logo

ఇంకుడు గుంత.. తీర్చేను నీటి చింత

వాన నీటిని సంరంక్షించి, భూగర్భ జలాల పెంపునకు గతంలో ఇంకుడు గుంతలు నిర్మించారు. నిర్వహణ కొరవడి అవి వృథాగా మారాయి

Published : 14 Jun 2024 01:06 IST

నర్సాపూర్‌ పురపాలికలో ఇలా  

న్యూస్‌టుడే, నర్సాపూర్‌: వాన నీటిని సంరంక్షించి, భూగర్భ జలాల పెంపునకు గతంలో ఇంకుడు గుంతలు నిర్మించారు. నిర్వహణ కొరవడి అవి వృథాగా మారాయి. వాటిల్లో చెత్త చేరినా, శుభ్రం చేసేవారు కరవయ్యారు. నర్సాపూర్‌ పట్టణంలో 25 వరకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల ఆవరణల్లో, తదితర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసినా, ప్రస్తుతం కూరుకుపోయి నిరుపయోగంగా మారాయి. కొన్నింటిని చెత్తవేసేందుకు వినియోగిస్తున్నారు. గతంలో ఒక్కో ఇంకుడు గుంత తవ్వేందుకు రూ.30-40 వేల వరకూ వ్యయం చేశారు. వీటిని సంరక్షించడంతోపాటు పునరుద్ధరించాల్సి ఉన్నా, సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదు. కొన్ని చోట్లా వాటి ఆనవాళ్లు కనిపించడం లేదు. పురపాలిక, పోలీస్‌స్టేషన్, ఎంపీడీవో, తహసీల్దార్, మండల వనరుల కేంద్రం, ఆబ్కారీ కార్యాలయాల ఆవరణల్లో వీటిని తవ్వారు. వీటిని వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు.  కొత్త నిర్మాణాల వద్ద ఒక్కటీ లేదు: కొత్తగా ఇళ్లను నిర్మిస్తున్న చోట ఇంకుడు గుంతలు నిర్మించడం లేదు. పురపాలికలో ఇంటి నిర్మాణానికి అనుమతి మంజూరు చేసే సమయంలో దరఖాస్తు దారులు కొంత రుసుం చెల్లిస్తారు. అందులో ఇంకుడు గుంత నిర్మాణానికి రూ.5000 నుంచి రూ.10వేల వరకూ వసూలు చేస్తారు. వాటిని నిర్మించే విషయాన్ని ఇటు నిర్మాణ దారులు అటు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు పట్టించుకోవడంలేదు. తాము చెల్లించిన డిపాజిట్‌ను వదులుకుంటున్నారు తప్పితే నిర్మించడంలేదు.  

 నిర్మించుకుంటే ప్రయోజనం...

ఇంటి పైకప్పుపై నుంచి పడే ప్రతి వాన చినుకునూ భూమిలోకి ఇంకేలా ఏర్పాటు చేసుకోవాలని పురపాలిక అధికారులు సూచిస్తున్నారు. 40 చదరపు అడుగుల పైకప్పునకు 1.30 మీటర్ల పొడవు ఒక మీటరు వెడల్పు, ఒక మీటరు లోతు ఉండే గుంతను తవ్వుకోవాలని సూచిస్తున్నారు. పైకప్పు విస్తీర్ణాన్ని బట్టి గుంత పరిమాణం మార్చుకోవాలని, గుంతలో మూడు వరుసల కంకర, దానిపై ఇసుకతో నింపాలని సూచిస్తున్నారు. వర్షాలకు ముందే ఈ ఏర్పాట్లు చేసుకుంటే ప్రయోజనం ఉంటుందన్నారు. నూతన ఇళ్ల నిర్మాణం చేపట్టేవారు తప్పక ఇంకుడు గుంత తవ్వేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ జైత్‌రాంనాయక్‌ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని