logo

5339 మంది బడి బాట

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యగా జిల్లాలో చేపట్టిన ‘ప్రొ.జయశంకర్‌ బడిబాట’ సత్ఫలితాలు ఇచ్చింది. ఈనెల 6 నుంచి మొదలైన కార్యక్రమం బుధవారానికి ముగిసింది.

Updated : 20 Jun 2024 04:51 IST

ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన ప్రవేశాలు
అనేక చోట్ల లక్ష్యాన్ని మించి చేరిక

పుల్లూరు పాఠశాలలో విద్యార్థులు,  కుటుంబ సభ్యులు 

న్యూస్‌టుడే, సిద్దిపేట: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యగా జిల్లాలో చేపట్టిన ‘ప్రొ.జయశంకర్‌ బడిబాట’ సత్ఫలితాలు ఇచ్చింది. ఈనెల 6 నుంచి మొదలైన కార్యక్రమం బుధవారానికి ముగిసింది. 14 రోజుల వ్యవధిలో మొత్తం 5339 మంది విద్యార్థులు సర్కారు బడుల్లో చేరారు. గత ఏడాది 5043 మంది చేరగా.. ఈసారి 296 మంది ఎక్కువగా చేరడం విశేషం. పెరిగిన సంఖ్యతో జిల్లాలోని అనేక సర్కారు బడులు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. కొన్ని విద్యాలయాల్లో లక్ష్యానికి మించి చేరగా.. ‘నో అడ్మిషన్‌ బోర్డు’ పెట్టే స్థాయికి చేరడం గమనార్హం.

అనుభవజ్ఞులైన గురువులు

చక్కటి సదుపాయాలు, విశాలమైన మైదానాలు, అర్హత, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఇలా ఎన్నో ప్రత్యేకతల సమాహారమే సర్కారు బడులు. జిల్లాలో మెజార్టీ పాఠశాలలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ తరుణంలో వాటిల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి ఉచితంగా బోధన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏటా ‘బడిబాట’ నిర్వహిస్తోంది. ఈనెల 6వ తేదీన మొదలైన కార్యక్రమం 19వ తేదీ వరకు కొనసాగింది. జిల్లా పరిధిలో వివిధ ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో 940 పాఠశాలలు ఉన్నాయి. ఆయా వాటిల్లో గత విద్యా సంవత్సరం 81,113 మంది చదివారు. 2024-25 విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెంపు లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేశారు. కలెక్టర్‌ మనుచౌదరి ఆధ్వర్యంలో గత నెల 30న సమన్వయ సమావేశం నిర్వహించారు. గత నెల 31, ఈ నెల 1, 2 తేదీల్లో ప్రతి మండలంలో ఎంపీడీవోల ఆధ్వర్యంలో తహసీల్దార్, ఎంఈవో, ఎంఎన్‌వో, హెచ్‌ఎంలు, స్వచ్ఛంద సంస్థలతో సమావేశం నిర్వహించి మెరుగైన ఫలితాలకు కసరత్తు చేశారు.

ప్రణాళికతో ముందడుగు..

ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులను సర్కారు బడుల వైపు మళ్లించాలనే లక్ష్యంతో ముందడుగు వేశారు. ఇదే క్రమంలో విద్యార్థులు లేక వెలవెలబోతున్న అనేక పాఠశాలలు ఉనికిని చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాయి. బడి బయట పిల్లలను గుర్తించారు. పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలను ఉపాధ్యాయులు సందర్శించారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నిర్వాహకులు.. ప్రాథమిక పాఠశాలలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆయా చోట్ల చదివే బాలబాలికలు ప్రైవేటు వైపు మొగ్గు చూపకుండా ముందు నుంచి సన్నద్ధం చేశారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రతి ప్రభుత్వ పాఠశాల పరిధిలో ప్రైవేటు, సర్కారు బడుల్లో ఎంత మంది చదువుతున్నారనే దిశగా పలువురు గుర్తించి కార్యాచరణ మొదలెట్టారు. ప్రైవేటుకు పంపిస్తున్న తల్లిదండ్రులను నేరుగా, చరవాణి ద్వారా సంప్రదించారు. తద్వారా ఒకటో తరగతిలో గరిష్ఠంగా 3450 మంది చేరారు. అందులో అంగన్‌వాడీ కేంద్రాల నుంచి 2909 మంది, ప్రైవేటు నుంచి 338, నేరుగా 203 మంది చేరారు. రెండు నుంచి పదో తరగతి వరకు 1889 మంది చేరారు. అందులో ప్రైవేటు నుంచి 1696 మంది, బడిబయట, బడిమానేసిన పిల్లలు 194 మంది ఉన్నారు.

దోహదం చేసిన అంశాలు..

నిత్యం ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు ఇంటింటా ప్రచారం చేశారు. కరపత్రాలు పంపిణీ చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించారు. వినూత్నంగా బ్యానర్లను ప్రదర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములయ్యారు. మండలం నుంచి జిల్లా వరకు వివిధ స్థాయిల్లో అధికారులు నిత్యం మండలాల్లో పర్యటించారు. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో ఇతర బడుల్లోకి వెళ్లకుండా తల్లిదండ్రులకు ప్రేరణ కల్పించారు.

చక్కటి వసతులు: శ్రీనివాస్‌రెడ్డి, డీఈవో

సర్కారు బడుల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులు, చక్కటి వసతులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు సద్వినియోగం చేసుకొని మెరుగైన ఫలితాలు సాధించాలి. తల్లిదండ్రుల ఆసక్తి మేర నచ్చిన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని