logo

బడులు తెరిపించేందుకు చర్యలేవీ?

ప్రతి పంచాయతీ లేదా ఆవాసంలో ఒక పాఠశాల ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులు లేక మూతపడిన అన్ని పాఠశాలలను తెరిపిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

Updated : 14 Jun 2024 05:51 IST

కుందన్‌వానిపల్లి పరిధి చౌటకుంటతండా పాఠశాల 

న్యూస్‌టుడే: అక్కన్నపేట(హుస్నాబాద్‌ గ్రామీణం): ప్రతి పంచాయతీ లేదా ఆవాసంలో ఒక పాఠశాల ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులు లేక మూతపడిన అన్ని పాఠశాలలను తెరిపిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మూత పడిన పాఠశాలన్నింటిని తెరిచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్కన్నపేట మండలంలో అమలుకు నోచుకోలేదు. ఇందుకు మూత పడిన వాటిలో ఏ ఒక్కటీ తెరవకపోవడమే ఇందుకు నిదర్శనం. అక్కన్నపేట మండలంలో మొత్తం 64 పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 10 ప్రాథమిక పాఠశాలలు మూత పడ్డాయి. ప్రస్తుతం మండలంలో 9 జడ్పీ ఉన్నత పాఠశాలలు, 37 ప్రాథమిక పాఠశాలలు, 6 ప్రాథమికోన్నత పాఠశాలలు, ఒక కేజీబీవీతో పాటు ఒక గిరిజన బాలికల గురుకుల పాఠశాల చొప్పున నడుస్తున్నాయి.

ముంపు ప్రాంతాల విద్యార్థులు ఎటు?

కొన్ని బడులు విద్యార్థులు లేక.. మరికొన్ని గౌరవెల్లి ప్రాజెక్టులో ముంపునకు గురైన కారణంగా మూతపడ్డాయి. విద్యార్థులు లేక రామవరం గ్రామ పరిధిలోని బంగారులొద్దితండా, గండిపల్లి పరిధిలోని పంచరాయితండా, దేవానాయక్‌తండా, కుందన్‌వానిపల్లి పరిధిలోని రంగన్నకుంట, చౌటకుంటతండా, గోవర్ధనగిరి పరిధిలోని సంజీవరాయకాలనీ, పోతారం(జె) పరిధిలోని తురుకవానికుంటలోని ప్రాథమిక పాఠశాలలు గత ఏడాది మూతపడ్డాయి. గౌరవెల్లి ప్రాజెక్టులో గుడాటిపల్లి, తెనుగుపల్లి, సోమాజీతండాలు ముంపునకు గురయ్యాయి. అక్కడి ప్రాథమిక పాఠశాలలను మూసివేశారు. ముంపు బాధితుల్లో కొందరు గౌరవెల్లి కొత్త కాలనీలో ఇళ్లు నిర్మించుకున్నారు. అక్కడ కొన్ని రోజులు తెనుగుపల్లి పాఠశాలను నడిపించారు. తర్వాత దానినీ మూసివేశారు. వాటిలోని ఉపాధ్యాయులు డిప్యుటేషన్‌పై ఇతర చోట్ల పని చేస్తున్నారు.

కానరాని బడిబాట 

వాటిని తెరిపించేందుకు అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. విద్యార్థుల నమోదుకు బడిబాట కార్యక్రమం చేపట్టలేదు. పాఠశాలలు తిరిగి ప్రారంభమై పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేస్తున్నారు. కానీ ఈ పాఠశాలల్లో ఇవేవీ చేపట్టడం లేదు. ఇప్పటికైనా ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

రెండు మూడు రోజుల్లో తెరిపిస్తాం

ఉదయభాస్కర్, అక్కన్నపేట ఇన్‌ఛార్జి ఎంఈవో

మూత పడిన పాఠశాలలను తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంగన్‌వాడీ టీచర్ల ద్వారా పిల్లలను నమోదు చేయిస్తున్నాం. డిప్యుటేషన్‌పై వెళ్లిన ఉపాధ్యాయులను రప్పిస్తాం. గౌరవెల్లి ప్రాజెక్టు ముంపు బాధితులతో రామవరం సమీపంలో ఏర్పడిన పునరావాస కాలనీలో పిల్లలను నమోదు చేశాం. అద్దె భవనంలో రెండు మూడు రోజుల్లో పాఠశాలను తెరుస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని