంఘాలవారు నీటిని తోడేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. వారు తక్కువ  ఛార్డీలతో అగ్నిమాపకశాఖ సేవలు పొందొచ్చు. కార్నివాల్, నుమాయిష్‌(ప్రదర్శన), మినీస్టేడియంలో సభలు, ఇతర వేడుకలకు ప్రోటోకాల్‌ ప్రకారంగా ఉచిత సేవలు అందిస్తారు. ప్రైవేటుగా బుక్‌ చేసుకుంటే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.  

ఎంతెంత?

వాహనం పంపే స్టేషన్‌ నుంచి ప్రదర్శన, వేడుక, సమావేశం జరుగుతున్న వేదిక వరకు కిలో మీటరకు రూ.20చొప్పున ప్రత్యేకంగా చెల్లించాలి. నాన్‌ ప్రాఫిట్, ప్రాఫిట్ సేవల ఆధారంగా గంటకు రూ.1500-రూ.2000, రోజుకు రూ. 15వేల నుంచి 20వేల వరకు చెల్లించాలి. అదే పంపింగ్‌ సేవలకైతే గంటకు రూ.750నుంచి రూ.1000 చెల్లించాలి. పెళ్లి వేడుకలకు గంటకు రూ.3వేలు, రోజుకు 30వేలు చెల్లించాలి. పంపింగ్‌ సేవలకు గంటకు 15 వందలు చెల్లించాలి. మరిన్ని వివరాలకు http;///fire.telangana.gov.in/websitetandby.aspx  వెబ్‌సైట్లో చూడొచ్చని అగ్నిమాపక సిబ్బంది తెలియజేస్తున్నారు. 

ఆన్‌లైన్‌ బుకింగ్‌ 

ఈ సేవలను ఆన్‌లైన్‌లోనే బుక్‌ చేసుకోవాలి. స్టేట్ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌ శాఖ వెబ్‌సైట్లోకి వెళ్లి బుక్‌ ఫైర్‌ స్టాండ్‌ బై వెహికల్‌పై క్లిక్‌ చేయాలి. అక్కడ రిజిస్టర్‌పై క్లిక్‌ చేసి వివరాలు నమోదు చేసి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ నమోదు చేసుకోవాలి. లాగిన్‌ తర్వాత వెహికిల్‌ స్టాండ్‌ బై అప్లికేషన్‌ను క్లిక్‌ చేసి కేటగిరి, పేరు, చిరునామా, మొబైల్‌ నంబర్, ఎప్పటి నుంచి సేవలు అవసరం వంటివి నమోదు చేసి సబ్‌మిట్  చేయాలి. డబ్బు ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. ఈ దరఖాస్తును ఏడీఎఫ్‌వో, డీఎఫ్‌వో, ఆర్‌ఎఫ్‌వోలు పరిశీలించి అనుమతి పత్రాలు జారీచేస్తారు.

ప్రైవేటు సేవలకు షరతులు వర్తిస్తాయి  

వివాహం, ప్రత్యేక కార్యక్రమాలకు అవసరమైతే ఆన్‌లైన్‌లోనే  బుకింగ్‌ చేసుకోవాలి. అదే సమయంలో అత్యవసరమైన ఫోన్‌ వస్తే మరో వాహనం అందుబాటులో లేనట్లయితే అత్యవసర సేవలకే తొలి ప్రాధాన్యం ఇస్తాం. ప్రభుత్వ అధికారుల సమావేశాలు ఉన్నట్లయితే వాహనం పెట్టడం కుదరదు. ఫైరింజన్‌ బుకింగ్‌ చేశాక అనుమతి వస్తేనే సేవలు అందిస్తాం. అత్యవసర  101కు సమాచారం ఇవ్వాలి.ఏవైనా కార్యక్రమాలు జరిగినప్పుడు విద్యుత్తు వైర్లు సరిచూసుకోవాలి. దగ్గరలో పేలుడు పదార్థాలు ఉంచకుండా చూడాలి. నీళ్లు, ఇసుక అందుబాటులో ఉంచుకోవాలి. 
 -మల్లికార్జున్, అగ్నిమాపక అధికారి, నారాయణపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని