logo

నీటిని ఒడిసిపట్టరు.. మరమ్మతు కనరు!

సాగు, తాగుకు ప్రధానమైన నీటి వనరుల అభివృద్ధికి నిధులు రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా ఏళ్ల కిందట మరమ్మతు, ఇతర పనులకు నిధులు కేటాయించగా, ఆ తర్వాత మంజూరు లేక చివరి ఆయకట్టుకు నీరందడం లేదు.

Updated : 18 Jun 2024 06:12 IST

నిధులు రాక ఇబ్బందులు

ఝాన్సీలింగాపూర్‌లో గండిపడి.. 

న్యూస్‌టుడే,మెదక్‌: సాగు, తాగుకు ప్రధానమైన నీటి వనరుల అభివృద్ధికి నిధులు రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా ఏళ్ల కిందట మరమ్మతు, ఇతర పనులకు నిధులు కేటాయించగా, ఆ తర్వాత మంజూరు లేక చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. జిల్లాలోని చిన్ననీటిపారుదల రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు, వాటి కాలువల దుస్థితిపై ‘న్యూస్‌టుడే’ కథనం...

అస్తవ్యస్తం.. రైతుల ఆందోళన 

న్యూస్‌టుడే, రామాయంపేట, చిన్నశంకరంపేట:  రామాయంపేట మండల పరిధి ఝాన్సీలింగాపూర్‌ పెద్ద చెరువు పరిధిలో 300 ఎకరాల ఆయకట్టు ఉంది. మరోవైపు నిజాంపేట ఐదర చెరువు పరిధిలో సుమారు 800 ఎకరాల ఆయకట్టు ఉంది. కాలువలు ధ్వంసమయ్యాయి. ఝాన్సీ లింగాపూర్‌ పెద్దచెరువు నుంచి వెళ్లే కాలువకు గత వర్షాకాలంలో గండి పడింది.చిన్నశంకరంపేట, అంబాజీపేట గ్రామాల మధ్య ఉండే పెద్ద చెరువు పరిధిలో సుమారు 860 ఎకరాల ఆయకట్టు ఉంది. ఏడు గ్రామాల పొలాలకు సాగునీరు అందిస్తుంది. అయితే కాలువలు అస్తవ్యస్తంగా మారాయి. 

నిర్వహణ కొరవడి.. పూడిక నిండి

న్యూస్‌టుడే, కౌడిపల్లి: మండల కేంద్రంమైన కౌడిపల్లి పెద్దచెరువు కింద రెండు వందల ఎకరాల ఆయకట్టు ఉంది. నిర్వహణ సరిగాలేక అస్తవ్యస్తంగా మారింది. గతంలో మిషన్‌ కాకతీయ పథకం ద్వారా రూ.2కోట్లు వెచ్చించి సుందరీకరణ పనులు చేపట్టారు. పంట కాల్వలు పూడిక నిండి అధ్వానంగా తయారయ్యాయి. పొలాలకు నీరుచేరే కాల్వల్లో ముళ్ల పొదలు ఆవరించాయి. 

కాల్వలు ఇలా.. నీరందేది ఎలా?

కొల్చారం: కొల్చారంలోని కోతుల చెరువు పంటకాల్వలు అధ్వానంగా మారాయి. దీని కింద రెండు వందలకు ఎకరాలకు పైగా ఆయకట్టు సాగవుతోంది. కాల్వలు పూడిక నిండి నీరందించలేని దుస్థితి. కాల్వ పక్కన ఇళ్లుున్నాయి. అక్కడకక్కడా పొదలు ఆవరించాయి.  

నెర్రెలు బారి.. ప్రమాదకరంగా మారి

న్యూస్‌టుడే, నర్సాపూర్‌: నర్సాపూర్‌ మండలం చిన్నచింతకుంట ఆముదాల చెరువు కట్ట బలహీనంగా మారి ప్రమాదం పొంచి ఉంది. దీని కింద వందెకరాలకు పైగా ఆయకట్టు సాగు భూములున్నాయి. గతేడాది కురిసిన భారీ వర్షాలకు  కట్ట కుంగింది. కట్ట పొడవునా కోతకు గురైంది. నెర్రెలుబారి ప్రమాదకరంగా మారింది. రైతులే రూ.50వేల వరకు సొంతంగా వెచ్చించి తాత్కాలిక మరమ్మతు చేపట్టారు. పూర్తిస్థాయిలో చేపడితే తప్ప కట్ట నిలిచేటట్లు లేదు.

బుంగలు పడినా.. పట్టించుకోక..

శివ్వంపేట: మండలంలోని గోమారం పెద్దచెరువు అలుగు వద్ద లీకేజీతో సాగు నీరు వృథాగా పోతోంది. చెరువు నిండితే నీరు నిల్వ ఉండటం లేదు. దీని కింద వంద ఎకరాలకు పైగా ఆయకట్టు సాగవుతోంది. రత్నాపూర్‌లో కోమటి చెరువు కట్ట మధ్యలో బుంగలు పడి గతేడాది నీరంతా వృథాగా పోయింది. ఈ సారి నీరు చేరితే కట్ట తెగిపోయో ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రతిపాదనలు పంపుతాం: 

వర్షాలు కురిస్తేనే ఎక్కడెక్కడ బుంగలు పడుతాయనేది తెలియదు. గతేడాది ఒకటి, రెండుచోట్ల పడ్డాయి. లీకేజీలున్నచోట మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపుతాం.ఎక్కడైనా బుంగలు పడినా వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నాం. మిషన్‌ కాకతీయలో మిగిలిన చెరువుల పూడికతీత పనులకు సంబంధించి బిల్లులు రాక వదిలివేశారు. గత నాలుగేళ్లుగా ఆయా చెరువుల వద్ద సమస్యలు ఎదురు కాలేదు.శ్రీనివాస్‌రావు, ఈఈ, నీటిపారుదలశాఖ 

వరద కాలువల్లో..  పొదలు పెరిగి..

చేగుంట: చేగుంట మండలం వడియారం పెద్ద చెరువు కింద వంద ఎకరాల ఆయకట్టు ఉంది. కాలువలు శిథిలమయ్యాయి. బోనాల చెరువు కింద  కాలువలు కనిపించకుండా పోయాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని