logo

ఎట్టకేలకు పనుల్లో కదలిక

జహీరాబాద్, నారాయణఖేడ్‌ నియోజకవర్గాల్లోని చాలా గ్రామాలు కర్ణాటక రాష్ట్ర సరిహద్దున ఉంటాయి. వీరు వివిధ అవసరాలకు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌ పట్టణానికి రాకపోకలు సాగిస్తుంటారు

Updated : 14 Jun 2024 05:52 IST

నాలుగు వరుసలుగా బీదర్‌-నిజాంపేట రహదారి విస్తరణ 

న్యాల్‌కల్‌ శివారులోని రోడ్డు విస్తరణ పనులు

న్యూస్‌టుడే, జహీరాబాద్, నారాయణఖేడ్‌: జహీరాబాద్, నారాయణఖేడ్‌ నియోజకవర్గాల్లోని చాలా గ్రామాలు కర్ణాటక రాష్ట్ర సరిహద్దున ఉంటాయి. వీరు వివిధ అవసరాలకు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌ పట్టణానికి రాకపోకలు సాగిస్తుంటారు. ఈ దారి అధ్వానంగా మారింది. ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోలేదు. ఇరుకుగా ఉండటంతో పాటు ప్రమాదకర మలుపులు ఉన్నాయి. దశాబ్దాలుగా ప్రజల రాకపోకలకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రజల రవాణా కష్టాలు తీర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిజాంపేట నుంచి నారాయణఖేడ్, న్యాల్‌కల్‌ మీదుగా బీదర్‌ వరకు ప్రస్తుతమున్న రహదారిని విస్తరించాలని నిర్ణయించింది. ఏడాది క్రితం రూ.513 కోట్లను కేంద్రం కేటాయించింది. పరిపాలనా అనుమతులు, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు ఇటీవల పనులను ప్రారంభించారు. ఈ పనులు సకాలంలో పూర్తయితే తెలంగాణ-కర్ణాటక-మహారాష్ట్రల మధ్య రవాణా సదుపాయాలు మెరుగుపడనున్నాయి.
తగ్గనున్న మలుపులు: నిజాంపేట-నారాయణఖేడ్‌ల మధ్య 15 కిలోమీటర్లు దూరంలోనే 25 మలుపులు ఉన్నాయి. వీటిలో 10 మలుపులు అత్యంత ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. ఇక్కడే అత్యధిక ప్రమాదాలు జరుగుతుంటాయి. ఖేడ్‌ పట్టణ శివారు నుంచి డప్పూరు శివారులోని కర్ణాటక సరిహద్దు వరకు రోడ్డు ఒకే వరుసగా ఉండటం, ఇరుకు కల్వర్టులు, దారి గుంతలమయంగా మారడంతో వాహనాల చోదకులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. రహదారి విస్తరణ పనులు పూర్తయితే ఈ సమస్య తీరనుంది. 

ఏడేళ్ల క్రితం ప్రతిపాదనలు

జిల్లా మీదుగా సాగే సంగారెడ్డి-నాందేడ్, అకోలా 161వ జాతీయ రహదారిని అనుసంధానిస్తూ.. నారాయణఖేడ్‌ సమీపంలోని నిజాంపేట నుంచి ఖేడ్, మనూరు, న్యాల్‌కల్‌ మీదుగా కర్ణాటకలోని బీదర్‌ పట్టణం వరకున్న ఏక వరుస మార్గాన్ని జాతీయ రహదారిగా గుర్తిస్తూ ఏడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ మార్గాన్ని విస్తరించాలని అప్పుడే ప్రతిపాదించింది. కర్ణాటక సరిహద్దు వరకు దాదాపు 45 కిలో మీటర్ల మేరకు రహదారి విస్తరణకు రూ.513 కోట్లు మంజూరు చేసింది. భూసేకరణ కోసం అదనంగా మరో రూ.28 కోట్ల నిధులిచ్చింది. ఈ పనులకు 2013, మార్చి 11న ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఏడాది తర్వాత పనుల్లో కదలిక వచ్చింది. ఈ మార్గంలోనే నారాయణఖేడ్, మనూరు, ఇబ్రహీంపూర్‌ వద్ద మళ్లింపు దారులనూ నిర్మించాలని నిర్దేశించారు. మంగల్‌పేటలోని విద్యుత్తు ఉప కేంద్రం సమీపం నుంచి ఖేడ్‌ పట్టణం పక్కనున్న బాణాపూర్‌ సమీపం వరకు పై వంతెన నిర్మించాల్సి ఉంది.

మెరుగవనున్న రవాణా సదుపాయాలు

జాతీయ రహదారి విస్తరణతో తెలంగాణ-కర్ణాటక-మహారాష్ట్రల మధ్య రవాణా సదుపాయాలు గణనీయంగా మెరుగు పడనున్నాయి. బీదర్‌ నుంచి కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ పట్టణాలకు జాతీయ రహదారి అనుసంధానంతోపాటు రెండు, నాలుగు వరుసల రహదారులు ఉన్నాయి. దీంతో తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి కర్ణాటక, మహారాష్ట్రలోని పలు పట్టణాలు, పుణ్య క్షేత్రాలకు రాకపోకలు పెరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని