logo

పిడుగుపాటుకు మహిళ మృత్యువాత

పిడుగుపాటుతో మహిళ మృతి చెందగా, మరో మహిళ గాయాలపాలైన సంఘటన తాండూరు మండలం కరణ్‌కోటలో జరిగింది.

Updated : 14 Jun 2024 05:55 IST

మధులత

తాండూరు గ్రామీణ, న్యూస్‌టుడే: పిడుగుపాటుతో మహిళ మృతి చెందగా, మరో మహిళ గాయాలపాలైన సంఘటన తాండూరు మండలం కరణ్‌కోటలో జరిగింది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, గ్రామస్థుల కథనం ప్రకారం..కరణ్‌కోటకు చెందిన హరిజన్‌ మహేష్‌కు దుద్యాలకు చెందిన మధులత (22)తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. భర్త డ్రైవర్‌గా, భార్య వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం గ్రామానికి చెందిన మహిళలతో కలిసి కౌలు రైతు నర్సయ్యగౌడ్‌ పొలంలో పత్తి విత్తనాలు విత్తేందుకు వెళ్లింది. పనుల్లో ఉండగా సాయంత్రం ఒక్కసారిగా గాలి వాన మొదలైంది. జోరు వానతో పక్కకు వెళ్తుండగా పిడుగు పడటంతో మధులతతోపాటు నిర్ణందస్తమ్మ అక్కడే కుప్పకూలారు. మిగిలిన మహిళా కూలీలు అరుపులు, కేకలు వేస్తూ దూరంగా పరుగులు తీశారు. వీరిని గమనించిన పక్క పొలంలోని రైతులు వచ్చి కిందపడిన ఇద్దరు మహిళల్ని ఆటోలో తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మధులత మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో మహిళ కాళ్లకు గాయాలవడంతో చికిత్సలు అందించారు. మృతురాలి భర్త, కుటుంబ సభ్యులు మృతదేహం వద్ద బోరున విలపించారు. బాధిత కుటుంబాన్ని మాజీ ఎంపీపీ శరణుబసప్ప పరామర్శించారు. ప్రభుత్వం నుంచి సాయం అందించేందుకు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామన్నారు. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విఠల్‌రెడ్డి వెల్లడించారు. 


అద్దె కారులో తిరుగుతూ డీజిల్‌ చోరీ
ముఠా సభ్యుల్లో ముగ్గురి అరెస్టు
న్యూస్‌టుడే, గజ్వేల్‌ గ్రామీణ: జల్సాలు చేసేందుకు డబ్బుల కోసం కొందరు ముఠాగా ఏర్పడి డీజిల్‌ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ముఠాలో ముగ్గురిని గురువారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. గజ్వేల్‌ సీఐ సైదా తెలిపిన వివరాలు.. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం గట్లఖానాపూర్‌ గోర్మిల తండాకు చెందిన కేతావత్‌ శ్రీను మరో ఆరుగురితో కలిసి ముఠాగా ఏర్పడి చోరీలు చేస్తున్నారు. ఈ నెల 11న గజ్వేల్‌ కోమటిబండ వద్ద బస్సు షెల్టర్‌ సమీపంలో వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తుండగా ఓ కారులోని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. తనిఖీ చేయగా రెండు డీజిల్‌ డబ్బాలు దొరికాయి. నిందితులు పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. కేతావత్‌ శ్రీనును విచారించారు. హైదరాబాదు కూకట్‌పల్లిలో కారు అద్దెకు తీసుకొని రెండు నెలలుగా పెట్రోలు బంకుల సమీపంలో నిలిపి ఉంచిన లారీల ట్యాంకుల నుంచి డీజిల్‌ ఎత్తుకెళ్తున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన మహమ్మద్‌ షరీఫ్, జహీర్‌లకు విక్రయిస్తున్నారు. ఈ ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీఐ సైదా, అదనపు సీఐ ముత్యంరాజు, ఎస్‌ఐ శంకర్, సిబ్బందిని ఏసీపీ పురుషోత్తంరెడ్డి అభినందించారు.


ఆస్తి కోసం తల్లిని చంపిన కుమారుడి అరెస్టు

చిన్నకోడూర్, న్యూస్‌టుడే: ఆస్తి కోసం కన్నతల్లిని కొట్టి చంపిన ఘటనలో నిందితుడైన కుమారుడిని అరెసు టచేసి, రిమాండ్‌కు తరలించినట్లు సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు. సిద్దిపేట ఏసీపీ కార్యాలయంలో గురువారం రాత్రి ఆయన వివరాలు వెల్లడించారు. చిన్నకోడూరు మండలం గంగాపూర్‌ గ్రామానికి చెదిన వృద్ధురాలు అంతగిరి సత్తవ్వ పేరిట ఉన్న 5 ఎకరాల వ్యవసాయ భూమిని తన పేరిట మార్చమంటూ కుమారుడు చంద్రశేఖర్‌ కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నాడు. ఈ నెల 11న రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన చంద్రశేఖర్‌.. భూమి రాసివ్వమని తల్లితో గొడవపడ్డాడు. ఆమెను ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని చంద్లాపూర్‌ శివారులోని రంగనాయకసాగర్‌ జలాశయం సమీపానికి తీసుకెళ్లాడు. మరోసారి గొడవపడి, కోపోద్రిక్తుడై సత్తవ్వ తలను పట్టుకొని వాహనానికేసి బలంగా కొట్టాడు. ఆమె తీవ్రగాయాల పాలైంది. కొనఊపిరితో ఉన్న తల్లిని గంగాపూర్‌లోని ఇంటికి తీసుకొచ్చాడు. అర్ధరాత్రి శౌచలయంలో కాలు జారి కిందపడి, గాయాలపాలైందని, ఆసుపత్రికి తీసుకువెళ్లాలని ఇరుగు పొరుగు వారిని నమ్మించేందుకు యత్నించాడు. వేరే ఇంట్లో ఉంటున్న తండ్రి మల్లయ్య వచ్చి చూసి 108 వాహనంలో సిద్దిపేట ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వృద్దురాలిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా భర్తకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా తల్లిని కొట్టి చంపినట్లు చంద్రశేఖర్‌ అంగీకరించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని