logo

వేదం.. అణువణువునా జీవనం

వేదాధ్యయనంతో భవితను చక్కదిద్దుకోవచ్చు. శాస్త్ర సాంకేతిక రంగానికి పూర్తి భిన్నమైన వేదాభ్యసన కోర్సులకు ప్రసిద్ధ కొమురవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రంలోని వీరశైవ ఆగమ పాఠశాల వేదికగా నిలిచింది.

Updated : 14 Jun 2024 06:00 IST

ఆగమ పాఠశాలలో ప్రవేశానికి ఆహ్వానం
ఈ నెల 14 వరకు గడువు

వేదం పఠిస్తున్న విద్యార్థులు  

న్యూస్‌టుడే, చేర్యాల: వేదాధ్యయనంతో భవితను చక్కదిద్దుకోవచ్చు. శాస్త్ర సాంకేతిక రంగానికి పూర్తి భిన్నమైన వేదాభ్యసన కోర్సులకు ప్రసిద్ధ కొమురవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రంలోని వీరశైవ ఆగమ పాఠశాల వేదికగా నిలిచింది. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో మల్లికార్జునస్వామి సన్నిధిలో 15 ఏళ్లుగా ఈ పాఠశాల కొనసాగుతోంది. ఏటా 25 మందికి శిక్షణ ఇస్తున్నారు. వేదవిద్య నేర్చుకున్న విద్యార్థులు అర్చకత్వం ద్వారా ఉపాధి పొందుతున్నారు. తండ్రి గుడిలో అర్చకుడై.. తనయుడు కోర్సు అభ్యసిస్తే.. ఆలయాల్లో వంశపారంపర్యంగా అవకాశాలుంటాయి. ఆరేళ్ల కోర్సు పూర్తి చేసిన ఒక్కో విద్యార్థి ఉపాధికి దేవాదాయశాఖ రూ.లక్ష అందజేస్తుందని కొమురవెల్లి ఆలయ ప్రధానార్చకుడు మహదేవుని మల్లికార్జున్‌ తెలిపారు. ఇప్పటివరకు ఇక్కడ 300 మంది వేదాధ్యయనం పూర్తి చేశారు.

అర్హతలు: 5వ తరగతి పూర్తిచేసి 12 నుంచి 14 ఏళ్లలోపు వారిని పాఠశాలలో చేర్చుకుంటారు. దేవాదాయశాఖ సీజీఎఫ్‌ నుంచి 50 శాతం, కొమురవెల్లి దేవస్థానం నుంచి 50 శాతం నిధులు సమకూరుతాయి. ప్రస్తుతం సిద్దిపేటతో పాటు సంగారెడ్డి, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, నల్గొండ, యాదాద్రి-భువనగిరి, కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు చెందిన వారు అభ్యసిస్తున్నారు. పాఠశాలలో ఈ సారి ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుఫారాలను ఈనెల 14లోపు దేవస్థానం కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.

ఉపాధి అవకాశాలు..: 

కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగంతో పాటు ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. ఆసక్తి, అర్హులైన విద్యార్థులు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలి. కార్యాలయంలో దరఖాస్తులు పొందవచ్చు. మరిన్ని వివరాలకు 94910-00652 నంబరులో సంప్రదించవచ్చు.

ఆలూరు బాలాజీ, ఈవో, కొమురవెల్లి మల్లన్న ఆలయం

ఏం నేర్పిస్తారంటే..: వీరశైవాగమం కింద ఇక్కడ మూడు కోర్సులను నేర్పిస్తారు. ఒక్కో కోర్సుకు రెండేళ్ల కాలవ్యవధి ఉంటుంది. ఆరేళ్లు పూర్తయ్యాక ధ్రువీకరణపత్రం అందజేస్తారు.
ప్రవేశ: శైవాగమం కోర్సుల్లో తొలిది. లఘు, మహన్యాస పూర్వక అభిషేకాల వరకు అర్హత లభిస్తుంది.
వర: ప్రవేశతో పాటు దీన్ని పూర్తి చేస్తే కల్యాణోత్సవాల నిర్వహణకు అర్హులవుతారు.
ప్రవర: ఇది కూడా పూర్తి చేస్తే అభిషేకాలు, కల్యాణోత్సవాలతో పాటు విగ్రహ ప్రతిష్ఠలు, ఆలయ ప్రతిష్ఠలు చేయవచ్చు.
వసతి, భోజనం ఉచితం: పాఠశాలలో వేద శిక్షణ పొందేవారికి ఉచిత వసతి కల్పిస్తున్నారు. నిత్యం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం అల్పాహారం, రాత్రి భోజనం ఉచితంగానే అందిస్తున్నాయి.


తొమ్మిదేళ్లుగా బోధిస్తున్నా: 
ఆగమ పాఠశాలలో తొమ్మిదేళ్లుగా అచార్యుడిగా పని చేస్తున్నా. ప్రతి విద్యార్థికి అర్థమయ్యే రీతిలో క్షుణ్నంగా వేద విద్య బోధిస్తున్నా. ప్రభుత్వం కొమురవెల్లి ఆలయ అధికారులు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు.
హిరేమఠ్‌ లింగ వీరేశ్, అధ్యాపకుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని