logo

నులి పురుగును మెలిపెడదాం!

నులి పురుగు.. చిన్నారుల ఆరోగ్యాన్ని మెలిపెడుతోంది. అనారోగ్య సమస్యలు, పోషకాహార లోపానికి దారి తీస్తోంది. పిల్లల ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారుతోంది.

Published : 20 Jun 2024 02:26 IST

నేడు జిల్లా వ్యాప్తంగా మాత్రల పంపిణీ

టాస్క్‌ఫోర్సు కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ మనుచౌదరి

న్యూస్‌టుడే, సిద్దిపేట: నులి పురుగు.. చిన్నారుల ఆరోగ్యాన్ని మెలిపెడుతోంది. అనారోగ్య సమస్యలు, పోషకాహార లోపానికి దారి తీస్తోంది. పిల్లల ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారుతోంది. వాటి నివారణకు ఏటా వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఆల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేస్తున్నారు. నేడు (గురువారం) జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మాత్రల పంపిణీకి కార్యాచరణ రూపొందించారు. 1-19 ఏళ్ల వయసున్న బాలబాలికలకు జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో నేడు ఆల్బెండజోల్‌ మాత్రలు అందించనున్నారు. విద్యాశాఖ, ఐసీడీఎస్, ఇతర శాఖల సమన్వయంతో కార్యక్రమం అమలుకానుంది. నేడు అందుబాటులో ఉండని, మాత్రలు తీసుకోని వారికి ఈనెల 27న (మాప్‌ అప్‌ డే) ఆరోగ్య సిబ్బంది పంపిణీ చేయనున్నారు.

ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలు..

జిల్లాలోని 1125 అంగన్‌వాడీ కేంద్రాలు, 980 ప్రభుత్వ, 227 ప్రైవేటు, 53 జూనియర్‌ కళాశాలలు, 14 వివిధ రకాల   విద్యాలయాల్లో కార్యక్రమం అమలుకానుంది. బడికి వెళ్లని, ఇళ్ల వద్ద ఉండే బాలబాలికలను ఆశ కార్యకర్తలు గుర్తించి సమీప కేంద్రం ద్వారా మాత్రలు అందిస్తారు. ఆయా చోట్లకు వైద్య సిబ్బంది మాత్రలను బుధవారం చేరవేశారు. మొత్తం 36 పీహెచ్‌సీల పరిధిలో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలు ఏర్పాటు చేశారు. ఏదైనా ఇబ్బంది కలిగితే తక్షణ వైద్యం అందిస్తారు. ఏటా 99 శాతం మేర పంపిణీ జరుగుతోంది. శాత శాతం పంపిణీ లక్ష్యంతో కృషి చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.

అనేక ఇబ్బందులు..

ఆరుబయట మట్టిలో చెప్పులు లేకుండా ఆడుకోవడం, చేతుల శుభ్రత పాటించకపోవడం, ఇతరత్రా కారణాలతో నులిపురుగులు శరీరంలోకి వ్యాపిస్తాయి. ఫలితంగా బాలబాలికలు కడుపునొప్పితో మెలికలు తిరుగుతుంటారు. అన్నవాహికలో స్థానం ఏర్పాటు చేసుకునే ఈ పురుగులు పిల్లలపై దుష్ప్రభావం చూపుతాయి. పోషకాలు అందక బరువు తగ్గుతారు. వాంతులు, విరేచనాలు, దద్దుర్లు, మందబుద్ధి సమస్యలతో పాటు ఏకాగ్రత లోపిస్తుంది. రక్తహీనత ఏర్పడుతుంది.

సమీక్ష.. దిశానిర్దేశం..

నులిపురుగుల నిర్మూలనా దినం సందర్భంగా బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా పాలనాధికారి మనుచౌదరి సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ కోరారు. తల్లిదండ్రులు సహకరించాలని, అపోహలు వీడి తప్పక మాత్రలు వేయించాలన్నారు. అదనపు కలెక్టర్‌ గరిమ అగ్రవాల్, జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్‌ విజయరాణి, వివిధ విభాగాల వైద్యాధికారులు సాయికిరణ్, కిషోర్‌కుమార్, శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

జిల్లాలో ఇలా..

పంపిణీ లక్ష్యం  2,38,559
భాగస్వాములు కానున్న వైద్య సిబ్బంది  1500
పర్యవేక్షకుల సంఖ్య   7

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని