ఉదయం అచ్చు యంత్రంపై.. రాత్రి చోర తంత్రంలో..!
దుబ్బాక, న్యూస్‌టుడే: అచ్చు వేసే పనులు చేసుకొనే యువకుడు రాత్రి కాగానే దొంగతనాలకు పాల్పడుతున్నాడు. దుబ్బాక పట్టణంలో పోలీసులు తనిఖీ చేయగా పట్టుబడ్డాడు. ఎస్సై మన్నె స్వామి తెలిపిన వివరాలు.. మూడు నెలల క్రితం దుబ్బాకలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, లచ్చపేటలోని జిల్లా పరిషత్ పాఠశాలలో కంప్యూటర్ మానిటర్లు, సీపీయూ, మదర్ బోర్డులు, స్కానర్లు, ప్రింటర్లు, డిజిటల్ కీబోర్డులు చోరీకి గురయ్యాయి. నిర్వాహకులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం స్థానిక బస్టాండ్ వద్ద చేతిలో సంచి మూటతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న దుబ్బాక పట్టణానికి చెందిన కాల్వ సురేశ్‌ను పట్టుకొన్నారు. తనిఖీ చేయగా దానిలో కంప్యూటర్ సామగ్రి కనిపించింది. ప్రశ్నించడంతో పొంతన లేని సమాధానాలు చెప్పాడు. పోలీసులు విచారించగా బళ్లలో దొంగతనాలు చేసినట్లు, పట్టణంలో మరికొన్నిచోట్ల ప్రయత్నించినట్లు అంగీకరించాడు. చోరీ చేసిన సామగ్రిని నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో సొంతంగా ప్రింటింగ్ వర్క్ దుకాణం నిర్వహిస్తున్నాడు. తాగుడుకు బానిసై చోరీలకు పాల్పడుతున్నాడు. కోర్టులో హాజరు పరిచి రిమాండుకు తరలించారు. సమావేశంలో శిక్షణ ఎస్ఐ చేర్యాల విజయ్ పాల్గొన్నారు.