logo

భూమాతకు ఆరోగ్య కార్డులు

భూమిలో సారం బాగుంటే దిగుబడులు ఎక్కువగా వస్తుంటాయి. కానీ అందులో సారం ఎంత ఉందో రైతులకు తెలియదు.

Published : 26 Jun 2024 01:40 IST

నేల స్వభావం  తెలుసుకొనేందుకు మట్టి నమూనాల సేకరణ
పైలట్‌ ప్రాజెక్టుగా నార్సింగి మండలం 

సేకరిస్తున్న మట్టి నమూనాలు 

న్యూస్‌టుడే, చేగుంట: భూమిలో సారం బాగుంటే దిగుబడులు ఎక్కువగా వస్తుంటాయి. కానీ అందులో సారం ఎంత ఉందో రైతులకు తెలియదు. ఇబ్బడిముబ్బడిగా రసాయన ఎరువులను వాడుతుంటారు. దీనివల్ల పెట్టుబడులు ఎక్కువ కావడంతో పాటు భూమిలో సారం తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడులు తగ్గించుకొనేందుకు మట్టి నమూనాలు ఉపయోగపడతాయని భావించిన కేంద్రం.. భూసార పరీక్షలకు శ్రీకారం చుట్టింది. నేల స్వభావాన్ని బట్టి ఎరువుల వినియోగించేలా.. అనువైన పంటలు సాగు చేసే విధంగా అన్నదాతలకు అవగాహన పెంచేందుకు ఇవి ఎంతో ఉపకరించనున్నాయి. గతంలో చేపట్టి వదిలేసిన భూసార పరీక్షలు మళ్లీ పురుడు పోసుకోనున్నాయి. జిల్లాకు ఒక మండలాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. 2024-25 సంవత్సరానికి జిల్లాలో నార్సింగి మండలాన్ని గుర్తించారు. ఈ మండలంలో 1607 మట్టి నమూనాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నార్సింగి మండలంలో 12,356 ఎకరాల భూమి ఉంది. ఇందులో 8035 ఎకరాలు సాగు భూమిగా వినియోగంలో ఉంది. 5439 మంది రైతులు ఉన్నారు. అలాగే 1680 ఎకరాలు నల్లరేగడి, 1250 ఎకరాలు ఎర్ర నేలలు, 5105 ఎకరాలు చల్క నేలలు ఉన్నాయి. 
ఇలా చేస్తారు: వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో) తన క్లస్టర్‌లో రెండున్నర ఎకరాలు(హెక్టారు)కు ఒక మట్టి నమూనా సేకరించాలి. ప్రతి క్లస్టర్‌లో ఓ ఆదర్శ రైతును ఎంపిక చేసుకొని రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ప్రదర్శన క్షేత్రం నిర్వహించాలి. ప్రయోగాత్మకంగా తీసుకున్న చోట జులై 10 లోపు నమూనాల సేకరణ పూర్తి చేయాలి. మట్టి నమూనాల వివరాలను సాయిల్‌ హెల్త్‌కార్డు పోర్టల్‌ మోబైల్‌ యాప్‌లో నమోదు చేయాలి. జులై 31 వరకు పరీక్ష కేంద్రంలో నమూనాల విశ్లేషణ పూర్తి చేయాలి. ఆగస్టు రెండో వారంలో పరీక్ష ఫలితాలను రైతులకు ఆరోగ్య కార్డు రూపంలో పంపిణీ చేయాలి.

పైలట్‌ ప్రాజెక్టుగా

జిల్లాలో చాలా మండలాల్లో ముందుగానే సాగు ప్రారంభమైంది. రామాయంపేట ఏడీఏ పరిధిలోని నార్సింగి మండలంలో కొంత ఆలస్యంగా నాట్లు, ఇతర పంటలు వేయనున్నారు. అందుకే ఇక్కడ మొదలుపెట్టాలని అధికారులు భావించారు. ముందుగా వానాకాలం సీజన్‌లో 40 శాతం పూర్తిచేసి మిగతాది ఏడాదిలో పూర్తిచేసి ఇవ్వనున్నారు. మట్టి నమూనా తీసిన ప్రతి చోట నేలకు సంబంధించిన ఆరోగ్య కార్డు ఇవ్వనున్నారు. ఆ కార్డును బట్టి ప్రతి సీజన్‌లో రైతులు ఎరువులు వేసుకోవటానికి అవకాశం ఉండనుంది.

రెండున్నర ఎకరాలకు ఒక నమూనా

గతంలో 25 ఎకరాలకు ఒక మట్టి నమూనా సేకరించేవారు. ఇప్పుడు మాత్రం రెండున్నర ఎకరాలకు ఒకటి చొప్పున తీయనున్నారు. దీంతో ప్రతి అంగుళంలో మట్టి గురించి తెలుసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. దీనిద్వారా ఏ నేలలో ఎంత మేర రసాయన ఎరువులు వాడవచ్చని తెలుస్తోంది. ఒక్కోచోట ఒక్కో విధంగా భూమి లోపల నిల్వలు ఉంటాయి. మట్టి నమూనాల వల్ల ఆ భూమిలో ఎంతమేరకు ఎలాంటి ఎరువులు వాడవచ్చునో పూర్తిగా తెలిసిపోతుంది. దీనిని బట్టి రైతులకు ఎరువుల ఖర్చు కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అంతేకాకుండా భూమిలో సారం పెరిగి దిగుబడులు కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఆరోగ్య కార్డుల ద్వారా రైతుకు తన భూమి ఎంతమేరకు సారవంతమో తెలిసి ముందుకు సాగేందుకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం నార్సింగి మండలంలో పూర్తిస్థాయిలో విజయవంతం అయితే జిల్లా వ్యాప్తంగా దీనిని అమలు చేయనున్నారు. రైతులు మట్టి నమూనాలు తీసి ఇస్తే వారికే మేలు జరుగుతుంది.

రైతులకు ఎంతో ప్రయోజనం: గోవింద్, డీఏవో

మట్టి పరీక్షలు చేయడం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. జిల్లాలో నార్సింగిని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేయటం జరిగింది. మట్టి నమూనాలు సేకరించిన చోట రైతులకు నేల ఆరోగ్య కార్డు ద్వారా ఫలితాలు అందిస్తాం. అందులో భూమికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. ఇది రైతుల వద్ద ఉంటే ఏ పంట సాగుచేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది, ఎరువుల మోతాదు ఎంత అనే విషయాలు ఏవోలు, ఏఈవోల ద్వారా తెలుసుకొని పంటలను పండించుకోవచ్చు. మట్టి నమూనాల సేకరణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టనున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని