logo

క్రికెట్‌ హోరు.. బెట్టింగ్‌ జోరు!

పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి తండాకు చెందిన మురళి(19) బీఎస్సీ అగ్రికల్చర్‌ చదివే విద్యార్థి చెడు వ్యసనాలకు  బానిసయ్యాడు. క్రమంగా ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ వైపు ఆకర్షితుడై తల్లిదండ్రుల నుంచి వివిధ అవసరాలకు తీసుకున్న డబ్బును అందులో పెట్టాడు.

Updated : 24 May 2024 06:37 IST

  • పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి తండాకు చెందిన మురళి(19) బీఎస్సీ అగ్రికల్చర్‌ చదివే విద్యార్థి చెడు వ్యసనాలకు  బానిసయ్యాడు. క్రమంగా ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ వైపు ఆకర్షితుడై తల్లిదండ్రుల నుంచి వివిధ అవసరాలకు తీసుకున్న డబ్బును అందులో పెట్టాడు. అలా డబ్బును మొత్తం పోగొట్టుకొని మనస్తాపంతో గతేడాది ఆత్మహత్య చేసుకున్నాడు.
  • మండల కేంద్రాల్లో కొంతమంది రైతులు కూడా ఈ ఊబిలో కూరుకుపోయి పొలాలను అమ్ముకుంటున్నారు. బయటకు చెప్పుకోలేక తమలోనే మధనపడుతున్నారు. జిల్లాలో ఈ వ్యవహారం గుట్టు చప్పుడుగా సాగిపోతోంది. చరవాణుల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో సరైన ఉపాధి లేకపోవడంతో యువకులు చెడు వ్యసనాల వైపు మళ్లుతున్నారు. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లతో పాటు సులువుగా డబ్బులు సంపాదించే మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. అవి వారి పాలిట ముళ్ల బాటలుగా మారుతున్నాయి. తేలికగా డబ్బు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. అందులో బెట్టింగ్‌ మొదటి వరుసలో ఉంది. ప్రస్తుతం క్రికెట్‌ ఐపీఎల్‌ సీజన్‌ నడుస్తుండడంతో నిత్యం జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైనా. నేడు గ్రామాలకు విస్తరించడంతో పల్లె యువకులు ఈ వ్యసనానికి బానిసలై అవస్థలు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు అధికమై చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారు. 

న్యూస్‌టుడే, పాపన్నపేట

అప్పులు తెచ్చి..: గత నెలన్నర రోజులుగా క్రికెట్‌ ఐపీఎల్‌ నడుస్తుండడంతో ప్రతి రోజు రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. మెదక్, చేగుంట, తూప్రాన్, నర్సాపూర్, పట్టణాలు, మండల కేంద్రం పాపన్నపేటతో పాటు ఆయా గ్రామాల్లో ప్రతిరోజు జోరుగా నడుస్తోంది. చాయ్‌ హోటళ్లు, దుకాణాలే కేంద్రంగా ఈ వ్యవహారం కొనసాగుతోంది. గుట్టు చప్పుడు కాకుండా టాస్‌ నుంచి మ్యాచ్‌ పూర్తయ్యే వరకు క్రమంగా బెట్టింగ్‌ పెడుతున్నారు. ప్రతి బాల్, ప్రతి ఓవర్, ఇష్టమైన ప్లేయర్‌ ఇలా మ్యాచ్‌ డిమాండును బట్టి రెండు జట్లపై పందేలు కాస్తున్నారు. ఆట ముగిశాక గెలిచినవారు డబ్బులు తీసుకుంటున్నారు. మధ్యవర్తికి కమీషన్‌ సైతం ఇస్తున్నారు. ఇలా ప్రతిరోజు రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయి. డబ్బులు కోల్పోయిన వారు అప్పులు చేసి, కుటుంబ సభ్యుల ఆభరణాలు తాకట్టుపెట్టి డబ్బులు తెచ్చి పాల్గొంటున్నారు. ఇలా లక్షల రూపాయలు పోగొట్టుకొని ఆస్తులు అమ్ముకుంటూ దీనస్థితికి చేరుతున్నారు. దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. యువకులే కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు సైతం బెట్టింగ్‌ ఆశకు పోయి తమ డబ్బులు కోల్పోయి అప్పులపాలవుతున్నారు. అధికారులు  దీనికి అడ్డుకట్ట వేయాలని  కోరుతున్నారు.

ఆ ఊబిలో కూరుకుపోవొద్దు

యువత బెట్టింగ్‌ లాంటి వ్యసనాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు. పిల్లల కదలికలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. అధిక డబ్బులకు ఆశపడితే నిరాశే ఎదురవుతుంది. బెట్టింగ్‌కి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. 

- డా.రాజేష్, డీఎస్పీ, మెదక్‌  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు