logo

నిమ్జ్‌ భూసేకరణ వేగవంతం

జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న జహీరాబాద్‌ ప్రాంతంలోని జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి(నిమ్జ్‌) ప్రాజెక్టు పరిధిలో భూసేకరణ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు.

Published : 20 Jun 2024 02:21 IST

ఒప్పందాలకు ముందుకొస్తున్న రైతులు
న్యూస్‌టుడే, జహీరాబాద్‌

మొదటి విడతలో సేకరించిన భూములకు కంచె ఏర్పాటు

జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న జహీరాబాద్‌ ప్రాంతంలోని జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి(నిమ్జ్‌) ప్రాజెక్టు పరిధిలో భూసేకరణ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. దాదాపు 31వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో 2012లో మంజూరైన ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 12,635 ఎకరాల భూమిని సేకరించాలని భావించారు. ప్రభుత్వం ఐదేళ్ల క్రితం మొదటి విడతలో భాగంగా 3500 ఎకరాలు సేకరించింది. అందులో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమివ్వడంతో పాటు.. రెండు పరిశ్రమలకు స్థలాన్ని కేటాయించారు. వివిధ కారణాల వల్ల ఇంతకాలం నెమ్మదిగా సాగిన భూసేకరణ ప్రక్రియ కొన్ని రోజులుగా ఊపందుకుంది.

17 గ్రామాల పరిధిలో..

జహీరాబాద్‌ నియోజకవర్గం ఝరాసంగం, న్యాల్‌కల్‌ మండలాల్లోని 17 గ్రామాల పరిధిలో నిమ్జ్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణ కోసం ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు జారీ చేసిన అధికారులు 2018లో మొదటి విడత కింద 3,500 ఎకరాలు సేకరించారు. భూముల ధరలు, పరిహారం చెల్లింపు విషయంలో అధికారులు, రైతులకు మధ్య సమన్వయం కుదరలేదు. ఈ ప్రభావంతో రెండో విడతలో సేకరించే భూముల్లో సర్వే నిర్వహించిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. మరికొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో భూసేకరణ ప్రక్రియలో జాప్యం జరిగింది.

స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ నియామకం

నిమ్జ్‌ భూముల ప్రక్రియను కొలిక్కి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జహీరాబాద్‌లో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ను నియమించింది. భూసేకరణను మూడు పేరాలు(పార్సిల్స్‌)గా విభజించి ప్రక్రియను వేగవంతం చేశారు. భూములు ఇవ్వడానికి సంసిద్ధత తెలుపుతూ వచ్చే రైతులు, పరిహారం చెక్కులు తీసుకునేందుకు వచ్చే వారితో జహీరాబాద్‌లోని నిమ్జ్‌ కార్యాలయం నాలుగైదు రోజులుగా కిటకిటలాడుతోంది.

ఎక్కడెక్కడ.. ఎలా..

  •  మొదటి పేరా(పార్సిల్‌) కింద ఎల్గోయి, బర్దీపూర్, చీలేపల్లి, రుక్మాపూర్, ముంగి గ్రామాలను ఎంపిక చేశారు. వీటి పరిధిలో 4,462 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 3,596 ఎకరాలకు ఒప్పందాలు పూర్తి చేశారు. మిగతా భూ సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది.
  •  రెండో పేరా(పార్సిల్‌) కింద గణేశ్‌పూర్, మెటల్‌కుంట, రేజింతల్, న్యామతాబాద్, మామిడ్గి, గుంజేటి, బసంత్‌పూర్, గంగ్వార్, మొలకన్‌పాడ్, కల్‌బెముల్, హద్నూర్, హుస్సెళ్లి గ్రామాల్లో 8,172 ఎకరాలు సేకరించాలి. ఇప్పటి వరకు 2,200 ఎకరాల సేకరణ పూర్తయింది.
  •  మూడో పేరా కింద హుగ్గెల్లి, రంజోల్, కృష్ణాపూర్, మాచునూర్, బర్దీపూర్‌లోని 65 ఎకరాలను సేకరించారు. 9 కిలో మీటర్ల మేరకు ప్రత్యేక రహదారి నిర్మాణాన్ని   చేపడుతున్నారు.
  •  మొదటి విడతలో సేకరించిన ఎల్గోయి, బర్దీపూర్, చీలెపల్లి గ్రామాల పరిధిలో హుందాయ్‌ పరిశ్రమకు 409 ఎకరాలు, వెమ్‌ టెక్నాలజీ పరిశ్రమకు 511 ఎకరాలు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.

రైతులతో సంప్రదింపులు జరుపుతున్నాం: కొల్లు నాగలక్ష్మి, నిమ్జ్‌ ప్రాజెక్టు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రకటనలు జారీచేశాం. రైతులు అభిప్రాయాలు తెలియజేసేందుకు నిర్దేశిత గడువు వచ్చాం. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన రైతులకు భూ పరిహారం చెల్లిస్తున్నాం. మిగతా రైతులతో సంప్రదింపులు జరుపుతున్నాం. వారం రోజులుగా ఈ ప్రక్రియ వేగవంతమైంది. రైతులకు ఏమైనా సందేహాలు, ఇబ్బందులుంటే కార్యాలయంలో సంప్రదించవచ్చు. సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని