logo

సైకిల్‌పై కన్యాకుమారికి..

చిన్నతనం నుంచి సైకిల్‌ తొక్కడంలో ఆసక్తి, దానిపై దూర ప్రాంతాలకు వెళ్లాలనే కోరిక ఓ యువకుడిని రాష్ట్రాలు దాటేలా చేసింది.

Updated : 11 Jul 2024 06:00 IST

పెద్దకొత్తపల్లి యువకుడి సాహసం

కొల్లాపూర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: చిన్నతనం నుంచి సైకిల్‌ తొక్కడంలో ఆసక్తి, దానిపై దూర ప్రాంతాలకు వెళ్లాలనే కోరిక ఓ యువకుడిని రాష్ట్రాలు దాటేలా చేసింది. తండ్రి మరణంతో చదువుకు స్వస్తి పలికి ఇక పూర్తిగా సైకిల్‌ రైడింగ్‌పై దృష్టి పెట్టారు ఆ యువకుడు. ఇంకేముంది ప్రతిసారి వేల కిలో మీటర్ల దూరం సైకిల్‌పై వెళ్లి ఆ వివరాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు.

సైకిల్‌ రైడర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలన్న పట్టుదలతో రూ.70 వేలు ఖర్చు చేసి సైకిల్‌ను తీర్చిదిద్దుకున్నారు. దానికి భైరవ     అనే పేరు పెట్టి అవసరమైన సామగ్రిని అమర్చుకున్నారు. నాలుగు రోజుల క్రితం పెద్దకొత్తపల్లి నుంచి కన్యాకుమారి(1152 కి.మీ) బయలుదేరారు. బుధవారం తమిళనాడు రాష్ట్రంలోకి ప్రవేశించారు. కన్యాకుమారికి వెళ్లి తిరిగి రానున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. గత నెలలోనూ పరమేశ్‌ సైకిల్‌పై లద్దాక్, మనాలి వెళ్లారు. పెద్దకొత్తపల్లి నుంచి మనాలి వరకు 20 రోజులు ప్రయాణం చేసినట్లు చెప్పారు.

పేదరికం నుంచి...: పరమేశ్‌ తన తల్లి నీలమ్మతో కలిసి స్వగ్రామం పెద్దకొత్తపల్లిలో ఉంటున్నారు. అంతకుముందు హైదరాబాద్‌కు వలస వెళ్లి అక్కడ కొంతకాలం ఉన్నారు. తండ్రి బాలచంద్రు అనారోగ్యంతో మృతి చెందడంతో రెండేళ్ల క్రితం తిరిగి సొంతూరికి వచ్చారు. ఇక్కడే తల్లి వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది.

సివిల్‌ జడ్జి అభినందన...

పెద్దకొత్తపల్లిలో బుధవారం న్యాయ సేవా సదస్సు నిర్వహించారు. సదస్సులో సివిల్‌ జడ్జి శ్రీనిధి పరమేశ్‌ సైకిల్‌ యాత్ర గురించి యూట్యూబ్‌ ద్వారా తెలుసుకున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా యువకుడి పట్టుదలను అభినందించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు