logo

డిగ్రీ కళాశాల లేక.. చదువు ముందుకు సాగక..

అందుబాటులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక చాలా మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. ఏటా ఇంటర్మీడియట్‌లో అధికశాతం ఉత్తీర్ణత ఉంటున్నా, అందుకు తగ్గట్టుగా డిగ్రీ కళాశాల లేకపోవడం వల్ల నష్టపోతున్నారు.

Published : 18 Jun 2024 02:16 IST

నష్టపోతున్న విద్యార్థులు

ఇంటర్మీడియట్‌లో పరీక్ష రాసేందుకు బారులు తీరిన విద్యార్థులు (పాతచిత్రం)

న్యూస్‌టుడే, చేగుంట: అందుబాటులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక చాలా మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. ఏటా ఇంటర్మీడియట్‌లో అధికశాతం ఉత్తీర్ణత ఉంటున్నా, అందుకు తగ్గట్టుగా డిగ్రీ కళాశాల లేకపోవడం వల్ల నష్టపోతున్నారు. చేగుంటలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి, విద్యార్థుల ఇబ్బందులు తీరుస్తామని ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు హామీలు ఇస్తున్నారు, అనంతరం విస్మరిస్తున్నారు. ఇప్పటికైనా దృష్టి సారించాలని కోరుతున్నారు.

చేగుంట, చిన్నశంకరంపేట, నార్సింగి, తూప్రాన్, వెల్దుర్తి, మాసాయిపేట మండలాలకు చెందిన విద్యార్థులు ఏటా ఇంటర్మీడియట్‌ పూర్తి చేస్తున్నారు. అనంతరం డిగ్రీలో చేరాలని ఉన్నా, ప్రభుత్వ కళాశాలలు లేవు. ప్రైవేటుకు వెళ్లి చదువుకునే స్థోమత ఉండడంలేదు. దీంతో ఇంటర్‌ వరకే చాలా మంది చదువు మానేస్తున్నారు. చేగుంటలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని అప్పటి దుబ్బాక ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి ఆశించారు. అయితే 2014లో ఆయన ఓటమి చెందారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో భారాస, కాంగ్రెస్, భాజపా నాయకులు హామీలు ఇస్తూ వస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెరపైకి ప్రస్తావన వచ్చినా, అడుగు ముందుకు పడలేదు. ఆలాగే 2020 ఉపఎన్నిక, 2023 సాధారణ ఎన్నికల్లో కూడా ఊదరగొట్టారు. 2024 విద్యాసంవత్సరంలో ప్రారంభం అవుతుందని ఆశించినా, నిరాశే మిగిలింది. మెదక్, గజ్వేల్, రామాయంపేట కళాశాలల్లో సీట్లు ఉండడంలేదని విద్యార్థులు వాపోతున్నారు.

అందుబాటులో భవనాలు: చేగుంటలో ప్రభుత్వ జూనియర్, తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్‌ కళాశాల, కేజీబీవీ, తెలంగాణ గిరిజన బాలికల క్రీడా పాఠశాల, జూనియర్‌ కళాశాలలున్నాయి. ఏటా చేగుంట నుంచే సుమారుగా 250 మంది వరకు ఉత్తీర్ణత సాధిస్తున్నారు. చిన్నశంకరంపేట నుంచి 150 మంది, నార్సింగి నుంచి 80 మంది, వెల్దుర్తి నుంచి 100 మంది వరకు ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. వీరికి చేగుంటలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే ప్రవేశాలు పొందే అవకాశముంది. కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలం ఉంది. భవన నిర్మాణం చేసేవరకు ఇతర ప్రభుత్వ భవనాలు కూడా  ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ విద్యాసంవత్సరం కళాశాలను ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

మంజూరుకు కృషి చేస్తున్నాం: 

కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే, దుబ్బాక

చేగుంటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరుకు కృషి చేస్తున్నాం. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాం. ఈ విద్యాసంవత్సరంలోనే ప్రారంభించే విధంగా ప్రయత్నిస్తున్నాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని