logo

ఉపాధికి భరోసా.. భవిత ధీమా

విద్యార్థి దశలోనే ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో వివిధ కోర్సులను ప్రవేశపెడుతోంది.

Published : 18 Jun 2024 02:11 IST

మెదక్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల

న్యూస్‌టుడే, మెదక్‌ టౌన్‌: విద్యార్థి దశలోనే ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో వివిధ కోర్సులను ప్రవేశపెడుతోంది. జాతీయ విద్యా విధానంలో భాగంగా మెదక్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తొలిసారిగా 2024-25 విద్యా సంవత్సరానికి బ్యాచిలర్స్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (బీబీఏ) లాజిస్టిక్స్‌ పేరిట కొత్త కోర్సును ప్రవేశపెట్టడం విశేషం. దీనికి 60 సీట్లను కేటాయించారు. మార్కెటింగ్, రవాణా, సప్లై, కొరియర్‌కు సంబంధించిన పరిజ్ఞానం పెంచేలా ఈ కోర్సును తీర్చిదిద్దారు.

డిమాండ్‌కు తగ్గట్టుగా..

ప్రస్తుతం యువతకు సరైన ఉపాధి కరవై నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. వివిధ రకాల కోర్సులు చదివినప్పటికీ డిగ్రీ అనంతరం ఉపాధి పొందలేకపోతున్నారు. కళాశాల విద్య పూర్తి చేసుకొని బయట అడుగుపెడుతున్న విద్యార్థుల్లో నైపుణ్యం లేక ఉద్యోగాల సాధనలో వెనుకబడుతున్నారు. కంపెనీలకు డిమాండ్‌కు తగ్గట్టుగా నైపుణ్యాలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీన్ని గుర్తించిన సంబంధిత అధికారులు విద్యార్థుల్లో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పరిజ్ఞానాన్ని పెంచాలన్న సదుద్దేశంతో వారి భవితకు ఉపాధిని ఇచ్చే కోర్సులను ప్రవేశపెట్టింది.

వేతనంతో కూడిన శిక్షణ..

బీబీఏ లాజిస్టిక్స్‌ కోర్సు కాల వ్యవధి మొత్తం మూడేళ్లు. తొలి నాలుగు సెమిస్టర్ల (రెండేళ్లు)లో తరగతుల్లో పాఠాల బోధన ఉంటుంది. చివరి ఏడాది కంపెనీల్లో అప్రెంటీస్‌ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో ప్రతి విద్యార్థికి నెలకు రూ.12 వేల వరకు భృతి అందజేస్తారు. అనంతరం ఆయా అంశాల్లో ప్రతిభ ఆధారంగా కంపెనీలు శాశ్వత ఉద్యోగులుగా తీసుకునే అవకాశం ఉంటుంది.

ఆన్‌లైన్‌ వ్యాపారంలో..

ప్రస్తుతం నడుస్తున్నది అంతా సాంకేతిక యుగం కావడంతో ఆన్‌లైన్‌ వ్యాపారం జోరందుకుంది. ఇందులో ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తున్నాయి. మారుమూల గ్రామాల్లో సైతం ఆన్‌లైన్‌లో తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొనుగోలుదారులకు-అమ్మకందారులకు మధ్య వారధిలా పలు కొరియర్‌ సంస్థలు పని చేస్తున్నాయి. సదరు వ్యవస్థలో ఉన్నత స్థాయి కొలువులు చేసేందుకు బీబీఏ కోర్సు ఎంతో ఉపయోగపడుతుంది.

ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలలో..

- శరత్‌రెడ్డి, కామర్స్‌ విభాగాధిపతి

ప్రస్తుతం కళాశాలలో ప్రవేశపెట్టిన బీబీఏ కోర్సుతో మంచి భవిత ఉంటుంది. డిగ్రీ చివరి సంవత్సరంలో ఉన్న సమయంలో విద్యార్థులకు కళాశాల ఒప్పందం కుదుర్చుకున్న పరిశ్రమలు, సంస్థల్లో శిక్షణ పొందవచ్చు. ఆ సమయంలో విద్యార్థులకు ప్రతి నెలా భృతితో పాటు అనుభవం లభిస్తుంది. దీంతో మరెక్కడైనా రాణించేందుకు అవకాశం ఉంటుంది.

అవకాశాన్ని వినియోగించుకోండి 

- డాక్టర్‌ హుస్సేన్, ప్రిన్సిపల్‌

ఎన్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మెదక్‌ కళాశాలలోనే ఈ బీబీఏ కోర్సును ప్రవేశపెట్టారు. దీనితో ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. ప్రస్తుతం దోస్త్‌ ప్రక్రియ కొనసాగుతున్నందున జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని