logo

దారులు ధ్వంసం.. ఒళ్లు హూనం

పల్లెల్లో రోడ్లు గుంతలు పడడంతో ప్రజలు రాకపోకలకు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇవి మోకాలోతు ఉండడం వల్ల వాహనాలు ధ్వంసమవుతున్నాయి

Published : 14 Jun 2024 01:01 IST

ఏళ్ల తరబడి మంజూరు కాని నిధులు

న్యూస్‌టుడే, మెదక్, నర్సాపూర్, తూప్రాన్, వెల్దుర్తి, చేగుంట, శివ్వంపేట, టేక్మాల్, అల్లాదుర్గం, పాపన్నపేట, చిన్నశంకరంపేట: పల్లెల్లో రోడ్లు గుంతలు పడడంతో ప్రజలు రాకపోకలకు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇవి మోకాలోతు ఉండడం వల్ల వాహనాలు ధ్వంసమవుతున్నాయి. చోదకులు నడుం నొప్పితో బాధపడుతున్నారు. ఏళ్లుగా మరమ్మతుకు గురైనా, నిధులు లేక ప్రయాణం నరకంగా మారుతోంది. కొన్ని చోట్ల ఉన్నా, పనులు జరగడం లేదు. ప్రస్తుతం వానా కాలం ప్రారంభమయింది. మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వనున్నాయి. అధికారులు స్పందిస్తే ప్రయోజనం చేకూరనుంది.
చేగుంట మండలం పులిమామిడి నుంచి నిజాంపేట మండలం నార్లాపూర్‌ వరకు పంచాయతీరాజ్‌శాఖకు చెందిన తారురోడ్డు అస్తవ్యస్తమై..అధ్వానంగా మారింది. 
గుంతలు పడి ప్రయాణానికి ఆటంకం ఏర్పడుతోంది. వర్షాకాలంలో గుంతల్లో నీళ్లు చేరి, లోతు తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. 44వ జాతీయ రహదారి రెడ్డిపల్లి కాలనీ నుంచి భీంరావుపల్లి, చిట్టోజిపల్లి వరకు ఉన్న రోడ్డు, కర్నాల్‌పల్లి నుంచి చిన్నశివనూర్, పెద్దశివనూర్‌ వరకు రోడ్డు తారు తొలగి కాలువగా మారాయి. చిన్నశంకరంపేట మండలం కేంద్రం నుంచి చందంపేట వరకు ఉన్న తారు రహదారి నాలుగేళ్ల కిందట ధ్వంసమైంది. చందంపేట నుంచి సూరారం వరకు తారు రోడ్డు పనులు జరగడం లేదు.

ప్రమాదాలకు ఆస్కారం

తూప్రాన్‌-గుండ్రెడ్డిపల్లి రహదారి నాలుగు కిలోమీటర్లు అడుగడుగునా గుంతలు పడి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయిదేళ్ల వ్యవధిలో మార్గంలో ఆరుగురు మృత్యువాత పడగా, 30 మంది గాయపడ్డారు. తూప్రాన్‌ నుంచి గుండ్రెడిపల్లి మల్కాపూర్, కోనాయిపల్లి(పీబీ)తో పాటు సిద్దిపేట జిల్లాలోని పలు గ్రామాలకు ఈ దారిలో రాకపోకలు సాగిస్తారు. మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌ నుంచి పారిశ్రామికవాడ వరకు, ముప్పిరెడ్డిపల్లి నుంచి కొండాపూర్‌ టీఎస్‌ఐఐసీలోని పరిశ్రమలకు వెళ్లే రహదారులు ధ్వంసమయ్యాయి. 

నడిచే పరిస్థితి లేక.. 

టేక్మాల్‌ మండలం కేంద్రం నుంచి ఎల్లుపేట వరకు ఉన్న రోడ్డు గుంతలమయమైంది. ప్రస్తుతం కంకర తేలడంతో రోడ్డుపై నడిచే పరిస్థితి లేదు. వాహనచోదకులు పాపన్నపేట మండలం నార్సింగి నుంచి వెళ్తున్నారు.  తొమ్మిది గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిర్మాణానికి నిధులు వచ్చినా పనులు ప్రారంభం కాలేదు. అల్లాదుర్గం మండలంలోని వెంకట్‌రావుపేట్, రెడ్డిపల్లి, చేవెళ్ల, అప్పాజిపల్లి, జాతీయ రహదారి నుంచి సీతానగర్‌ గ్రామాలకు వెళ్లే పంచాయతీరాజ్‌ రహదారులు అధ్వానంగా ఉన్నాయి. పాపన్నపేట మండలం నార్సింగి నుంచి పెద్దశంకరంపేట వెళ్లే ఇరవై కిలోమీటర్ల ర.భ రహదారి చాలా చోట్ల ధ్వంసమైంది.

మరమ్మతులకు నోచక

​​​​​​​

అధ్వానంగా కొండాపూర్‌-నత్నాయిపల్లి రోడ్డు  

నర్సాపూర్‌ మండలం కొండాపూర్‌- కాగజ్‌మద్దూర్‌ మీదుగా నత్నాయిపల్లి, శేర్కాన్‌పల్లి వరకూ  ఉన్న తారు రోడ్డు అధ్వానంగా మారింది. అయిదేళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా, మరమ్మతులకు నోచడంలేదు. రూ.2.67కోట్లు మంజూరైనా పనులు మాత్రం ప్రారంభం కావడం లేదు. నర్సాపూర్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారి (765-డి) నుంచి నర్సాపూర్‌ మండలం కొండాపూర్‌ కాగజ్‌మద్దూర్, నత్నాయిపల్లి, హత్నూర మండలం శేర్కాన్‌పల్లి వరకూ నాలుగు కిలోమీటర్ల తారు రోడ్డు దుస్థితి ఆలాగే ఉంది. శివ్వంపేట మండలం ఉసిరికపల్లి నుంచి శివ్వంపేట వరకు తారు రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. రూప్లా తండా రాజిపేట, శివ్వంపేట పెద్ద చెరువు కట్ట, శివ్వంపేట-పిల్లుట్ల రహదారి నుంచి తిమ్మాపూర్, కొత్త నుంచి రూపుల తండాతో మండలంలో పలు గ్రామాల్లో రోడ్డు దెబ్బతిన్నాయి.

కయ్యలుపడి.. కాలువగా మారి

వెల్దుర్తి నుంచి ఉప్పులింగాపూర్, శెట్‌పల్లికలాన్‌ గ్రామాల మీదుగా మెదక్‌ పట్టణం వరకు ఉన్న 19 కిలోమీటర్ల ర.భ.రహదారి ధ్వంసమైంది. గుంతలు, కయ్యలు, కంకర తేలింది. వర్షం పడినప్పుడల్లా వరద వల్ల కయ్యలు ఏర్పడి కాలువలుగా మారాయి. రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా ఫలితం శూన్యం.  మండలంలోని మెల్లూరు నుంచి బొమ్మారం వద్ద 44వ జాతీయ రహదారి వరకు ఉన్న రోడ్డు శిథిలమైంది. చర్లపల్లి, వెల్దుర్తి నుంచి యశ్వంతరావుపేట వరకు ఉన్న దారులు ధ్వంసమయ్యాయి.


పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం: నర్సింహులు, ఈఈ, పంచాయతీరాజ్‌శాఖ

గత ఆర్థిక సంవత్సరంలో 27 పనులకు గాను రూ.30.81 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో 13 పనులు పూర్తికాగా, మిగిలినవి కొన్ని పురోగతిలో ఉన్నాయి. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. వివిధ కారణాల వల్ల కొన్ని పనులు ప్రారంభం కాలేదు. వాటిని చేపట్టేలా దృష్టి సారిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని