logo

మాజీ పోలీసు కమిషనర్‌ భూమికి ఎసరు

మాజీ పోలీసు కమిషనర్‌తో పాటు మరికొందరికి చెందిన 57 ఎకరాల వ్యవసాయ భూమిని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అమ్మేందుకు యత్నించిన స్థిరాస్తి బ్రోకర్లు అడ్డంగా దొరికిపోయారు.

Updated : 11 Jul 2024 06:32 IST

ఫోర్జరీ డాక్యుమెంట్లతో అమ్మేందుకు యత్నం

నకిలీ డాక్యుమెంట్లు చూపుతున్న సీఐ అనిల్‌కుమార్‌

జోగిపేట న్యూస్‌టుడే: మాజీ పోలీసు కమిషనర్‌తో పాటు మరికొందరికి చెందిన 57 ఎకరాల వ్యవసాయ భూమిని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అమ్మేందుకు యత్నించిన స్థిరాస్తి బ్రోకర్లు అడ్డంగా దొరికిపోయారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట ఠాణా పరిధిలో జరిగిన ఘటన వివరాలను బుధవారం సీఐ అనిల్‌కుమార్‌ వెల్లడించారు. అందోలుకు చెందిన సైబరాబాద్‌ మాజీ కమిషనర్‌ శేరి ప్రభాకర్‌రెడ్డితో పాటు శేరి నర్సింహారెడ్డి, అంజమ్మ, బాలకృష్ణలకు గ్రామ శివారులో 57 ఎకరాల భూమి ఉంది. వాటిని అమ్మేందుకు బ్రోకర్లకు పట్టాపాస్‌ పుస్తకాలు, ఆధార్‌కార్డుల నకళ్లను ఫోన్‌లో పంపారు. వీటిని నారాయణఖేడ్‌లోని ముకుంద నాయక్‌ తండాకు చెందిన రవీందర్‌ తన స్నేహితుడైన సుధాకర్‌కు పంపాడు. వారు ర్యాకల్‌ గ్రామానికి చెందిన సంజీవరెడ్డితో కలిశారు. శేరి ప్రభాకర్‌రెడ్డితో పాటు మిగతావారి భూములను సంజీవరెడ్డికి అమ్మినట్లు జిరాక్సుల ఆధారంగా వారి సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ అగ్రిమెంట్‌ సృష్టించారు. వాటిని హైదరాబాద్‌లో పరిచయం ఉన్న ఎల్లయ్యకు పంపారు. ఆయన నగరంలోని గాజులరామారానికి చెందిన స్థిరాస్తి వ్యాపారి యాదగిరిరెడ్డికి చూపించాడు. భూమి కొనేందుకు అతను సంసిద్ధత వ్యక్తం చేయడంతో మే 3న ఈ నలుగురు యాదగిరిరెడ్డి వద్దకు వెళ్లారు. ప్రభాకర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, అంజమ్మ, బాలకృష్ణల వద్ద ఎకరాకు రూ.39లక్షల చొప్పున కొనేందుకు రూ.2కోట్లు అడ్వాన్సుగా ఇచ్చామని చెప్పి అగ్రిమెంట్‌ చూపించారు. ఎకరా రూ.40లక్షలకు అమ్ముతామని చెప్పడంతో యాదగిరిరెడ్డి అడ్వాన్సుగా రూ.11లక్షలు వారికి చెల్లించాడు. అనంతరం భూమి రిజిస్ట్రేషన్‌ కోసం యాదగిరిరెడ్డి.. సంజీవరెడ్డికి ఎప్పుడు ఫోను చేసినా తప్పించుకు తిరుగుతున్నాడు. అనుమానం వచ్చిన యాదగిరిరెడ్డి.. ఎల్లయ్య ద్వారా సుధాకర్, రవీందర్‌లను తీసుకొని ఈనెల 4న అందోలులోని వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి హద్దులు పరిశీలించారు. అక్కడే ఉన్న భూ యజమాని శేరి నర్సింహారెడ్డి మీరెవరని వారిని ప్రశ్నించారు. మేం ఈ భూమి కొన్నామని డాక్యుమెంట్లు చూపించారు. ఆశ్చర్యపోయిన అతను విషయాన్ని ప్రభాకర్‌రెడ్డికి వివరించారు. ఆయన విషయాన్ని జిల్లా ఎస్పీ రూపేష్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన ఆదేశాలతో జోగిపేట సీఐ అనిల్‌కుమార్‌.. నిందితుల కోసం వెతకడం ఆరంభించారు. బుధవారం నారాయణఖేడ్‌లో సంజీవరెడ్డి, రవీందర్, సుధాకర్‌లను అదుపులోకి తీసుకొని విచారించడంతో నేరం ఒప్పుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు ముగ్గురిపై కుట్ర, మోసం, ఫోర్జరీ చట్టాల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని