logo

ఆఖరి మజిలీకి అవస్థలే!

ఒకప్పుడు శ్మశాన వాటికలు పట్టణాలు, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో మాత్రమే ఉండేవి. మారుతున్న కాలనికి అనుగుణంగా జీవన విధానాల్లో మార్పులు వస్తున్నాయి.

Published : 20 Jun 2024 02:36 IST

బాచారంలో ఎగిరిపోయిన గది రేకులు

 న్యూస్‌టుడే, పాపన్నపేట: ఒకప్పుడు శ్మశాన వాటికలు పట్టణాలు, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో మాత్రమే ఉండేవి. మారుతున్న కాలనికి అనుగుణంగా జీవన విధానాల్లో మార్పులు వస్తున్నాయి. గ్రామాల్లో ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు చేసేందుకు ఇబ్బందులు పడుతుంటారు. సొంత స్థలాలు లేక, అంత్యక్రియలు చేయాలో తెలియక ఆందోళనకు గురవుతారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు గత ప్రభుత్వం ఉపాధిహామీ పథకం ద్వారా  వైకుంఠధామాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇంత వరకు బాగానే ఉన్నా, వాటిల్లో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు దృష్టి సారించి వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

చిత్రియాలలో వైకుంఠధామానికి వెళ్లే దారి 

రూ.12 లక్షలు వెచ్చించినా

పాపన్నపేట మండలంలో మొత్తం 36 పంచాయతీల్లో శ్మశానవాటికలున్నాయి. ఒక్కో దానికి సుమారు రూ.12లక్షల వరకు వెచ్చించారు. ప్రతి చోటా రెండు దహనం చేసే ఫ్లాట్‌ఫాంలు, శౌచాలయాలు, స్నానాల గదులు, వేచి ఉండేందుకు ఓ గదిని నిర్మించారు. చాలా ప్రాంతాల్లో అక్కడికి వెళ్లేందుకు సరైన రోడ్డు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పాపన్నపేట, నామాపూర్, చిత్రియాల, ఆరేపల్లి, తదితర గ్రామాల్లో  కిలోమీటరు  దూరంలో ఉన్నాయి. బాచారం, ఢాక్యతండాలో ఇటీవల ఈదురు గాలులకు శౌచాలయాలు, గదులపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. పలు చోట్ల ఎత్తు పల్లాలు, గుట్టలుగా ఉన్న ప్రాంతాల్లో నిర్మించడంతో దారి సరిగా లేక అంతిమయాత్ర చేసే సమయంలో నడకకూ అవస్థలు తప్పడంలేదు.  బోర్లు తవ్వించినా విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో మోటార్లు బిగించలేదు.

సౌకర్యాల కల్పనకు కృషి చేస్తాం

గ్రామాల్లో వైకుంఠధామాలను పరిశీలించి వాటిల్లో ఉన్న సమస్యలను గుర్తిస్తాం. విద్యుత్తు, నీటి సౌకర్యం, తదితర సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం.

సుబ్రహ్మణ్యం, ఎంపీడీవో

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని