logo

రక్తదాత.. స్ఫూర్తి ‘ప్రదాత’

రక్తదానం.. ప్రాణదానంతో సమానం. తక్షణం స్పందించే తత్వం.. నిండు ప్రాణాన్ని నిలబెడుతుంది. ఆ కుటుంబానికి జీవనజ్యోతిగా మారుతుంది.

Published : 14 Jun 2024 01:29 IST

రక్తదానం.. ప్రాణదానంతో సమానం. తక్షణం స్పందించే తత్వం.. నిండు ప్రాణాన్ని నిలబెడుతుంది. ఆ కుటుంబానికి జీవనజ్యోతిగా మారుతుంది. ఎంతోమంది ఈ స్ఫూర్తిని చాటుతున్నారు. మరికొందరు.. ఇతరులకు ప్రేరణ కల్పిస్తున్నారు. బాధితులు, దాతలను సమన్వయం చేస్తూ భరోసా కల్పిస్తున్నారు. మానవత్వాన్ని చాటడంలో ఉమ్మడి మెదక్, వికారాబాద్‌ జిల్లాలవాసులు ముందంజలో నిలుస్తున్నారు. స్ఫూర్తి ప్రదాతలుగా చైతన్యాన్ని చాటుతున్నారు. ఎలాంటి అనుబంధం లేకున్నా.. ఇతోధిక సహకారం అందిస్తున్నారు. నేడు ప్రపంచ రక్తదోత్సవం సందర్భంగా స్ఫూర్తిగా నిలుస్తున్న వారిపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

పోలీసుల్లో పరిమళించిన మానవత్వం.. 

కరోనా విపత్కర పరిస్థితుల్లో చలించిన సిద్దిపేట జిల్లా పోలీసులు రక్తదానం చేయడం ప్రారంభించారు. నాటి నుంచి ఒకరి తర్వాత మరొకరు వరుస కట్టి ఎన్నో కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. హోంగార్డు మొదలు ఉన్నతాధికారి వరకు దాతల జాబితాలో ఉన్నారు. ఇదో ఉద్యమంలా సాగుతోంది. మహమ్మారి విజృంభించిన పరిస్థితుల్లో ప్లాస్మాదానం సైతం చేశారు. ఇప్పటివరకు దాదాపు 2500 యూనిట్లు రక్తదానం చేశారు. కమిషనరేట్‌ ఆధ్వర్యంలో మూడుమార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం అనగానే పోలీసులు స్పందిస్తుండటం విశేషం. ఐదేళ్లుగా ఈ క్రతువు కొనసాగుతోంది.

సామాజిక మాధ్యమాల ద్వారా..

సంగారెడ్డికి చెందిన అనిల్‌.. స్థానిక న్యాయస్థానంలో టైపిస్టుగా విధులు నిర్వరిస్తున్నారు. 2003 నుంచి ఎవరికి అత్యవసరమైనా నేనున్నానంటూ ముందుకొస్తున్నారు. అనిల్‌ బ్లడ్‌ గ్రూప్‌ ఓ పాజిటివ్‌ కాగా.. ఇప్పటివరకు 121 సార్లు రక్తదానం చేశారు. ఎవరికైనా రక్తం అత్యవసరమని తెలియగానే వెంటనే అక్కడ వాలిపోతారు. సామాజిక మాధ్యమాల ద్వారా విషయాన్ని తెలుసుకుంటారు. వేరే బ్లడ్‌ గ్రూప్‌ అవసరమైనా వాట్సాప్‌లో తన మిత్రులకు విషయాన్ని చేరవేసి సాయం అందేలా చేస్తున్నారు. 

సంప్రదించాల్సిన నం: 96665-55993
- న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌


44 ఏళ్లుగా అవిశ్రాంతంగా..

పైసా ఖర్చులేకుండా చేయగలిగేది రక్తదానం మాత్రమే అంటారు విశ్రాంత ఎంఈవో దండు అంజయ్య. అత్యవసర వేళలో ఒక్క బొట్టు కూడా ఊపిరిపోస్తుంది. ఈ ఆలోచనే ఈయన్ను ఆదర్శంగా నిలిపింది. జహీరాబాద్‌ పరిధి చిన్నహైదరాబాద్‌కు చెందిన అజయ్య 44 ఏళ్లుగా నిర్విరామంగా రక్తదానం చేస్తు ప్రాణదాతగా ప్రశంసలు అందుకుంటున్నారు. డిగ్రీలో దీన్ని మొదలుపెట్టగా, ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. మరోవైపు ఉపాధ్యాయుడు, ఎంఈవోగా పని చేసిన సమయంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఏ కార్యక్రమం నిర్వహించినా దీని గురించి చెప్పక తప్పరు. గతంలో రాష్ట్రస్థాయిలో రక్తదాత పురస్కారాన్ని అందుకున్నారు. 


మిత్రుడి సాయం పొంది..

సిద్దిపేట వాసి దాసరి చంద్రశేఖర్‌ ఇప్పటివరకు 60 సార్లకు పైగా (ఓ పాజిటివ్‌) రక్తదానం చేశారు. కుకునూరుపల్లి ఠాణా కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 2010లో ఇతడి తండ్రి నర్సింగరావుకు శస్త్రచికిత్సకు రక్తం అత్యవసరమవగా.. మిత్రుడి సాయం పొందారు. అప్పుడే దీని ప్రాధాన్యాన్ని గుర్తించిన చంద్రశేఖర్‌ ఇతరులకు సహకారం అందించాలని సంకల్పించుకున్నారు. ఇతడి సతీమణి రేఖప్రియదర్శిని సిద్దిపేట సర్వజన ఆసుపత్రిలో నర్సింగ్‌ అధికారిణిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె 13 సార్లు రక్తదానం చేశారు. చంద్రశేఖర్‌ రక్తనాలుగు వాట్సాప్‌ గ్రూపులు నిర్వహిస్తున్నారు.

సంప్రదించాల్సిన నం: 95020-08979


విద్యార్థుల్లో చైతన్యం తెస్తూ..

ఈ ఉపాధ్యాయుడి పేరు వరాల ప్రశాంత్‌ కుమార్‌. సికింద్రాబాద్‌ అల్వాల్‌కు చెందిన ఈయన వర్గల్‌ మండలం శాఖారం ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయనది బి-పాజిటివ్‌ కాగా, ఎక్కడైనా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు, ఎవరికైనా అత్యవసరమని తెలిసినా వెంటనే పనులన్నీ పక్కన పెట్టి అక్కడికి వెళ్లిపోవడం ఇతడి అలవాటు. ఇప్పటివరకు 70 సార్లు దానం చేశారు. మరోవైపు సొంతంగా శిబిరాలూ నిర్వహిస్తూ మన్ననలు అందుకుంటున్నారు. ఓ సారి కరీంనగర్‌ నుంచి ఫోన్‌ రాగానే వెంటనే అక్కడికి వెళ్లి ఒకరి ప్రాణాన్ని నిలబెట్టారు. విద్యార్థుల్లో చైతన్యం తీసుకొస్తున్నారు.

- న్యూస్‌టుడే, వర్గల్‌ 
సంప్రదించాల్సిన నం: 93976-75737    


వాట్సాప్‌ సమూహంతో..

సిద్దిపేట పట్టణం ఇందిరానగర్‌కు చెందిన జి.వి.హరికృష్ణ విద్యుత్తు శాఖలో ఆర్టిజన్‌ ఉద్యోగిగా పని చేస్తున్నారు. 2011లో రక్తదానమివ్వడం షురూ చేయగా.. ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. 2109లో తెలంగాణ బ్లడ్‌ గ్రూపు పేరిట వాట్సాప్‌ సమూహాన్ని ఏర్పాటుచేశారు. పలు ప్రాంతాలకు చెందిన రక్తదాతలను ఇందులో చేర్చారు. అత్యవసర పరిస్థితుతుల్లో ఉన్న వారికి రక్తదానం చేస్తూనే, చేయిస్తున్నారు. ఈ సమూహంలో ఇప్పటి వరకు 250 మంది రక్తదానం చేయడం విశేషం.
- న్యూస్‌టుడే, సిద్దిపేట అర్బన్‌
సంప్రదించాల్సిన నం: 91771-46104    


సొంత ఖర్చుతోనే..

నారాయణఖేడ్‌ మండలం ర్యాకల్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్‌గా పని చేస్తున్న వోతె చంద్రశేఖర్‌ ఖేడ్‌ రక్తదాతల సమూహ సభ్యుడు. ఈయనది బి పాజిటివ్‌ గ్రూప్‌ కాగా, 20 ఏళ్లుగా రక్తదానం చేస్తున్నారు. ఎక్కడికైనా సొంత ఖర్చుతోనే వెళ్లి అండగా నిలుస్తున్నారు. గత ఏప్రిల్‌ 27న సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగికి అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సి రాగా, వెంటనే అక్కడికి చేరుకొని రక్తం ఇచ్చి ప్రాణాన్ని కాపాడారు. ఇప్పటివరకు 52 సార్లు రక్తం ఇచ్చారు. మోహన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అవయవదానానికీ అంగీకారపత్రాన్ని ఇచ్చారు.

- న్యూస్‌టుడే, నారాయణఖేడ్‌
సొసంప్రదించాల్సిన నం: 94408-80030


నిజాంపేటకు చెందిన జి.పి.స్వామి.. అత్యవసర సమయంలో రక్తదానం చేస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. డిగ్రీ విద్యార్థిగా ఎన్‌సీసీలో చేరినప్పుడు దీని ఆవశ్యకత తెలిసింది. ఇక అప్పటి నుంచి ఈ దిశగా అడుగేసి నేటికీ కొనసాగిస్తున్నారు. మరోవైపు శిబిరాలు నిర్వహిస్తూ రక్తాన్ని సేకరించి బ్లడ్‌బ్యాంకులకు అందజేస్తున్నారు. యువజన సంఘాల సహకారంతో వీటిని నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు.
- న్యూస్‌టుడే, రామాయంపేట 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని