logo

క్రీడలకు ప్రోత్సాహం.. విద్యార్థులకు వరం

క్రీడలు మానసిక ఉల్లాసానికి.. శారీరక దృఢత్వానికి దోహదపడతాయి. పాఠశాల స్థాయిలోనే  విద్యార్థులకు ఆసక్తి ఉన్న క్రీడాంశంపై తర్ఫీదు ఇచ్చేందుకు పీఈటీలను నియమించారు.

Published : 20 Jun 2024 02:34 IST

జిల్లాలో 42 జడ్పీ పాఠశాలల్లో పీఈటీల ఉన్నతీకరణ

న్యూస్‌టుడే, చేగుంట: క్రీడలు మానసిక ఉల్లాసానికి.. శారీరక దృఢత్వానికి దోహదపడతాయి. పాఠశాల స్థాయిలోనే  విద్యార్థులకు ఆసక్తి ఉన్న క్రీడాంశంపై తర్ఫీదు ఇచ్చేందుకు పీఈటీలను నియమించారు. ఇప్పటి వరకు చాలా చోట్ల వారే  శిక్షణ ఇస్తూ వచ్చారు. ఇప్పుడ ప్రభుత్వం పీఈటీ పోస్టులను ఉన్నతీకరించింది (ఆప్‌గ్రేడ్‌). దీనివల్ల విద్యార్థులకు  మరింత మెరుగైన శిక్షణ లభించనుంది. తద్వారా ఆటలపై నైపుణ్యం పెంచుకోవచ్చని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

జిల్లాలో 143 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలున్నాయి. ఇందులో మండల కేంద్రాల్లో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలల్లో పీడీ (ఫిజికల్‌ డైరెక్టర్‌) పోస్టులు ఇప్పటివరకు ఉన్నాయి. అలాగే 52 పాఠశాలల్లో పీఈటీలు ఉండేవారు. తాజాగా ప్రభుత్వం 42 జడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఉన్న పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్‌ చేసింది. పీఈటీలుగా విధులు నిర్వర్తించిన వారికి స్కూల్‌ అసిస్టెంట్‌లుగా (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌) బుధవారం పదోన్నతి కల్పించింది. దీంతో జిల్లాలో వారంతా విధుల్లో చేరారు.

చేగుంట మండలం మక్కరాజుపేటలో విధుల్లో చేరుతున్న మంజులత

తీర్చిదిద్దేందుకు.. : దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన జడ్పీ ఉన్నత పాఠశాలలను మాత్రమే ఆప్‌గ్రేడ్‌ చేశారు. చేగుంట మండలం వడియారం, మక్కరాజుపేట, చందాయిపేట, చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి, మడూర్‌ వంటి పాఠశాలల్లో ఇప్పటి వరకు పీఈటీలు మాత్రమే ఉన్నారు. ఇక నుంచి ఈ పాఠశాలల్లో పీడీలు చిన్నారులను క్రీడల్లో తీర్చిదిద్దనున్నారు.  తద్వారా క్రమశిక్షణ కూడా అలవడనుంది. ఆటల్లో ప్రతిభ చూపితే, ఉన్నత చదువుల్లో సీట్లు పొందేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయి. అలాగే ఉద్యోగసాధనలో ప్రయోజనం ఉంటుంది.  పాఠశాల స్థాయిలో ప్రభుత్వం స్కూల్‌గేమ్స్‌ నిర్వహిస్తోంది. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, క్రికెట్, ఫెన్సింగ్, యోగా వంటి వాటిలో పోటీలు జరుగుతాయి. మొదట మండల స్థాయి, అనంతరం జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహిస్తుంది. ఇందులో ప్రతిభ చాటిన వారిని జాతీయ స్థాయికి ఎంపిక చేస్తుంది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు విద్యార్థులు ఉత్సాహం చూపుతారు. వారిని తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తుంటారు. ఇవే కాకుండా అసోసియేషన్‌ నిర్వహించే పోటీలు అదనంగా ఉంటాయి. ప్రస్తుతం పదోన్నతి పొందిన పీఈటీలు బాలలను క్రీడల్లో మెరికల్లా తయారు చేస్తే మరింత గుర్తింపు రానుంది.

చాలా చోట్ల లేకపోవడంతో..:

జిల్లాలో చాలా పాఠశాలల్లో పీఈటీ పోస్టులు లేవు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి  ఆటలపై ఆసక్తి ఉన్నా శిక్షణలేక రాణించలేకపోతున్నారు. కేవలం ఉపాధ్యాయులు ఇచ్చే శిక్షణే వారికి ఆధారమవుతోంది. అలాంటి పాఠశాలల్లో పీఈటీలను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. చేగుంట మండలంలో బోనాల, ఇబ్రహీంపూర్, కరీంనగర్, నార్సింగి మండలం శేరిపల్లితో పాటు జిల్లాలో పలు పాఠశాలల్లో పీఈటీ పోస్టులు లేవు. వాటిల్లో నియమిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని