logo

ప్రారంభించి మూడేళ్లు.. పూర్తి ఎప్పుడో?

పురపాలక ప్రజలకు ఒకేచోట అన్ని రకాల కూరగాయలు, మాంసం తదితర వంటివి లభించే విధంగా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మించేందుకు నిధులు మంజూరు చేసింది.

Updated : 22 Jun 2024 06:03 IST

పెబ్బేరులో అసంపూర్తిగా సమీకృత మార్కెట్‌ సముదాయం

పెబ్బేరు, న్యూస్‌టుడే : పురపాలక ప్రజలకు ఒకేచోట అన్ని రకాల కూరగాయలు, మాంసం తదితర వంటివి లభించే విధంగా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మించేందుకు నిధులు మంజూరు చేసింది. నిర్మాణాలు ప్రారంభమై మూడేళ్లు దాటుతున్నా పనులు పూర్తి కాలేదు. జిల్లాలో వనపర్తితో పాటు పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత పురపాలికల్లో నిర్మాణాలు ప్రారంభించారు. వనపర్తిలో మాత్రమే నిర్మాణం పూర్తి కాగా మిగతా పురాల్లో ఇంకా పూర్తి కాలేదు. కృష్ణాతీర గ్రామాలకు కేంద్రంగా ఉన్న పెబ్బేరు పట్టణంలో చేపలు విక్రయించేందుకు మార్కెట్‌ సౌకర్యం లేక రహదారులపైనే వ్యాపారులు విక్రయాలు చేస్తున్నారు. 

నిర్మాణాల పరిస్థితి ఇలా..

పెబ్బేరు పట్టణంలోని మార్కెట్‌ యార్డులో 1.30ఎకరాల స్థంలో రూ. 2కోట్ల నిధులతో పనులు ప్రారంభించారు. ఈ నిధులతో 90 శాతం పనులు పూర్తి చేశారు. మొదటి, రెండు స్లాబ్‌లు వేశారు. నిధులు సరిపోకపోవడంతో మళ్లీ అదనంగా రూ.1 కోటి మంజూరు చేశారు. ఈ నిధులతో నిర్మించిన పిల్లర్ల మధ్యలో గోడల నిర్మాణంతో పాటు ఇతర పనులు చేయాల్సి ఉంది. చేసిన పనులకు కేవలం 10 శాతం మాత్రమే గుత్తేదారుకు బిల్లు చెల్లించగా.. మిగతా బిల్లు కోసం ఎదురు చూస్తున్నారు. 

  • కొత్తకోటలో రూ. 2కోట్లతో నిర్మాణ పనులు చేపట్టారు. ఆ నిధులతో 90 శాతం పనులు పూర్తి చేశారు. మొదటి, రెండో స్లాబ్‌లు వేశారు. నిధులు సరిపోకపోవడంతో మళ్లీ అదనంగా రూ.1 కోటి నిధులు మంజూరు చేశారు. గోడల నిర్మాణం, పార్కింగ్‌ ఇతర పనులు చేయాల్సి ఉంది. గుత్తేదారుకు 10శాతం మాత్రమే బిల్లు వచ్చింది. మిగతా బిల్లు రాకపోవడంతో పనుల వద్దకు రావడం లేదు.
  • ఆత్మకూరు, అమరచింత పురపాలికల్లో కూడా రూ.2 కోట్ల చొప్పున నిధులు వచ్చాయి. పిల్లర్లు, స్లాబ్‌ల వరకు నిర్మించగా.. వీటికిగాను రూ. 50లక్షల బిల్లు రావాల్సి ఉండగా.. కేవలం రూ.5లక్షల బిల్లు మాత్రమే వచ్చింది. బిల్లుల సాకుతో గుత్తేదారులు పనులు నిలిపివేశారు. 

సర్కారు మారడంతో..

మూడేళ్ల క్రితంతో పాటు గతేడాది నిర్మించిన పనులకు సంబంధించిన బిల్లులు రావాల్సి ఉంది. నేటికీ కేవలం 10 శాతం మాత్రమే రావడంతో గుత్తేదారులు పనుల వద్దకు రావడం లేదు. కొత్తగా మంజూరైన పనుల సంగతి పక్కన పెడితే.. అసలు నిర్మించిన వాటికైనా బిల్లులు వస్తాయా రావా అనేదానిపై గుత్తేదారులు సమాలోచనలో పడ్డారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు కొత్త ప్రభుత్వం ఏ మేరకు బిల్లులు చెల్లిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. 

ప్రభుత్వ నిర్ణయం మేరకు.. 

నిర్మించిన పనులకు గుత్తేదారులకు బిల్లులు రావాల్సి ఉంది. కొత్త ప్రభుత్వం రావడంతో గుత్తేదారులు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. మేము కూడా వారికి చెప్పడం లేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాతే పనులు చేయాలని అడుగుతాం. కొన్ని చోట్ల నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లను స్టేడియం, విజ్ఞానభాండాగారంగా మార్పులు చేయాలని ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు కట్టుబడి పనిచేస్తాం. 
- విజయ భాస్కర్‌రెడ్డి, ఈఈ, పబ్లిక్‌ హెల్త్, మహబూబ్‌నగర్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని