logo

నిరంతరం తనిఖీ.. నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట

ఈ సీజన్‌లో ఇంకా పంటల సాగుకు అదును మించిపోలేదు. సకాలంలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. భూమి పూర్తిగా తడిశాకే, వరి, ఇతర పంటల సాగుకు మొగ్గు చూపాలి.

Updated : 20 Jun 2024 04:49 IST

 జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోవిందు

న్యూస్‌టుడే, మెదక్‌: ఈ సీజన్‌లో ఇంకా పంటల సాగుకు అదును మించిపోలేదు. సకాలంలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. భూమి పూర్తిగా తడిశాకే, వరి, ఇతర పంటల సాగుకు మొగ్గు చూపాలి. ఇప్పటికే జిల్లాల్లో ఆయా చోట్ల పత్తి పంట సాగవుతోంది. రైతులు ఏఏ పంటలు సాగు చేశారనేది తెలుసుకునేందుకు సర్వే నంబర్ల ఆధారంగా క్రాప్‌ బుకింగ్‌ నిర్వహిస్తున్నాం. ఎరువులు, విత్తనాల దుకాణాల్లో తనిఖీ చేపడుతున్నాం. నకిలీ విత్తనాలు విక్రయించకుండా దృష్టి సారించాం. రైతు నేస్తం కార్యక్రమాన్ని వీక్షించేందుకు మరో 18 రైతు వేదికల్లో దృశ్యశ్రవణం ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోవిందు తెలిపారు. బుధవారం ‘న్యూస్‌టుడే’ ఆయనతో ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలు ఇలా...
కొనసాగుతున్న క్రాప్‌ బుకింగ్‌: వానాకాలంలో ఇప్పటి వరకు జిల్లాలో పత్తి పంటను అధికంగా సాగు చేశారు. 3.73 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తారని అంచనా వేశాం. ఇప్పటి వరకు 9,850 ఎకరాల్లో సాగయింది. 9,546 ఎకరాల్లో పత్తి, 122 ఎకరాల్లో కందులు, 89 ఎకరాల్లో మొక్కజొన్న, 38 ఎకరాల్లో పెసర్లు, నాలుగు ఎకరాల్లో వరి సాగైంది. ఏ పంటకు సమయం దాటిపోలేదు. నాలుగైదు సార్లు వర్షాలు కురిసి, నేల తడిగా మారి తేమ శాతం ఎక్కువగా ఉంటేనే విత్తనాలు వేసుకోవాలి. ఇప్పటికే క్రాప్‌బుకింగ్‌ ప్రారంభించాం. ఏ పంట, ఎన్ని ఎకరాల్లో సాగు చేశారనేది వివరాలు నమోదు చేస్తున్నాం. ఈ ప్రక్రియ అక్టోబరు వరకు సాగుతుంది.

టాస్క్‌ఫోర్సు బృందం ఏర్పాటు: ఎరువుల దుకాణాల నిర్వాహకులు నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవు. మండల, డివిజన్‌ స్థాయిలో దుకాణాలను తనిఖీ చేసేందుకు టాస్క్‌ఫోర్స్‌ బృందం ఏర్పాటు చేశాం. మండల స్థాయిలో ఏవో, ఎస్సై, తహసీల్దార్, డివిజన్‌ స్థాయిలో ఏడీఏ, ఆర్డీవో, డీఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు. వీరు నిరంతరం తనిఖీలు చేపడుతారు. మాసాయిపేటలో అనుమతి, లైసెన్స్‌ లేకుండా విత్తనాలు తయారు చేస్తున్న కేంద్రంపై దాడి చేసి రూ.6.95 లక్షల వరి విత్తనాలను పట్టుకున్నాం. ఏవోలు, ఏడీఏలు ప్రతి ఎరువుల దుకాణానికి వెళ్లి ఫర్టిలైజర్‌ వెరిఫికేషన్‌ ఇన్‌వెంట్రి సిస్టంలో వివరాలు నమోదు చేయాలి. దుకాణాల్లో ఉన్న స్టాక్, ఏ స్టాక్‌ ఎంత విక్రయాలు జరుగుతున్నాయి...ఈ-పాస్‌ను అమలు చేస్తున్నారా?లేదా.? అనేది పరిశీలిస్తారు. ప్రతి నెల ఏవోలు పది దుకాణాలు, ఏడీఏలు పది దుకాణాలు, జిల్లా అధికారిగా తాను ఐదు దుకాణాలను తనిఖీ చేయాల్సి ఉంటుంది.

1,607 నమూనాలు సేకరిస్తాం

ప్రభుత్వం భూసార పరీక్షలను పునరుద్ధరించింది. పరీక్షలను నిర్వహించేందుకు మట్టి నమూనాల సేకరణకు నార్సింగి మండలాన్ని ఎంపిక చేసింది. ఐదు ఎకరాలకు ఒక నమూనా సేకరించి, మెదక్‌లోని భూసారకేంద్రంలో పరీక్షలు చేయనున్నాం.1,607 నమూనాలను సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తాం. ఇందుకు సిబ్బందికి ప్రత్యేక యాప్‌ను ఇవ్వనున్నారు.

మరో 18 రైతు వేదికల్లో దృశ్యశ్రవణం

వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంటల సాగుపై శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు తెలియజేసేందుకు ప్రభుత్వం ప్రతి మంగళవారం రైౖతునేస్తం కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇది వరకు కొల్చారం, రామాయంపేట, నర్సాపూర్‌లోని రైతువేదికల్లో దృశ్యశ్రవణం ద్వారా వివరాలను అందిస్తున్నారు. దీనిని మరింత విస్తరిస్తున్నాం. టేక్మాల్, వెల్దుర్తి, నార్సింగి, నస్కల్‌(నిజాంపేట),కౌడిపల్లి, చిలప్‌చెడ్, మాసాయిపేట, గుండ్రెడిపల్లి (తూప్రాన్‌) మనోహరాబాద్, శివాయిపల్లి (పెద్దశంకరంపేట), కూచన్‌పల్లి (హవేలిఘనపూర్‌), చేగుంట, చిన్నశంకరంపేట, మెదక్, చీకోడ్‌(పాపన్నపేట), శివ్వంపేట, టి.లింగంపల్లి(రేగోడ్‌), చేవెళ్ల (అల్లాదుర్గం)రైతు వేదికల్లో రూ.3.70 లక్షల విలువైన టెలివిజన్, కంప్యూటర్, ప్రొజెక్టర్, మైక్, స్పీకర్లను ఏర్పాటు చేయనున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని