logo

కొనసాగుతున్న ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్లకు గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు లభించాయి. స్కూల్‌ అసిస్టెంట్ల ఖాళీలు గుర్తించడంతో బదిలీల కోసం సీనియార్టీ జాబితాను విద్యాశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు.

Published : 18 Jun 2024 02:06 IST

నేడు విడుదల కానున్న సీనియారిటీ జాబితా

ధ్రువపత్రాలు పరిశీలిస్తున్న అధికారులు

న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్లకు గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు లభించాయి. స్కూల్‌ అసిస్టెంట్ల ఖాళీలు గుర్తించడంతో బదిలీల కోసం సీనియార్టీ జాబితాను విద్యాశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. బుధవారం ఈ జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీల తర్వాత ఎస్జీటీలకు పదోన్నతులు, భాషా పండితులు, పీఈటీల అప్‌గ్రేడ్‌ ప్రక్రియ కొనసాగనుంది.

బదిలీలకు దరఖాస్తులు: ఉపాధ్యాయులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బదిలీల ప్రక్రియ జిల్లాలో వేగంగా కొనసాగుతోంది. 72 మంది స్కూల్‌ అసిస్టెంట్లకు గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులుగా ఇటీవలే పదోన్నతి కల్పించారు. గతంలో ఉన్న ఖాళీలతో పాటు పదోన్నతి పొందిన ఉపాధ్యాయుల వివరాలను ఖాళీలుగా చూపిస్తారు. బదిలీ కోసం 1132 మంది స్కూల్‌ అసిస్టెంట్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరి సీనియారిటీ జాబితా విడుదల కానుంది. జాబితా విడుదల అనంతరం అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని పరిశీలించి పరిష్కరిస్తారు. ఆ తర్వాత అంతర్జాలం ద్వారా స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీ ప్రక్రియ నిర్వహిస్తారు.

పండితులు, పీఈటీల పదోన్నతులకు..

మరోవైపు అర్హులైన భాషా పండితులు, ఎస్జీటీలు స్కూల్‌ అసిస్టెంట్లుగా ఉన్నత పాఠశాలల్లో పని చేసేందుకు పదోన్నతి ప్రక్రియ కూడా జరుగుతోంది. స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియ పూర్తయిన తరువాత వీరి బదిలీ షెడ్యూలును ప్రకటిస్తారు. అర్హులైన వారు స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌కు పదోన్నతి పొందుతారు. చాలా సంవత్సరాల తర్వాత బదిలీలు, పదోన్నతులు జరుగుతుండటంతో ఉపాధ్యాయుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

పారదర్శకంగా నిర్వహిస్తున్నాం:

వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ జిల్లాలో పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయుల నుంచి వినతిపత్రాలు స్వీకరించి పరిష్కరిస్తున్నాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని