logo

యువతకు రుణం.. ఏడేళ్లుగా జాప్యం

యువతను స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయించాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. రాయితీ విడుదలకు నిధుల కేటాయింపు లేకపోవడమే కారణం.

Updated : 20 Jun 2024 04:50 IST

 బీసీ కార్పొరేషన్‌ తీరిది..

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్, జోగిపేట: యువతను స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయించాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. రాయితీ విడుదలకు నిధుల కేటాయింపు లేకపోవడమే కారణం. బీసీ యువతకు రాయితీ రుణ పథకాల అమలు మూడు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతోంది. స్వయం ఉపాధి యూనిట్లకు దరఖాస్తు చేసిన యువత ఆశలు ఆవిరవుతున్నాయి. 2017-18 సంవత్సరానికి రాయితీ రుణాల కోసం గత ప్రభుత్వం బీసీ కార్పొరేషన్‌ ద్వారా స్వీకరించిన దరఖాస్తులకు ఇప్పటికీ మోక్షం లభించలేదు.

‘శతశాతం’ రాయితీ కొందరికే..

గతంలో ఎప్పుడూ లేనివిధంగా రూ.లక్షలోపు యూనిట్లకు దరఖాస్తుచేసిన వారికి శతశాతం రాయితీ కింద రూ.50వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా రాయితీ నిధులు సైతం విడుదల చేసింది. చిరు వ్యాపారాల ద్వారా స్వయం ఉపాధి పథకాల కింద 766 యూనిట్లకు రూ.3.83 కోట్లు రాయితీగా అందజేశారు. రూ.లక్షలోపు యూనిట్లను కేటగిరీ-1, రూ.రెండు లక్షల వరకున్న యూనిట్లను కేటగిరీ-2, రూ.2లక్షలకు పైగా యూనిట్లను కేటగిరీ-3గా నిర్ణయించారు. రూ.లక్ష ఆపై యూనిట్లకు దరఖాస్తు చేసిన వారికి ఎదురుచూపులే మిగిలాయి. రాయితీ రుణాలు ఎప్పుడు విడుదలవుతాయో తెలియని పరిస్థితి. ఏడేళ్లుగా నిధులు విడుదల చేయకపోవడంపై నిరుద్యోగ యువత అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కొత్త ప్రభుత్వమైనా దృష్టి సారించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.

ముఖాముఖీలూ నిర్వహించలేదు

రాయితీ రుణాల కోసం జిల్లా వ్యాప్తంగా 10,047 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఎంతమంది అర్హులనే విషయాన్ని తేల్చలేదు. దరఖాస్తులు పరిశీలించి.. ముఖాముఖీలు నిర్వహించాల్సి ఉండగా.. ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయలేదు. దరఖాస్తుల స్వీకరణకు అనుమతించి, తదుపరి ప్రక్రియపై మార్గదర్శకాలు విడుదల చేయకపోవడం ఎంతవరకు సమంజసమని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

ఇకనైనా నిధులు విడుదల చేయాలి

బీసీ కార్పొరేషన్‌ రుణం కోసం ఏడాది క్రితం దరఖాస్తు చేశా. ప్రస్తుతం నిర్వహిస్తున్న క్షౌరశాలను కాస్త పెద్దదిగా విస్తరించాలనుకుంటున్నా. రూ.లక్ష రుణం కోసం దరఖాస్తు చేశా. ఇప్పటికీ మంజూరు చేయలేదు. ఇకనైనా అధికారులు స్పందించాలి. రాయితీ నిధుల విడుదలపై దృష్టి సారించాలి. ఆర్థికంగా నిలుదొక్కుకునే అవకాశం కల్పించాలి.

ఎం.సత్యం, జోగిపేట

ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది

గత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అప్పట్లో రాయితీ రుణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపట్టాం. రాయితీ నిధులు విడుదల చేయకపోవడంతో యూనిట్లు గ్రౌడింగ్‌ చేయలేకపోయాం. రాయితీ రుణాల కోసం వచ్చిన దరఖాస్తులపై ప్రస్తుత ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందుకుసాగుతాం. 

జగదీశ్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని