logo

నర్సరీ పెంపకం.. విద్యార్థికి అవగతం

ప్రతి ఏటా వ్యవసాయం, అటవీ పరిశోధన విద్య కొత్త పుంతలు తొక్కుతోంది. శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉన్నత చదువుల కోసం విద్యార్థులు అటవీ కళాశాలలో చేరి ప్రతిభ చాటుతున్నారు.

Published : 20 Jun 2024 07:23 IST

శ్రీగంధం, ఎర్రచందనం  మొక్కలపై అటవీ కళాశాల  పరిశోధన కేంద్రం శిక్షణ
న్యూస్‌టుడే, ములుగు

ములుగు అటవీ కళాశాల పరిశోధన కేంద్రంలో శ్రీగంధం నర్సరీని పరిశీలిస్తున్న విద్యార్థులు 

ప్రతి ఏటా వ్యవసాయం, అటవీ పరిశోధన విద్య కొత్త పుంతలు తొక్కుతోంది. శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉన్నత చదువుల కోసం విద్యార్థులు అటవీ కళాశాలలో చేరి ప్రతిభ చాటుతున్నారు. ఉద్యోగావకాశాలే కాకుండా భవిష్యత్తులో స్వశక్తిపై ఆధారపడటానికి ఈ కోర్సులు ఉపయోగపడనున్నాయి. పలు విభాగాల్లో క్షేత్రస్థాయి తర్ఫీదును అధ్యాపకులు ఇస్తున్నారు. ఇందుకు సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో ఉన్న అటవీ కళాశాల పరిశోధన కేంద్రం ఇందుకు వేదికగా మారింది. ఇక్కడ అటవీ శాస్త్రంలో బీఎస్సీ, ఎమ్మెస్సీ చదువుతున్న విద్యార్థుల సహకారంతో ఎంతో విలువైన శ్రీగంధం నర్సరీ మొక్కల పెంపకం చేయిస్తున్నారు.

లాభసాటి పెంపకం

ములుగు అటవీ కళాశాల పరిశోధన కేంద్రంలో ఎమ్మెస్సీ, బీఎస్సీ, పీహెచ్‌డీ చదువుతున్నారు. అటవీ విద్యలో భాగంగా విద్యార్థులకు మొక్కల పెంపకంపై ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు. ఇక్కడ విద్యాభ్యాసం పూర్తికాగానే ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంతంగా ఇతరుల కంటే భిన్నంగా ఎలాంటి వ్యాపారాలు చేస్తే లాభసాటిగా ఉంటుందో తెలియజేస్తున్నారు. మార్కెట్‌లో సుగంధ ద్రవ్యాలకు ఎంతో డిమాండ్‌ పలుకుతోంది. అందులో ఎంతో ముఖ్యమైన ఎర్రచందనం., శ్రీచందనం మొక్కల నర్సరీని పెంచితే కలిగే ప్రయోజనాలను ఆద్యాపకులు వారికి వివరిస్తున్నారు. కళాశాల ఆవరణలో ప్రత్యేకంగా రెండు లక్షలు పెంచుతున్నారు.

అటవీ పరిశోధన కేంద్రంలో విద్యార్థులు 470
నర్సరీలో శ్రీచందనం మొక్కలు 1,75,000
ఒక్కో మొక్క ధర రూ.35
ఎర్ర  చందనం మొక్కలు 25,000

రోజూ పరిశీలన

అటవీ కళాశాల పరిశోధన కేంద్రం, కేర్స్‌ సంస్థ ఆధ్వర్యంలో నర్సరీని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం కొంత మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వారికి మొక్కల సంరక్షణ, నిర్వహణ భాద్యత అప్పగించారు. విద్యార్థులు ప్రతిరోజు నర్సరీలో పర్యటిస్తారు. పెంచడంలో అంశాలను క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారని సహాయ ఆచార్యులు చిరంజీవి తెలిపారు. భవిష్యత్తులో ఉద్యోగాలు సాధించినా నర్సరీల పెంపకంపై అవగాహన ఉంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. సేంద్రియ ఎరువులతో నర్సరీలో పెంచిన మొక్కలు ప్రస్తుతం నాటడానికి సిద్ధమయ్యాయి. రెండు లక్షల మొక్కలు పంపిణీ చేస్తారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీటిని రైతులకు, ప్రభుత్వం సూచించిన సంస్థలకు అందజేస్తారు.

భాగస్వామ్యంతో ఎంతో ఆసక్తి

అటవీ విద్యను అభ్యసించే విద్యార్థులకు అన్ని అంశాలపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. నర్సరీల పెంపకంపై అవగాహన ఉంటే భవిష్యత్తులో వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇదే ఉద్దేశంతో నర్సరీ పెంపకంలో విద్యార్థులను భాగస్వామ్యం చేశాం. వారు ఎంతో ఆసక్తితో నిర్వహిస్తున్నారు.

 ఆశ, డీన్, అటవీ కళాశాల పరిశోధన కేంద్రం, ములుగు

స్వయం ఉపాధికి అవకాశాలు

పరిశోధన కేంద్రంలో వుడ్‌ వర్క్‌షాప్, నర్సరీ పెంపకం లాంటి అనేక అంశాలపై నేర్పిస్తున్నారు. మార్కెట్‌లో విలువైన వాణిజ్యపరమైన శ్రీగంధం లాంటి మొక్కల నర్సరీని ఎలా పెంచాలో తెలిసింది. వాటితో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. నర్సరీల పెంపకంతో స్వయం ఉపాధి పొందవచ్చు.

 రంజుత, విద్యార్థిని

డిమాండ్‌కు తగిన తర్ఫీదు

కళాశాలలో అటవీ విద్యతోపాటు నర్సరీల పెంపకంపై ప్రత్యేక తర్పీదు తీసుకున్నా. నర్సరీలో మొక్కలు ఎలా పెంచాలి, ఎలాంటి ఎరువులు వేయాలి, ఎన్ని రోజులకు నాటాలో తెలిసింది. అటవీ శాస్త్రం చదువుతున్న ప్రతి విద్యార్థికి ఇది ఎంతో అవసరం. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న మొక్కల పెంపకంపై తర్ఫీదు ఇవ్వడం ప్రయోజనకరం అవుతుంది. భవిష్యత్తులో అన్నిరకాల మొక్కలతో నర్సరీని ఏర్పాటు చేస్తా.

 భార్గవి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని