చిత్ర వార్తలు
గూడు లేనోళ్ల గోడు ఇది
రోజురోజుకు చలితీవ్రత పెరుగుతోంది. ఇంట్లోనే దుప్పటి కప్పుకోకుండా ఉండలేని పరిస్థితి. అలాంటిది నగరంలో గూడు లేని వారు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కాదు. రహదారి పక్కన ఉండే కవర్లు, బ్యానర్లే వారికి రక్షణగా మారుతున్నాయి. చార్మినార్ ముందు చలికి తాళలేక ప్లాస్టిక్ కవర్ కప్పుకొని ఓ అభాగ్యుడు నిద్రిస్తూ ఇలా కనిపించాడు.
సివిల్స్ ర్యాంకర్‌కు కేటీఆర్ అభినందన
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2020 తుది పరీక్ష ఫలితాల్లో 83వ ర్యాంకు సాధించిన టీఎస్ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ కె.రాములు కుమార్తె కావలి మేఘనను మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రగతిభవన్‌లో సత్కరించారు. మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
- ఈనాడు, హైదరాబాద్
మనసును ఓలలాడించేలా..
ఓలా కంపెనీ తయారు చేసిన విద్యుత్తు ద్విచక్రవాహనాల(ఈవీ) టెస్ట్ డ్రైవ్‌ను నగరంలోని కొత్తగూడ కూడలి ఐటీ ప్రాంగణంలో ప్రారంభించారు. ఈవీల కొనుగోలుకు ప్రభుత్వం సైతం పలు రాయితీలు ఇస్తుండడంతో ప్రజలు ఆ దిశగా ఆసక్తి చూపుతున్నారు. శుక్రవారం పలువురు కొనుగోలుదారులు ఓలా బైక్‌ల పనితీరు గురించి అడిగి.. వాటిని నడిపి పరీక్షించడం కనిపించింది.
కాకతీయ శైలిలో మూర్తులు
మిరుదొడ్డి మండలంలోని మోతె గ్రామంలో ఉన్న లక్ష్మీనారాయణ విగ్రహం 13వ శతాబ్దం నాటిదని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు మహేశ్ తెలిపారు. ఆయన గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు. తోరణం, హారం, జయమాల తదితర ఆభరణాలతో సాలంకృతంగా ఉన్న లక్ష్మీనారాయణస్వామి విగ్రహం కాకతీయ కాలం నాటి శైలి అని వివరించారు.
- న్యూస్‌టుడే, మిరుదొడ్డి
నిద్ర సుఖ మెరగదు.. ప్రమాదం చెప్పిరాదు!
కూలీ నాలీ చేస్తే గానీ ఇల్లు గడవని నిరుపేదలు పనిచేసి శారీరక బడలికతో ఇటుక ట్రాక్టర్ పైనే ప్రమాదభరితంగా నిద్రపోతున్నారు. ఈ చిత్రం పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి సదాశివపేటకు వెళ్తుండగా కనిపించింది. అకస్మాత్తుగా బ్రేక్ వేసినా, వాహనం మరో వాహనాన్ని ఢీకొన్నా జరిగే నష్టానికి ఎవరు బాధ్యులని అటుగా వెళ్లేవారు వ్యాఖ్యానించడం వినిపించింది.
- ఈనాడు, సంగారెడ్డి
వెక్కిళ్లొస్తున్నాయి.. వాళ్లిక రారు!
అమ్మే శ్వాసగా నాన్నే ధ్యాసగా ఇన్నాళ్లు ఆడుతూపాడుతూ జీవిస్తున్న తొమ్మిదేళ్ల బాలుడికి వారు వెంటవెంటనే కానరాని దూరాలకు వెళ్లడంతో దుఃఖభాజనమైంది. మిరుదొడ్డి మండలం భూంపల్లికి చెందిన స్వామి, వెంకటవ్వ దంపతులు వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. వారికి తొమ్మిదేళ్ల కుమారుడు వెంకటేశ్ ఉన్నాడు. వెంకటవ్వ పది రోజుల క్రితం రక్తహీనత రుగ్మతతో చికిత్స పొందుతూ మృతి చెందింది. భార్య చనిపోవటంతో మనస్తాపానికి గురైన స్వామి అనారోగ్యం పాలై ఈ నెల 25న చనిపోయాడు. అమ్మానాన్నలను కోల్పోయిన బాలుడు విధిలేక అంత్యక్రియలను నానమ్మ, తాత ఆధ్వర్యంలో పూర్తి చేశాడు. చిన్న వయసులోనే ఎవరికీ రాకూడని కష్టాన్ని వెంకటేశ్ ఎదుర్కోవాల్సి రావడంతో గ్రామస్థులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. తన భవిష్యత్తేమిటో పూర్తిగా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్న చిన్నారి కళ్లలో కన్నీటి సుడులు తిరుగుతుండగా నానమ్మ, తాత ఒళ్లో సేదతీరుతున్నాడు. వెంకటేశ్‌ను తెరాస రాష్ట్ర నాయకుడు బక్కి వెంకటయ్య పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సాయం చేశారు. చదువు కోసం సాయం చేస్తానని చెప్పారు.
- న్యూస్‌టుడే, మిరుదొడ్డి
చిన్నా.. హాయిగా నిదురపో!
తను ఎంత అవస్థ పడుతున్నా బిడ్డకు కష్టం కలగకుండా చూస్తుంది అమ్మ. అందుకు నిదర్శనమే ఈ చిత్రం. బీదర్‌కు చెందిన సురేఖ బతుకుదెరవు కోసం వచ్చి సంగారెడ్డిలో ఉంటోంది. వీధుల్లో ప్లాస్టిక్ కాగితాలు, బాటిళ్లు... ఏరుకుంటూ వాటిని విక్రయించి జీవనం సాగిస్తుంది. ఆ పనిలో అలిసిపోయి పాత బస్టాండు రోడ్డులోని అంబేద్కర్ చౌరస్తాలో తన 9 నెలల చిన్నారితో ఇలా నిద్రిస్తోంది. బిడ్డకు ఇబ్బంది కలగకూడదని ట్రాఫిక్ స్టాండ్లకు చీరతో ఉయ్యాల కట్టి పడుకోబెట్టింది.
-ఈనాడు, సంగారెడ్డి
అమ్మవారికి ప్రత్యేక పూజలు
దామర్చేడ్ భవానీమాత అమ్మవారికి భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారాన్ని పురస్కరించుకొని సరిహద్దు కర్ణాటక భక్తులతో పాటు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన వారు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పీఠాధిపతి శంకర్స్వామి కార్యక్రమాలను నిర్వహించారు. - న్యూస్‌టుడే, బషీరాబాద్