logo

రాజీవ్‌ రహదారి.. లేవా నిబంధనలు!

వాహనదారుల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.

Published : 14 Jun 2024 02:03 IST

అనంతసాగర్‌లో పక్కన ఇష్టారీతిన నిలిపిన లారీలు 

చిన్నకోడూరు, న్యూస్‌టుడే: వాహనదారుల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నిలుపుతుండటంతో ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. ప్రత్యేక పార్కింగ్‌ స్థలం లేకపోవడం వల్ల రోడ్డుపైనే నిలుపుతున్నారు. రాత్రి సమయంలో రాజీవ్‌ రహదారిపై ప్రయాణించాలంటే ద్విచక్ర వాహనదారులు భయందోళనకు గురవుతున్నారు. చిన్నకోడూరు మండలంలోని రామునిపట్ల శివారు నుంచి మొదలు అనంతసాగర్‌ వరకు ఉన్న రాజీవ్‌ రహదారిపై లారీలను ఎక్కడికక్కడ నిలుపుతున్నారు. హోటళ్లు, దాబాలు, ఇతర దుకాణాల వద్ద రహదారికి ఆనుకొని భారీ వాహనాలను పార్కింగ్‌ చేస్తున్నారు. రోడ్డు పైనా ఇష్టానుసారంగా వాహనం ఉండటంతో మిగతా వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇలా పార్కింగ్‌ చేయడం వల్ల ప్రమాదాలు జరిగాయి ప్రాణాలు కోల్పోయారు. పలువురు క్షతగాత్రులయ్యారు. రహదారి భద్రత కమిటీ అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. గతేడాది సెప్టెంబరులో సిద్టిపేట శివారులోని ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన 11 మంది బీటెక్‌ విద్యార్థులు పరీక్ష రాయడానికి క్వాలిస్‌ వాహనంలో కరీంనగర్‌ వెళ్లి తిరిగి వస్తుండగా అనంతసాగర్‌ వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని ఢీకొట్టారు. అప్పుడు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా భారీ వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం శోచనీయం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని