logo

పరస్పర సహకారంతో అగ్నిప్రమాదాలకు అడ్డుకట్ట

పోటీ అనేది మార్కెట్‌లో, వస్తు ఉత్పత్తిలోనే కానీ అత్యవసర సమయంలో కాదని పరిశ్రమల యాజమాన్యాలు నిరూపిస్తున్నాయి. ప్రధానంగా ప్రమాదాలు జరిగినప్పుడు సహకారం అందిసుండటం గమనార్హం.

Published : 24 Mar 2023 01:11 IST

న్యూస్‌టుడే, జిన్నారం

ఖాజీపల్లిలోని ఓ పరిశ్రమలో మంటలు ఆర్పుతూ..

పోటీ అనేది మార్కెట్‌లో, వస్తు ఉత్పత్తిలోనే కానీ అత్యవసర సమయంలో కాదని పరిశ్రమల యాజమాన్యాలు నిరూపిస్తున్నాయి. ప్రధానంగా ప్రమాదాలు జరిగినప్పుడు సహకారం అందిసుండటం గమనార్హం. నాలుగేళ్లుగా సంగారెడ్డి జిల్లాలోని అన్ని పారిశ్రామిక వాడల్లో ఈ స్ఫూర్తి కనిపిస్తోంది.

సూచనలు, సలహాలు

సాధారణంగా పారిశ్రామిక వాడల్లో ప్రమాదం అంటే అది భారీ స్థాయిలోనే ఉంటుంది. వీటి నివారణకు యాజమాన్యాలు ప్రత్యేక దృష్టిసారిస్తాయి. ప్రత్యేకంగా శిక్షణ పొందిన భద్రతా సిబ్బందిని నియమించుకుంటారు. అయితే భారీ అగ్ని ప్రమాదాలు జరిగిప్పుడు సిబ్బంది సరిపోకపోవచ్చు. ఇలాంటి తరుణంలో ఒకరినొకరు సాయం అందిపుచ్చుకుంటే మంటల వ్యాప్తి నిరోధానికి అడ్డుకట్ట పడుతుంది. ఏదైనా ఘటన జరగ్గానే వెంటనే సిబ్బందితో ప్రతినిధులు అక్కడికి చేరుకుంటున్నారు. మంటలకు కారణాలు, ఏ రసాయనం ఉంటుంది, నివారణకు చర్యలపై చర్చించి నిపుణుల సహకారంతో ప్రక్రియ ప్రారంభిస్తారు. పలు కర్మాగారాల్లో చిన్న అగ్నిమాపక శకటాలు ఉండగా వాటిని పంపిస్తున్నారు. గడ్డపోతారంలో హెటిరో, ఐడీఏ బొల్లారంలో డాక్టర్‌ రెడ్డీస్‌ పరిశ్రమల యాజమాన్యాలు జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో అగ్నిమాపక కేంద్రాలు లేకపోవడంతో ఎక్కడైనా ప్రమాదం జరగ్గానే వెంటనే స్పందిస్తున్నాయి. ఫోమ్‌, ఇసుక, ఇతరత్రా వాటిని సరఫరా చేస్తున్నారు.

భద్రతా శాఖ నిర్దేశంతో..

గతంలో ఇలాంటి సహకారం ఉండేది కాదు. కర్మాగారాల భద్రతా శాఖ సమస్యను గుర్తించి ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో అడుగేసింది. పరిశ్రమల యాజమాన్యాలు ఒకరినొకరు సహకరించుకోవాలని సూచనలు చేసింది. పరిశ్రమల వారీగా, పారిశ్రామిక వాడల్లో నిర్వహించే సమావేశాల్లో ఈ మేరకు అవగాహన సైతం కల్పించింది. జాతీయ భద్రతా వారోత్సవాల్లో ప్రత్యేకంగా సహకారంపై చర్చించేవారు. వీటిపైనే పోటీలు సైతం నిర్వహించడం గమనార్హం. వీటన్నింటి ఫలితంగా ఒకరికొకరు సహకారంతో పరిశ్రమల మధ్య స్నేహపూర్వక వాతారణం నెలకొంది.


తప్పక స్పందించాలి: నాగేశ్వర్‌రావు, ఏలూరి ఫార్మా ఎండీ

సమస్యను వెంటనే గుర్తించి ప్రతి పరిశ్రమ తప్పక స్పందించాలి. తమ వద్ద వస్తు, సిబ్బందితో ఘటనాస్థలికి వెళ్తే సమస్యకు పరిష్కారం చూపవచ్చు. రసాయనాల ప్రమాదం అంటే ఆచీ తూచీ వ్యవహరించాలి. నిపుణులతో ప్రమాదాన్ని సునాయాసంగా నివారించవచ్చు. ఇదే ప్రస్తుతం కొనసాగుతోంది.


రసాయనం గుర్తించి..: టీఎస్‌ఎం శేఖర్‌,  పరిశ్రమ ప్రతినిధి, ఖాజీపల్లి

ప్రమాదం అంటే ముందుగా అక్కడ ఎలాంటి రసాయనాలు మండుతున్నాయో అధ్యయనం చేయాలి. దేంతో మంటలు ఆర్పవచ్చో నిపుణులు అంచనా వేస్తారు. ఒక వైపు సమీపంలోని వాటికి విస్తరించకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. పారిశ్రామిక వాడల్లో ప్రస్తుతం మంచి వాతావరణ కనిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని