జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లకు మోక్షం!
2 నెలల్లో 2,873 పంపిణీ
సమీక్ష సమావేశంలో మంత్రి తలసాని
ఈనాడు, హైదరాబాద్: పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు సర్కారు చర్యలు ప్రారంభించింది. జేఎన్ఎన్యూఆర్ఎం, వాంబే గృహాలను క్రమంగా అర్హులకు అందజేస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో 2,873 ఇవ్వగా మరో 4వేల ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మించిన జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లను అర్హులకు కేటాయిస్తామని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు. నిరుపయోగంగా ఉన్న ఇళ్లను వినియోగంలోకి తీసుకొచ్చే అంశాలపై ఆయన మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ శర్మన్, సికింద్రాబాద్ ఆర్డీఓ వసంతకుమారితో సమావేశం నిర్వహించారు. నగరంలో 16 చోట్ల 2006-08 కాలంలో 10,178 జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లను నిర్మించారని ఆయన గుర్తుచేశారు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఇళ్లను నిరుపయోగంగా ఉంచడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశమై ఖాళీ ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.